మళ్లీ యాక్టివ్ అవుతారట.. ఆ ఎన్నికకు ముందే?

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2020-12-20 00:30 GMT

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరమయిన ముద్రగడ పద్మనాభం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్లనే కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని కూడా వదిలేశాయన్న వార్తలు వచ్చాయి.

బీజేపీ నేతల వత్తిడి…..

అయితే ముద్రగడ పద్మనాభం ఇటీవల ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ కూడా రాశారు. అయితే ముద్రగడ పద్మనాభంను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. జనసేన కూడా బీజేపీతో కలవడంతో ముద్రగడ పద్మనాభం బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కీలక పదవిని….

కానీ ఇప్పుడే వద్దని చెప్పినా బీజేపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికలకు ముందే పార్టీలోకి రావాలని ముద్రగడ పద్మనాభంను కోరినట్లు తెలిసింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ ముద్రగడ పద్మనాభం పాల్గొనేలా చేయాలని బీజేపీ నేతల ఆలోచనగా ఉంది. ముద్రగడ పద్మనాభం పార్టీలోకి వస్తే ప్రాధాన్యతతో పాటు ముఖ్యమైన పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ముద్రగడ పద్మనాభం తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లోకి రావాలనేనా?

కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పక్కకు పెట్టిన తర్వాత ముద్రగడ పద్మనాభం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే కాపు ఉద్యమాన్ని వదిలేశారని కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పార్టీలోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనేక ప్రాంతాల్లో పార్టీకి లాభించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తుంది. అందుకే ముద్రగడపై బీజేపీ వత్తిడి తెస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరతారన్న ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది.

Tags:    

Similar News