పొలిటికల్ లైఫ్ లేనట్లే.....!

Update: 2018-09-10 16:30 GMT

ప్రధాని కావాలని కలలు కన్నారు. అది చిరకాల వాంఛ అని బహిరంగంగా పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో తన మనసులోని మాటను వెల్లడించారు. అయినా ప్రజలు కరుణించలేదు. ఈ అసంతృప్తితోనే కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితం పరిసమాప్తం కానుంది. చివరకు కుటుంబ జీవితం కూడా ఆయనను కలచి వేసింది. రాజకీయాలకు సంబంధించి కుటుంబంలో రేగిన కలతలు పెద్దాయనను కలచివేశాయి. ఇదీ స్థూలంగా ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఆజంఘర్ లోక్ సభ సభ్యుడిగా ఉన్న ములాయంసింగ్ కు రాజకీయ భవిష్యత్ పై పెద్దగా ఆశలు, అంచనాలు లేవు. తాన స్ధాపించిన సమాజ్ వాదీ పార్టీని ఒక్కతాటిపై నడిపించడమూ కష్టంగా ఉంది. ఒకపక్క పైబడుతున్న వయస్సు, మరోపక్క కుటుంబంలో కలతలు, రాజకీయ ప్రత్యర్థులు బలోపేతం అవుతుండటం ఈ మల్లయోధుడికి కునుకుపట్టనీయడం లేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా చక్రం తిప్పిన ములాయం ప్రస్తుతం నిస్సహాయంగా మిగిలిపోయారు.

ఎన్నో పదవులు......

1939 నవంబరు 21న జన్మించిన ములాయం సింగ్ రాజకీయ శాస్త్రంలో పీజీ చేశారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మాలతీదేవి 2003లో మరణించారు. ఆమె కుమారుడే అఖిలేష్ యాదవ్. 1980ల్లో సాధనగుప్తాను పరిణయమాడారు. చాలా కాలం వరకూ ఈ విషయం వెలుగులోకి రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో బంధుత్వం ఉంది. ఇక రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1977లో ఇందిరాగాంధీని ఆమె సొంత నియోజకవర్గంలోని రాయబరేలిలో ఓడించిన ఘనత రాజ్ నారాయణ్ ది. ఆయన 1977లో జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి పనిచేశారు. ములాయం 1967లో మొదటి సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికవుతూనే ఉన్నారు. మొత్తం ఎనిమిది సార్లు ములాయం శాసనసభకు ఎన్నికయ్యారు. 1977లో రాష్ట్రమంత్రి అయ్యారు. 1980లో రాష్ట్ర లోక్ దళ్ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982లో శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై 1985వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో రాజకీయంగా మరింత రాటుదేలారు.

దశ తిరిగింది ఇక్కడే......

అనంతరం రాజకీయంగా ములాయం దశ తిరిగింది. 1990లో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. ఇది ఆయన రాజకీయ చరిత్రలో కీలకమలుపు. 1990 నవంబరులో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం చంద్రశేఖర్ సాయంతో ఏర్పడిన జనతాదళ్ (ఎస్)లో చేరారు ములాయం. అటు కేంద్రంలో చంద్రశేఖర్ కు, ఇటు రాషట్్రంలో ములాయంకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1991 ఏప్రిల్ లో ములాయం రాజీనామా చేశారు. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తో పొత్తు పెట్టుకుని విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లోనే ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమం ఆరంభమైంది. దీనిని ఆయన అణిచి వేశారు. ఈ సందర్భంగా 1994 అక్టోబర్ 2న ముజఫర్ నగర్ లో పోలీసు కాల్పులు జరిగాయి. 1996 జూన్ వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1996లో జరిగిన 11వ లోక్ సభ ఎన్నికల్లో ‘‘మెయిన్ పురి’’ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. హెచ్.డి.దేవెగౌడ, ఐ.కే.గుజ్రాల్ మంత్రివర్గాల్లో అత్యంత కీలకమైన రక్షణ శాఖ సారథిగా వ్యవహరించారు.

వరుసగా ఎన్నికై.......

1998 లోక్ సభ ఎన్నికల్లో ‘‘సంభాల్’’ నుంచి మళ్లీ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999లో సంభాల్, కనౌజ్ నియోజకవర్గాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కనౌజ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి కుమారుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు. 2003లో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదే ఏడాది సెప్టెంబరు నెలలో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. స్వతంత్ర శాసనసభ్యులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో కొంతకాలం ప్రభుత్వాన్ని నడపగలిగారు. అప్పట్లో ఆయన ఎంపీగా ఉండేవారు. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ అసెంబ్లీకి పోటీ చేశారు. గున్నేక నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచారు. 2004లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ మెయిన్ పురి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ములాయం పాత్ర తెరవెనకకే పరిమితమైంది. 2014లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ చరిత్రలో అన్నితక్కువ స్థానాలు ఎప్పుడూ రాలేదు. మొత్తం 80కి గాను కేవలం అయిదు స్థానాలే వచ్చాయి. నాటి ఎన్నికల్లో ఆజంఘర్, మెయిన్ పురి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మెయిన్ పురికి రాజీనామా చేశారు. నాటి ఎన్నికల్లో ములాయం కోడలు డింపుల్ యాదవ్, మేనల్లుడు ధర్యేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, మరో దగ్గర బంధువు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ లు మాత్రమే లోక్ సభకు ఎన్నిక కావడం గమనార్హం. నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ దెబ్బకు సమాజ్ వాదీ

కుదేలయింది.

అప్పటి నుంచే కలహాలు.....

2012లో అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ తో అఖిలేష్ యాదవ్ కు విభేదాలు ఏర్పడ్డాయి. ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ తో అఖిలేష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ములాయం మద్దతు మాత్రం శివపాల్ యాదవ్ కే ఉండేది. దీంతో ములాయం పూర్తిగా అఖిలేష్కు దూరమయ్యారు. దీంతో 2016 డిసెంబరు 30న ములాయం తన కుమారుడు అఖిలేష్, సోదరుడు రాంగోపాల్ యాదవ్ లను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే 24గంటల్లోనే ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇక కష్టమే.....

తాజాగా ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సమాజ్ వాదీ శక్తి మోర్చా పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాచరు. మొత్తం 80 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ములాయం ఇరుకున పడ్డారు. కుమారుడిని సమర్థించాలా? లేక సోదరుడికి మద్దతివ్వాలా? అన్న ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తాజాగా ఫూల్ పూర్, గోరఖ్ పూర్ లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ లు సమైక్యంగా పోటీ చేసి బీజేపీని నిలువరించాయి. దీంతో విపక్షం ఐక్యతకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక ములాయంకు చికాకులు కలిగిస్తోంది. ప్రస్తుతానికి పార్టీలో అఖిలేష్ దే పైచేయిగా కన్పిస్తోంది. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిషేక్ సింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ములాయం, ఆయన సోదరుల ప్రభావం మసకబారినట్లు కన్పిస్తోంది. ములాయం రాజకీయ భవిష్యత్తు ఇక కష్టమే. ఢిల్లీ పీఠాన్ని ఏలాలన్న ఆయన కోరిక నెరవేరే అవకాశం ఎంతమాత్రం లేనే లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News