పేరుకే హీరో లు … నిజ జీవితంలో మాత్రం?

సమాజానికి సందేశాలు ఇచ్చేవి సంస్కరణలకు బాటలు వేసేవి సినిమాలు. వీటిలో హీరోలు ఇచ్చే మెసేజ్ లనే సమాజం ఫాలో అవుతుంది. లక్షలు కోట్లమంది అభిమానులను సినిమాల ద్వారా [more]

Update: 2021-08-07 09:30 GMT

సమాజానికి సందేశాలు ఇచ్చేవి సంస్కరణలకు బాటలు వేసేవి సినిమాలు. వీటిలో హీరోలు ఇచ్చే మెసేజ్ లనే సమాజం ఫాలో అవుతుంది. లక్షలు కోట్లమంది అభిమానులను సినిమాల ద్వారా సంపాదించుకునే కొందరు హీరోలు మాత్రం నిజ జీవితంలో అంత ఆదర్శంగా ఏమి ఉండరని అనేక సందర్భాల్లో వివిధ సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి. కొందరు హీరోలు అయితే విలన్ల కన్నా దారుణంగా ప్రవర్తించిన సంఘటనలు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయి. పన్నుల ఎగవేతలో చిత్రసీమకు చెందిన వారు లెక్కకు మించే ఉంటారన్నది సినీ పరిశ్రమపై జరిగే ఐటి దాడులు తరచూ స్పష్టం చేస్తూ ఉంటాయి. అలా పన్నులు ఎగవేయడం కన్నా కోర్టు ద్వారానే అఫీషియల్ గా తాము చేస్తున్న దేశ సేవకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలంటూ బరితెగించి కల్చర్ కు తెరతీశారు కొందరు. ఆ కోవలోనే ఇటీవల పన్నులు ఎగవేయడానికి నిస్సిగ్గుగా కోర్టు లకు సైతం ఎక్కి పబ్లిక్ లో వీక్ అయ్యారు తమిళ హీరోస్.

విజయ్ కి చీవాట్లు పెట్టినా …

ఒక ఖరీదైన విలాసవంతమైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఆ మధ్య తమిళ హీరో విజయ్ మద్రాస్ హై కోర్టు తలుపు తట్టారు. దీనిపై కోర్టు ఆయనకు చీవాట్లు పెట్టి లక్ష రూపాయలు జరిమానా సైతం విధించింది. పన్నులు చెల్లించడంలో ఆదర్శంగా ఉండాలని హితబోధ చేసింది. ఈ ఉదంతం మరువక ముందే రజనీకాంత్ అల్లుడు తమిళ హీరో ధనుష్ సైతం ఇలాగే రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకుని పన్ను మినహాయింపు కోరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు గడ్డి పెట్టింది హై కోర్టు యాభై రూపాయలు పెట్టి పెట్రోల్ పోసుకుని బండి మీద తిరిగే సామాన్యుడు సబ్బు కొన్నా టాక్స్ కడుతుంటే కోట్ల రూపాయలు పారితోషికాలు తీసుకుంటూ కూడా మీకు ఇదేమి పోయేకాలం అంటూ ధనుష్ కి తలంటింది కోర్ట్.

గన్ లు పట్టి విలన్లు అయి …

తెలుగు లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. అయితే వారిద్దరూ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు నెగిటివ్ క్యారెక్టర్ లను ప్రజల్లోకి పంపాయి. ఒక సందర్భంలో గన్ పట్టుకుని వీధుల్లోకి వచ్చి దాన్ని పోలీసులకు సరెండర్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన ఒక హైడ్రామా గా ఇప్పటికి చర్చనీయమే. ఇప్పటికి బాలయ్య బాబు కు తిక్క రేగితే అవతల అభిమాని అయినా మరెవరైనా గూబ గుయ్యి మనడం ఖాయమని సోషల్ మీడియా లో అప్పుడప్పుడు వచ్చే వీడియో లు చెప్పకనే చెబుతుంటాయి. హీరో లు గా ఉంటూ వారు చేసింది అభిమానులకు నచ్చినా ప్రజలు మాత్రం వీరికి ఇదేమి పిచ్చి అనేలా టాక్ సాగింది.

సోనూ ను చూసైనా …

ఇప్పుడు దేశం మొత్తం సోనూ సూద్ కోసం మాట్లాడుతుంది. దీనికి కారణం ఆయన సినిమాల్లో పోషించేది విలన్ క్యారెక్టర్ అయినా సమాజానికి సేవలు చేయడంలో హీరో లకు మించి పోయారు. కరోనా కష్టకాలంలో అప్పులు చేసి మరీ అభాగ్యులను ఆదుకునేందుకు తనవంతు అద్భుత కృషి చేస్తూ అందరికి ఆదర్శం అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో విలన్ గా ఉండే సోనూ సూద్ పై చెయ్యి కాలు ఎత్తి కొట్టాలంటేనే ఆ షాట్ మార్చాలని హీరోలు సైతం డైరెక్టర్ లపై వత్తిడి తెచ్చే రేంజ్ కి ఆయన ఎదిగిపోయారు. సోనూ అభిమానులనుంచి వచ్చే రియాక్షన్ కి భయపడే హీరోలు ఇలా అయిపోయారంటే ఆశ్చర్యమే. సోనూ చారిటి చూశాకా చాలామంది హీరోల్లో సైతం కదలిక వచ్చి ఎంతోకొంత సమాజ సేవకు నడుం కట్టారు. ఇప్పటికైనా పన్నులు కట్టడానికి బాధపడుతూ ఎగవేయడానికి మార్గాలు అన్వేషించే కొందరు సినీ హీరోలు నిజ జీవితంలో హీరోలు గా మారేందుకు కోర్టు లు వేస్తున్న అక్షింతల తరువాతైనా మారతారేమో చూడాలి.

Tags:    

Similar News