ముద్ర రగడ తో టీడీపీకే దెబ్బ ?

ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రిగా కంటే కాపు నాయకుడిగానే బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ఒక బలమైన సామాజికవర్గం కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా [more]

Update: 2021-01-26 12:30 GMT

ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రిగా కంటే కాపు నాయకుడిగానే బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ఒక బలమైన సామాజికవర్గం కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి ముందుకు సాగారు. ముద్రగడ పద్మనాభం కోరుకుంటే ఈ పాటికి ఏదో ఒక పార్టీలో కుదురుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో టాప్ లెవెల్ లో ఉండేవారు. కానీ మంచికో చెడ్డకో ఆయన ఒక నిర్ణయం తీసుకుని మూడు దశాబ్దాలుగా దాని మీదనే పోరాడుతున్నారు. ఒక విధంగా ముద్రగడ రాజకీయాలకు దూరమే అని చెప్పాలి.

కష్టమేనా…?

ఇక ముద్రగడ పద్మనాభంకు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ని పార్టీలో చేరమని కోరింది. ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశారు. అయితే ముద్రగడ పద్మనాభం నుంచి ఆశాజనకమైన సమాధానం రాలేదు అంటున్నారు. తాను కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారని అంటున్నారు. కాపులను బీసీలలో చేరిస్తే తన మద్దతు బీజేపీకి ఉంటుందని చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ బహు కష్టమైన షరతుని ముద్రగడ పద్మనాభం పెట్టడంతో బీజేపీకి ఇబ్బందికరమే అంటున్నారు. కేంద్రం ముందు ఎన్నో ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. కాపులకు రిజర్వేషన్లు అంటే కొత్త చిచ్చు రాజేసినట్లేనని కూడా చెబుతున్నారు.

అదేనా ఎత్తుగడ….

అయితే ముద్రగడ పద్మనాభంను సోము వీర్రాజు కలవడంలో వేరే ఆంతర్యం ఉందని కూడా అంటున్నారు. ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలకు ఆల్టరెన్షన్ గా బీజేపీ ఉందని, కాపుల మద్దతు ఆ పార్టీకి కావాలన్నది ఆయన ఆలోచన. ముద్రగడ ఎస్ అన్నా నో అన్నా కూడా ఆయనతో భేటీ వేయడం ద్వారా కాపుల మనసుల్లోకి బీజేపీ చొచ్చుకుపోయేందుకే సోము ఇలా పావులు కదిపారు అంటున్నారు. ఓ వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో వైపు సోము వీర్రాజు అదే సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇపుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ ద్వారా కాపులకు రాజకీయ వేదికగా బీజేపీ జానసేన‌ కూటమి ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికే వీర్ర్రాజు ఈ టూర్ వేశారని అంటున్నారు.

సైకిల్ కే బ్రేకులు…

గోదావరి జిల్లాలలోని కాపులు గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేనల మధ్యన చీలిపోయారు. రేపటి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. అయితే బీజేపీ దూకుడు చేయడం వల్ల టీడీపీకి వేయాల్సిన ఓట్లే ఆ బీజేపీ జనసేన కూటమికి ఎక్కువగా మళ్ళుతాయని అంటున్నారు. మరో వైపు జగన్ ఎటూ కాపుల రిజర్వేషన్ డిమాండ్ కుదరదు అని ఎన్నికల ముందు చెప్పేశారు. ఇలా కాపుల ఓట్ల కోసం టీడీపీ బీజేపీ పోటీ పడితే బీసీలు పోలరైజ్ అవుతారని, అది వైసీపీకే లాభమని అంటున్నారు. మొత్తానికి కాపుల ఓట్ల కోసం జరిగే పోరులో అంతిమంగా నష్టపోయేది టీడీపీ అయితే గతం కంటే తమ పొజిషన్ ని బీజేపీ జనసేన కూటమి మెరుగు పరచుకుంటాయని అంటున్నారు. పైగా ముద్రగడ పద్మనాభం అంటే బాబుకు యాంటీ అన్న భావన ప్రతీ కాపులో ఉంది కాబట్టి ఆ నష్టం కష్టం సైకిల్ కే రిపేర్లు తెస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు.

Similar News