ముద్రగడకు ఇచ్చిన బంపర్ ఆఫర్ అదేనా?

బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో గట్టిగా పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతుంది. కులాల లెక్కలే ఆధారంగా ఆ పార్టీ అడుగులు ముందుకు పడుతున్నాయి. కోస్తా లో బలమైన [more]

Update: 2021-01-17 03:30 GMT

బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో గట్టిగా పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతుంది. కులాల లెక్కలే ఆధారంగా ఆ పార్టీ అడుగులు ముందుకు పడుతున్నాయి. కోస్తా లో బలమైన కాపు సామాజిక వర్గం తమవైపు అండగా వస్తే మిగిలిన వర్గాల ఓట్లతో ప్రధాన పక్షానికి ఎదగాలన్న ఎత్తుగడతో కమలం స్కెచ్ గీస్తుంది. అందులో భాగంగానే కలిసి వచ్చిన జనసేనను చెయ్యి పట్టుకు నడిపిస్తూ పొరపాటున సేన తోక జాడిస్తే ఆ సామాజికవర్గం ఓటర్లు తమనుంచి దూరం కాకుండా ఉండేందుకు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటి వారికి వల విసురుతుంది.

ఉద్యమానికి ముద్రగడ …?

చాలా కాలం క్రితమే సోషల్ మీడియా లో తనపై వస్తున్న విమర్శలు ఆరోపణలకు మనస్థాపం తో కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం రాం రాం చెప్పేశారు. ఆయన అలా తప్పుకోవడానికి బలమైన కారణం బిజెపి లో చేరేందుకా అన్న సందేహాలు ఇప్పుడు విశ్లేషకుల్లో వస్తున్నాయి. సుదీర్ఘ ఆలోచనతోనే ఆయన కాపు రిజర్వేషన్ల అంశానికి తాను దూరం గా ఉంటున్నట్లు ప్రకటించారని ఇప్పుడు పలువురు భావిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వద్దన్నా కాపు రిజర్వేషన్ల పోరాటానికి ఎప్పటినుంచో ఐకాన్ గా మారిపోయారు. దాంతో బిజెపి ఏంటో కాలంగా ముద్రగడకు గాలం వేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. తాజాగా బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ సానుకూలంగా జరగడాన్ని బట్టి త్వరలోనే కోస్తా కాపు ప్రముఖుడు కాషాయం కండువా కప్పేసుకుంటారనే అంతా భావిస్తున్నారు.

ఆఫర్లు ఇవేనా …?

ముద్రగడ పద్మనాభం సీనియర్ రాజకీయ నేత. మంత్రిగా పనిచేసిన అనుభవశాలి. ఆయనకు తగిన రీతిలో ఆఫర్ లేనిదే బిజెపి కండువా కప్పుకునేందుకు ముందుకు రారారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే తాజాగా బిజెపి కి ఆయనకు మధ్య నడిచిన చర్చల్లో ముద్రగడ పద్మనాభంను రాజ్యసభకు పంపేందుకు పార్టీ ఆలోచన చేసి ఉంటుందని భావిస్తున్నారు. కానీ కోస్తా లో బలమైన నెట్ వర్క్ ఉన్న ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో తన అనుచర వర్గానికి కొన్ని టిక్కెట్లు కోరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ రెండిటిలో ఎదో ఒక రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతుంది. అయితే వీటిలో ఏది నిజం అన్నది ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకునే వరకు వేచి చుడాలిసి ఉంది.

Tags:    

Similar News