ముంబయి ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం అతలాకుతలమవుతోంది. కరోనా వైరస్ ముంబయి మహానగరాన్ని వీడటం లేదు. ముంబయి మహానగరంలో కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో తొలి [more]

Update: 2020-06-01 17:30 GMT

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం అతలాకుతలమవుతోంది. కరోనా వైరస్ ముంబయి మహానగరాన్ని వీడటం లేదు. ముంబయి మహానగరంలో కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో తొలి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగానే ఉంది. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. లాక్ డౌన్ మినహాయింపుల ద్వారా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇది ముంబయి వాసులను వణికిస్తోంది.

తొలి నుంచి అంతే…..

మహారాష్ట్రలో తొలి నుంచి కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయి. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారిని త్వరగా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమయింది. దీంతో వ్యాధి తీవ్రత ఎక్కువయింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకింది. వందల సంఖ్యలో పోలీసులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. చివరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు కూడా వైరస్ సోకిందంటే వ్యాధి తీవ్రత గురించి వేరే చెప్పనక్కర లేదు.

సగం కేసులు ముంబయిలోనే….

మహారాష్ట్రలో ఇప్పటికే యాభై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముప్పయి వేలు కేసులు ఒక్క ముంబయి నగరంలోనే ఉన్నాయి. దాదాపు ముప్పయివేలకు పైగా ముంబయిలో కేసులు నమోదయ్యాయి. మద్యం షాపులు తెరిచిన వెంటనే ముంబయి, పూనేల్లో భౌతిక దూరం పాటించకుండా జనం ఎగబడటంతో మళ్లీ మద్యం షాపులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో విడత లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

మురికి వాడలోనే….

రోజుకు రెండు వేల కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. దీంతో పాటు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవికి కూడా వైరస్ చుట్టుకోవడంతో ఇప్పట్లో ముంబయి నగరం కోలుకోలేదనే చెబుతున్నారు. మురికివాడలోనే పదిహేను వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత సాధారణ జీవనం ప్రారంభమయింది. దీనివల్ల కేసులు మరింతగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారిని ఆ రాష్ట్రాలు అనుమతించడం లేదు. ఒకవేళ వచ్చినా అన్ని పరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ముంబయి నగరాన్ని కరోనా మహమ్మారి వదిలేటట్లు కన్పించడం లేదు. ఈ నెల 31వ తేదీ వరకూ మహారాష్ట్రలో లాక్ డౌన్ ను విధించారు. దీనిని పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News