ఈ బాబుకు ఆ బాబే విలన్… ?

సినిమా రంగంలో మోహన్ బాబు తిరుగులేని నటుడు. ఆయన హీరోగా కెరీర్ మొదలెట్టి ఆ తరువాత విలన్ గా అదరగొట్టారు. తిరిగి హీరోగానూ చేసి కలెక్షన్ కింగ్ [more]

Update: 2021-08-16 12:30 GMT

సినిమా రంగంలో మోహన్ బాబు తిరుగులేని నటుడు. ఆయన హీరోగా కెరీర్ మొదలెట్టి ఆ తరువాత విలన్ గా అదరగొట్టారు. తిరిగి హీరోగానూ చేసి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. అయితే మోహన్ బాబుకు విలన్ గా ఉన్న మోజూ క్రేజూ వేరు. ఆయన మ్యానరిజంతో పాటు రూటే సేపరేటు. అలాంటి మోహన్ బాబు నా కంటే పెద్ద విలన్ ఒకరు ఉన్నారు అంటున్నారు. ఆయనని మోసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబే అసలైన విలన్ ట. నా కంటే గొప్ప నటుడు చంద్రబాబు అని సొంత మామ ఎన్టీయార్ నాడు సెటైరికల్ గా కితాబు ఇస్తే ఇపుడు మోహన్ బాబు తన కంటే బాబే భలే విలన్ అంటున్నారు.

హెరిటేజ్ నాదే ….

హెరిటేజ్ ఫుడ్స్ పేరు చెబితే చంద్రబాబు పేరు వేరేగా చెప్పనక్కరలేదు. అలా దశాబ్దాలుగా బాబుతో బంధం వేసుకున్న సంస్థ అది. అలాంటి సంస్థ నాది అని మోహన్ బాబు అంటున్నారు అంటే ఆశ్చర్యమే. నిజానికి హెరిటేజ్ ఐడియా నాది పెట్టుబడులు కూడా నావే ఎక్కువ. షేర్లు కూడా నావే అధికమని మోహన్ బాబు తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో అసలు గుట్టు విప్పారు. లాభాల బాటలో ఉన్న హెరిటేజ్ నుంచి తనను బలవంతంగా చంద్రబాబు బయటకు వెళ్ళగొట్టారంటూ మోహన్ బాబు ఆక్రోశించారు కూడా. ఒక విధంగా చంద్రబాబు చేసిన మోసాన్ని తాను ఈ రోజుకీ భరించలేకపోతున్నాను అంటూ తెగ బాధపడ్డారు ఆయన.

దెబ్బ కొట్టారుగా…

ఇక రాజ్యసభకు ఎంపీగా తనను ఎన్టీయార్ నమ్మి పంపిస్తే చంద్రబాబు దాన్ని రెన్యువల్ చేయలేదని కూడా మోహన్ బాబు వాపోయారు. తాను సమర్ధుడైన నాయకుడిగా బాబు కళ్ళకు కనిపించలేదేమో అంటూ సెటైర్లు వేశారు. రాజకీయంగా తన ఎదుగుదలౌ బ్రేకులు వేసి టీడీపీ నుంచి వెళ్ళగొట్టిన ఘనత కూడా చంద్రబాబుదేనటూ ఫ్లాష్ బ్యాక్ ని మరోమారు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. తాను రాజకీయాల పట్ల విసుకు చెందడానికి కూడా ఆ పరిణామాలే కారణమని ఆయన ఆవేదన చెందారు.

బంధువు అయినా…

నిజం చెప్పాలీ అంటే మోహన్ బాబుదీ చంద్రబాబుదీ ఒకే జిల్లా. ఇద్దరూ దగ్గర బంధువులు కూడా. ఇక మోహన్ బాబుకు ఎన్టీయార్ తో పాటు చంద్రబాబు వద్ద కూడా మంచి చనువు ఉంది. అలాంటి చంద్రబాబుతో వైరం రావడం అంటే చిత్రమే. అయితే రాజకీయాలలో శత్రువులు మిత్రులు ఉండరు. కానీ మోహన్ బాబు మాత్రం తన శత్రుత్వం మరచిపోనిదీ ఈ జన్మకు వీడనిదే అంటున్నారు. చంద్రబాబు చేసిన అన్యాయంతోనే తాను టీడీపీ నుంచి వేరుపడ్డానని, మరే పార్టీలో కూడా ఇప్పటిదాకా చేరలేదని ఆయన అంటున్నారు. ఇక చంద్రబాబు సీఎం కావడానికి తెర వెనక మోహన్ బాబు కూడా ఎంతో కృషి చేశారు. కానీ అవసరం తీరాక బాబు ఆయన్ని పక్కన పెట్టడంతో ఈ కలెక్షన్ కింగ్ ఈ రోజుకీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి ఇద్దరు బాబులూ ఏడు పదుల వయసు దాటేశారు. సినీ రంగాన లబ్ద ప్రతిష్టుడిగా మోహన్ బాబు ఉంటే రాజకీయాల్లో రాటుదేలారు చంద్రబాబు. కానీ జీవిత చరమాంకంలో కూడా ఇలా శత్రువులుగా ఉండడం సాటివారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. మోహన్ బాబు ముక్కుసూటి తనం వల్లనే ఇద్దరూ కలవలేకపోతున్నారు అన్న మాట అయితే ఉంది.

Tags:    

Similar News