గుడ్ రిజల్ట్

డబ్బులు మార్కెట్లో తిరుగుతుంటేనే ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బులు ఇంట్లో దిండుల్లోనో, బాత్రూమ్ గోడల్లోనో, ఇంటి సీలింగ్ లోనో, బ్యాంకు లాకర్లోనో ఉంటే మార్కెట్ కదలదు. [more]

Update: 2020-02-07 09:30 GMT

డబ్బులు మార్కెట్లో తిరుగుతుంటేనే ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బులు ఇంట్లో దిండుల్లోనో, బాత్రూమ్ గోడల్లోనో, ఇంటి సీలింగ్ లోనో, బ్యాంకు లాకర్లోనో ఉంటే మార్కెట్ కదలదు. ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యంగా కనిపించదు. ఇది ఆర్ధికంగా ఆలోచించే ప్రతివారికీ అర్ధమయ్యే అంశం.

ఏపీలో ప్రస్తుతం…..

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో డబ్బు మార్కెట్లో తిరుగుతోంది. “వాహన మిత్ర”, “అమ్మ వడి”, “రైతు భరోసా”, లాంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం బిజిగా ఉంది. కొంత మందికి ఈ పధకాలు “పందేరాలు”గా కనిపిస్తాయి. ఇలా డబ్బులు ఇవ్వడం మనుషుల్ని సోమరిపోతులుగా తయారు చేయడమే అనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే, ఇక్కడ ఆలోచించాల్సింది ఈ మూడు పథకాల్లో లబ్ధిదారులు ఎవరు అనే ప్రాధమిక అంశం.

పేదలే కావడంతో….

ఈ మూడు పథకాల్లో లబ్ధిదారులు నిత్య శ్రామికులు. పేదలు. వాళ్ళను సోమరిపోతులుగా తయారు చేయడం ఏ వ్యవస్థవల్లా కాదు.ఇక రెండో విషయం వీళ్ళకు ఇచ్చిన డబ్బు దిండులోకో, ట్రంకు పెట్టెల్లోకో వెళ్ళి కూర్చోదు. అది మార్కెట్లోకి వస్తుంది. కొత్త బట్టలు కొనడానికో, ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనడానికో, మరో రూపంలోనో మార్కెట్లోకి వస్తుంది. అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఆ డబ్బు అంతా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మార్కెట్టును “యాక్టివేట్” చేసింది. మార్కెట్ “యాక్టివేట్”గా ఉంది అంటే ఆర్ధిక రంగం “యాక్టీవ్”గా ఉందని అర్ధం. ఆర్ధిక రంగం “యాక్టీవ్”గా ఉంది అంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని అర్ధం.

వారి దగ్గర ఉంటే….?

ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి దగ్గర డబ్బు కనీసం కొన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలా బీరువాలో నిల్వ ఉండే డబ్బుకంటే, లాకర్లో నిద్రపోయే డబ్బు కంటే, ఇంటి సీలింగులో సమాధి చేయబడ్డ డబ్బుకంటే మార్కెట్లో తిరుగుతుండే డబ్బే వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. కోటీశ్వరుల దగ్గర మూలుగుతుండే కోట్లాదిరూపాయల నల్లధనం కంటే ఈ పేదప్రజల దగ్గర ఉండే వందల రూపాయలే మార్కెట్లో తిరుగుతూ ఆర్ధిక వ్యవస్థను “యాక్టివ్”గా ఉంచుతాయి.

శుభపరిణామమే….

“వాహన మిత్ర”, “రైతు భరోసా”, అమ్మ వడి” వంటి పథకాలతో పాటు ఇచ్చిన పెన్షన్ లో ప్రతి రూపాయి మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. ఎక్కడ ఇనప్పెట్టెల్లోకి వెళ్ళి దాక్కోలేదు. అదంతా మార్కెట్లోనే తిరుగుతోంది. పల్లెటూరు, ఆ పక్కనే ఉండే చిన్న పట్టణం చూడండి. అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులను అడగండి. ఈ మూడు పధకాల ద్వారా వచ్చిన డబ్బులు ఈ పాటికి మొత్తం మార్కెట్లోకి వచ్చేశాయి. మార్కెట్టు అంతా కలియతిరుగుతున్నాయి. ఆర్ధికంగా చూస్తే ఇదో శుభ పరిణామం.

 

-దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News