ముద్రగడ ఇచ్చింది స్మాల్ బ్రేకేనట… మళ్లీ…?

కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం గా మారాయి. సోషల్ మీడియా లో వచ్చే పోస్ట్ [more]

Update: 2020-07-15 08:00 GMT

కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం గా మారాయి. సోషల్ మీడియా లో వచ్చే పోస్ట్ లకు మనస్థాపం చెంది తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆయన పేర్కొనడం మరింత చర్చనీయం అయింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయనే కోణం పై పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. విలక్షణమైన మనస్తత్వం విభిన్న ఉద్యమాలు, ఆకస్మిక నిర్ణయాలు ముద్రగడ పద్మనాభం సొంతం. ఆయన రాజకీయ జీవితం మొత్తం ఇదే రకంగా నడుస్తూ వచ్చింది.

అప్పుడు కూడా అలాగే …

2009 లో ముద్రగడ పద్మనాభం పిఠాపురం శాసన సభ స్థానంలో ఓటమి పాలయ్యారు. అది కూడా అయన కన్నా రాజకీయాల్లో జూనియర్ అయిన వంగా గీతపై కావడం ఆయనకు మనస్థాపం కలిగించింది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం అత్యధికం అని అంచనాతో, తాను ఎప్పుడు పోటీ చేసే ప్రత్తిపాడు నియోజకవర్గం వదిలి పిఠాపురం వచ్చారు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు కావడంతో బాటు అక్కడి నియోజకవర్గం వారితో బంధుత్వాలు స్నేహాలు కూడా ఆయనకు అధికమే. అయినా కానీ ఓటమి పాలయ్యారు ముద్రగడ పద్మనాభం.

కాపులే ఓడించారని …

తన ఓటమికి కాపులే కారణమని లెక్కేసి వారు తన వద్దకు రావలిసిన పని లేదంటూ బోర్డు కూడా పెట్టేశారు ఆయన. నిజానికి నాటి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభావంతో పిఠాపురం యూత్ ఊగిపోయింది. ఫలితంగా వంగా గీత ప్రజారాజ్యం గెలిచిన అతి కొద్ది సీట్లలో ఒకరుగా గెలిచారు. కానీ ముద్రగడ పద్మనాభం నాటి పరాజయం తరువాత చాలాకాలం మౌనమే దాల్చారు. కాపు లపై రగిలిపోయేవారు.

బాబు హామీ వల్లే బయటకు వచ్చి …

2014 లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కులానికో హామీ కొట్టారు. దాంట్లో కాపు కార్పొరేషన్ ఏర్పాటు, బిసిల్లో కాపు లను కలుపుతామని చెప్పడం అధికారం చేపట్టాక విస్మరించడంతో ముద్రగడ పద్మనాభం మరోసారి నాటి ఉద్యమానికి తెరతీశారు. దాన్ని అణచివేసే క్రమంలోనే పోలీసు కేసులు ముద్రగడ దీక్షలను భగ్నం చేసే క్రమంలోనే ఆయన్ను కుటుంబాన్ని ఖాకీలతో కొట్టించడంతో ఆయన చంద్రబాబు పై రగిలిపోయారు. ముద్రగడ పద్మనాభం టిడిపి పాలన ఉన్నంత కాలం బాబు కంటిమీద నిద్ర లేకుండా ఎదో ఒక వత్తిడి తెస్తూనే ఉండేవారు. అన్ని అయ్యాకా ఈ ప్రభుత్వం నశించాలంటూ శాపనార్ధాలు సైతం పెట్టారు. అప్పటివరకు పండగలు చేసుకోనని ప్రతిజ్ఞ చేసి అనుకున్నట్లే సర్కార్ మారిపోయాకా సంబర పడ్డారు.

జగన్ సర్కార్ వచ్చాక …

జగన్ సర్కార్ వచ్చాక కూడా ముద్రగడ పద్మనాభం ఖాళీగా ఏమీ లేరు. తరచూ రిజర్వేషన్ల అంశం పై లేఖలు రాస్తూ ఉండేవారు. అయితే ఎన్నికల్లో ముందుగానే జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్లు ఇచ్చే అంశం తమ చేతుల్లో లేదని రాజ్యాంగ సవరణతో జరిగే ఈ ప్రక్రియ కేంద్రమే చేయాలిసిన పని అంటూ సత్యం చెప్పేశారు. దాంతో ముద్రగడ పద్మనాభం గట్టిగా వత్తిడి తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు జనసేన ఘోర వైఫల్యం కూడా ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని కాపులు పట్టించుకోకపోవడంతో పాటు సొంత కులం వైపు పూర్తి స్థాయిలో లేరన్న క్లారిటీ కి వచ్చేశారని తెలుస్తుంది.

చుట్టుముట్టిన సమస్యలు …

ఇలాంటి పరిస్థితుల్లో కాపులనుంచి సరైన సహకారం అందక పోగా సూటి పోటీ మాటలతో ముద్రగడ పద్మనాభంను కాపు సామాజికవర్గం వారే కించపరచడం తట్టుకోలేక పోయారని చెబుతున్నారు. ఎవరి సహకారం సరిగ్గా లేకుండా మళ్ళీ రంగంలోకి దిగితే తనది ఒంటరి పోరాటం గా మిగిలిపోతుందన్నది అంచనా వేసుకునే ఉద్యమ కాడి వదిలేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు పెద్ద వయసు రావడం, భార్య అనారోగ్యం వంటి వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఆయన్ను చుట్టూ ముట్టాయని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఇలా అన్ని కారణాలతో చేయలేని పనిని నెత్తికి పెట్టుకుని ఉద్యమించడానికి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేసుల వ్యవహారంలో కోర్ట్ ల చుట్టూ తిరగడం అవసరం లేదని భావించే గుడ్ బై చెప్పారని తెలుస్తుంది. అయితే మళ్లీ ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం చేపట్టే అవకాశముంది.

Tags:    

Similar News