జగన్ మీద పెదరాయుడు పెదవి విప్పుతాడటగా?

మోహన్ బాబుకు సినిమా రంగంలో కలెక్షన్ కింగ్ అన్న బిరుదు ఉంది. అలాగే ఆయన 500 పైగా సినిమాల్లో నటించారు. చెప్పాలంటే చిన్న క్యారక్టర్ నుంచి హీరో [more]

Update: 2020-04-13 03:30 GMT

మోహన్ బాబుకు సినిమా రంగంలో కలెక్షన్ కింగ్ అన్న బిరుదు ఉంది. అలాగే ఆయన 500 పైగా సినిమాల్లో నటించారు. చెప్పాలంటే చిన్న క్యారక్టర్ నుంచి హీరో దాకా ఎదిగిన మోహన్ బాబు టాలీవుడ్ ప్రముఖుడుగా నిలిచారు. నిర్మాతగానూ రాణించారు. ఇక విద్యాసంస్థలను నెలకొల్పి అందరి కంటే భిన్నంగా అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇన్ని రకాలుగా సక్సెస్ చూసిన మోహన్ బాబు రాజకీయంగా మాత్రం ఎందుకో మొదటి మెట్టు మీదనే ఉండిపోయారు. టీడీపీలో అందరి కంటే ముందు చేరిన సినిమా నటుడు మోహన్ బాబు అంటారు. అప్పట్లో ఏపీలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. దాంతో అనుబంధం చాలా మందికి ఉంది. పైగా ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త ఆయన పార్టీ పెట్టి అధికారం చేపట్టడం అంటే అది ఓ విధంగా అసంభవమనే అంతా అనుకున్నారు. అందుకే ఎందుకొచ్చిన తంటా అని కాంగ్రెస్ కి కోపం తెప్పించకుండా చాలా మంది సినీ తారలు గమ్ము నుండి పోయారు. అలాంటిది అప్పటికి ఇంకా హీరోగా నిలదొక్కుకోని మోహన్ బాబు టీడీపీలో చేరారు. అంటే పార్టీ పట్ల ఆయన నిబద్ధతతకు జై కొట్టాల్సిందే. కానీ మోహన్ బాబుకు ఆ పార్టీ నుంచి దక్కాల్సిన పదవులు, గౌరవం దక్కలేదన్నది తెలిసిందే.

జగన్ వైపుగా……

ఇక ఎన్టీఆర్ అంటే అన్న గారుగా భావించే మోహన్ బాబు అదే ఎన్టీయార్ని దించాల్సివచ్చినపుడు చంద్రబాబు వైపే ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్టీఆర్ టైంలో కేవలం అప్పటికి మిగిలిన రెండేళ్ళ పదవీ కాలానికి నామినేట్ అయ్యారు. ఆ తరువాత పూర్తి కాలం ఎంపీగా మరోసారి చంద్రబాబు పంపుతారు అనుకున్నారు. కానీ అది కుదరలేదు. దాంతో మోహన్ బాబు కన్నెర్ర చేసి బాబు నుంచి వేరు పడి బయటకు వచ్చారు. మధ్యలో బీజేపీ వంటి పార్టీలకు మద్దతు ఇచ్చినా ఆయన నిఖార్సుగా నిలబడి కండువా కప్పుకున్నది మాత్రం జగన్ పార్టీతోనే . ఆ విషయం ఆయనే చెప్పుకున్నారు కూడా. గత ఏడాది ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరి పార్టీకి కొత్త హుషార్ తెచ్చారు. ఎన్నికల ప్రచారం చేసి జగన్ సీఎం అవుతున్నాడని కుండబద్దలు కొట్టారు. అదికూడా జనాలలో ప్రభావం ఎంతో కొంత చూపించింది అనుకోవాలి.

అలా దెబ్బ పడిందా…?

మోహన్ బాబు తనకు జగన్ రాజ్యసభ టికెట్ ఇస్తారని చాలా గట్టిగా ఆశలు పెట్టుకున్నారని అంటారు. అయితే జగన్ ఏమి ఆలోచించారో తెలియదు కానీ మోహన్ బాబు పేరుని ఏ దశలోనూ ప్రతిపాదనలోకి తీసుకోలేదు. ఏపీలో నాలుగుకు నాలుగూ ఎంపీ సీట్లు వైసీపీకి దక్కితే మోహన్ బాబుకు సీటు ఇవ్వకపోవడంతో మండుకొచ్చిందని కూడా టాక్. అదే సమయంలో అంబానీ మిత్రుడికి టికెట్ ఇచ్చారన్న బాధ అటు పార్టీలోనూ ఉంది. ఇటు మోహన్ బాబులోనూ ఉంది. ఏది ఏమైనా గమ్మున్న ఉంటాడనుకున్న మోహన్ బాబు ఇపుడు కొంత వ్యతిరేక స్వరం వినిపించేందుకు రెడీ అవుతున్నారుట. తనను వైసీపీ పట్టించుకోలేదని, సీనియర్ గా ఉన్న తనకు తగిన గౌరవం లేదని మోహన్ బాబు ఆవేదనగా కనిపిస్తోంది.

గళ‌మెత్తుతారా…?

ఇక మోహన్ బాబు జగన్ కి స్వయంగా మామ వరస అవుతారు. జగన్ చిన్నాన్న కూతురు మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు భార్య. ఆ విధంగా దగ్గర చుట్టరికమే ఉంది. అయినా జగన్ ఇవేమీ పరిగణ‌నలోకి తీసుకోలేదంటారు. ఇక తన విద్యా సంస్థలకు రావాలిసిన ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నాడు చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన మోహన్ బాబు ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉండడంతో జగన్ మీద ఓ మంచి ముహూర్తం చూసుకుని బాణాలు వేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. తనకు పదవులు ఇవ్వలేదన్న బాధ నేరుగా వినిపించకుండా ముందు ఫీజుల విషయంతో మొదలుపెట్టి ఆ తరువాత మెల్లగా ప్రజా సమస్యల మీద కూడా తన అభిప్రాయం చెప్పాలన్నది మోహన్ బాబు ఆలోచన‌గా ఉంది. అంటే మోహన్ బాబు నా రూటే సెపరేట్ అనేలా సీన్ కనిపిస్తోంది. మరి దీని మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News