వైఎస్సార్, బాబు స్నేహ బంధం ?

ఇది వినడానికే కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలు బాగా దగ్గరగా చూసిన వారికి తెలిసిన వారికి ఈ ఇద్దరూ పరమ శత్రువులు అన్నదే తెలుసు. ఇపుడు [more]

Update: 2020-08-13 12:30 GMT

ఇది వినడానికే కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలు బాగా దగ్గరగా చూసిన వారికి తెలిసిన వారికి ఈ ఇద్దరూ పరమ శత్రువులు అన్నదే తెలుసు. ఇపుడు వైఎస్సార్ వారసుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు ఆయన కనీసం ముఖాముఖాలు చూసుకోరు. నిరంతరం చంద్రబాబు వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శిస్తారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. ఓ విధంగా జగన్ ఇగోను హర్ట్ చేయడానికి ఈలోకంలో లేని కుటుంబ సభ్యుల ప్రస్తావనను కూడా తరచూ తెస్తారు. వైఎస్సార్ కి తనంటే భయమని, అందుకే నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా తాను చెప్పిన వాటిని సవరించుకుని పాలన చేశారని కూడా చెబుతారు. మరి ఇంత పచ్చిగా నారా, వైఎస్ కుటుంబాల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూంటే వైఎస్, చంద్రబాబు మంచి స్నేహితులు అని చెబితే అది అతిశయోక్తిగానే ఉంటుందేమో.

సినిమాగానా…?

ఇపుడు సినిమాల కధలు మారిపోతున్నాయి. పురాణ పురుషులు, చారిత్రక కధలు అయిపోయాయి. సంచలనమే కధగా చేసుకుంటున్నారు. వర్తమాన రాజకీయాల్లోకి తొంగి చూస్తూ సినిమాలు తీస్తున్నారు. ఆ విధంగా ఎన్టీయార్ కు వెన్ను పోటు మీద అనుకూల ప్రతికూల సినిమాలు వచ్చాయి. చంద్రబాబు తన బావమరిది బాలయ్య తీసిన కధానాయకుడు, మహానాయకుడులో హీరో అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీయార్ మూవీలో పక్కా విలన్ అయ్యారు. ఇక వైఎస్సార్ జీవితం మీద యాత్ర పేరిట ఒక సినిమా వచ్చింది. జగన్ చంద్రబాబుల మీద కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్సార్, చంద్రబాబుల మధ్య స్నేహం మీద ఒక సినిమా వస్తోందిట.

అదే బేస్ నా …

అయితే ఇది సినిమాగా వస్తుందా వెబ్ సిరీస్ గానా అన్నది తెలియడంలేదు కానీ ఆ న్యూస్ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ చంద్రబాబు ఇద్దరూ రాయలసీమలోని ఇరుగు పొరుగు జిల్లాల వారు, ఇద్దరూ ఒకే వయసు వారు, ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, రెడ్డి కాంగ్రెస్ తరఫున పులివెందుల నుంచి వైఎస్సార్ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చంద్రగిరి నుంచి చంద్రబాబు కాంగ్రెస్ ఐ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే సీటు నుంచి ఆయన 1983లో టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయాక 1989 నాటికి కుప్పంకు తరలివెళ్ళారు. ఇక ఈ ఇద్దరి మధ్య స్నేహం అంతా కాంగ్రెస్ లో ఉన్నపుడే సాగిందనుకోవాలి. ఇద్దరూ మంత్రులుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు. ఆ తరువాత మామ పార్టీ టీడీపీ గెలవ‌డంతో చంద్రబాబు అక్కడికి వెళ్ళిపోయారు.

వ్యూహముందా…?

గత ఏడాదిన్నరగా చంద్రబాబు వైఎస్సార్ మీద వ్యూహం మార్చారు. ఆయన నిండు అసెంబ్లీలో జగన్ సమక్షంలోనే వైఎస్సార్ తన ప్రాణ మిత్రుడు అన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నపుడు ఒకే రూం లో ఉండేవార‌మని కూడా చెప్పుకొచ్చారు. వైఎస్సార్ బతికి ఉన్నపుడు ఎపుడూ చంద్రబాబు ఈ మాటలు ఎక్కడా చెప్పలేదు. అయితే వైఎస్సార్ స్నేహశీలి అని అందరికీ తెలిసిందే. బాబు టీడీపీలోకి ఫిరాయించేనాటికి వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. నాడు తాను వద్దు అని చెప్పినా చంద్రబాబు వినకుండా తమ మామ పార్టీలోకి వెళ్ళారని అప్పట్లో స్వయంగా వైఎస్సారే చెప్పారు. ఇక నాటి నుంచి కధ తెలిసిందే. ఇద్దరూ రెండు పార్టీల తరఫున ప్రత్యర్ధుల కంటే ఎక్కువగా పోట్లాడుకుంటూ వచ్చారు. ఇపుడు వైఎస్ మంచి జగన్ చెడ్డ అని చెప్పాలని చంద్రబాబు రాజకీయ వ్యూహం. ఎందుకంటే వైఎస్ అంటే జనాలకు దేవుడిగా మారారు కాబట్టి. మరి ఈ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ మంచి మిత్రులు అంటూ సినిమా కానీ వస్తే అది రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది.దాని వల్ల ఎవరికి లాభం, ఆ వ్యూహమేంటి అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తం మీద ఈ సినిమా తెరకెక్కితే మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News