ముద్రగడ డిసైడ్ అయిపోయారా?

ముద్రగడ పద్మనాభం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లే కన్పిస్తుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గానికి నాయకత్వం వహించారు. గతంలో చంద్రబాబు [more]

Update: 2020-11-04 03:30 GMT

ముద్రగడ పద్మనాభం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లే కన్పిస్తుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గానికి నాయకత్వం వహించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లపాటు ముద్రగడ పద్మనాభం యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ పాదయాత్ర కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పాదయాత్ర జరగలేదు.

కాపు ఉద్యమం నుంచి తప్పుకుని…..

దీంతో పాటు కాపు రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలను ముద్రగడ పద్మనాభం నిర్వహించారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను తిరిగి నాయకత్వం చేపట్టాలని వత్తిడి తెచ్చినా ఫలితం లేదు. ఆయన ఈ ప్రతిపాదనకు సున్నితంగా తిరస్కరించారు.

కిర్లంపూడికే పరిమితం…..

కానీ గత కొద్ది నెలలుగా ముద్రగడ పద్మనాభం కిర్లంపూడికే పరిమితమయ్యారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందుల పాలయ్యానని ముద్రగడ పద్మనాభం సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారన్న వాదన కూడా లేకపోలేదు. తన రాజకీయ ఎదుగుదలకు కాపు రిజర్వేషన్ ఉద్యమం అడ్డంకిగా మారిందని ఆయన భావించినట్లు వార్తలు వచ్చాయి.

బీజేపీలో చేరతారని…?

ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రోజున ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. గతంలో సోము వీర్రాజు కూడా ముద్రగడతో చర్చలు జరిపారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరింది. కానీ ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరేందుకు కూడా విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఆయన తాను ఇక రాజకీయాల్లో కొనసాగలేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం తాను నేరుగా చెప్పకపోయినా ఆయన రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటించేనట్లేనన్న టాక్ ఉభయ గోదావరి జిల్లాలో నడుస్తుంది.

Tags:    

Similar News