టీడీపీలో నాడు ఒకే ఒక్కడు.. నేడు ఎక్కడో?

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో ఆయ‌న ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కావాల్సినంత వ్యతిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. చివ‌ర‌కు [more]

Update: 2021-01-14 00:30 GMT

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో ఆయ‌న ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కావాల్సినంత వ్యతిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఆయ‌న వ్యతిరేక వ‌ర్గానికి తలొగ్గి.. ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో సీటే ఇవ్వలేదు. ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వక‌పోవ‌డంతో పార్టీ కోసం ఎన్నిక‌ల ప్రచారంలో కూడా మ‌న‌స్ఫూర్తిగా పాల్గొన‌ని ఆ ఎమ్మెల్యే ఇప్పుడు రాజ‌కీయంగా సంధికాలంలో ఉన్నారు. పార్టీ మారేందుకు మ‌న‌స్సు ఒప్పుకోక‌పోయినా.. టీడీపీలో మ‌ళ్లీ ఎమ్మెల్యే ఛాన్స్ వ‌స్తుంద‌న్న ఆశ‌ల ప‌ల్లకీలో మాత్రం ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు పశ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌.

ఉప ఎన్నికల్లో ఓడి….

2012 ఉప ఎన్నిక‌ల్లో పోల‌వ‌రం ఉప ఎన్నిక‌ల్లో ఎంతో మంది పోటీ ప‌డినా మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు ప‌ట్టుబ‌ట్టి మొడియం శ్రీనివాస్‌ కు సీటు ఇప్పించ‌గా ఆ ఎన్నిక‌ల్లో ఓడిన శ్రీనివాస్ 2014 ఎన్నిక‌ల్లో మ‌రోసారి అదే మాగంటి ఆశీస్సుల‌తో సీటు ద‌క్కించుకుని గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క పోల‌వ‌రంలో మాత్రమే టీడీపీ నుంచి మొడియం శ్రీనివాస్‌ గెలిచారు. ఎస్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఆశించిన మొడియంకు చంద్రబాబు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

మాగంటికి వ్యతిరేకమై…..

చివ‌ర‌కు 2017లో జ‌రిగిన ప్రక్షాళ‌న‌లోనూ ఆ కోరిక నెర‌వేర‌లేదు. చివ‌ర‌కు న‌క్సలైట్ల దాడిలో మృతి చెందిన అర‌కు మాజీ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వర‌రావు త‌న‌యుడు కిడారి శ్రవ‌ణ్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన బాబు ఎస్టీ కోటాను అలా స‌రిపెట్టేశారు. దీంతో మొడియం శ్రీనివాస్‌ ఆశ‌ల‌న్నీ నిరాశే అయ్యాయి. పోనీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌నకు స‌రైన ప‌ట్టు చిక్కలేదు. ఆయ‌న్ను వ్యతిరేకించే వ‌ర్గం బ‌లంగా ఉండ‌డంతో చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో సీటు కూడా రాలేదు. ఏ మాగంటి బాబు ద‌య‌తో మొడియం శ్రీనివాస్‌ రెండు సార్లు సీటు ద‌క్కించుకుని ఎమ్మెల్యే అయ్యారో ఆ వెంట‌నే ఆయ‌న‌కు వ్యతిరేకం అయ్యారు.

మరో ఆప్షన్ లేదా?

ఇక గ‌త ఎన్నిక‌ల్లో మొడియం శ్రీనివాస్‌ కు సీటు రాక‌పోవ‌డానికి కూడా మాగంటి & వ‌ర్గం లాబీయింగ్ బ‌లంగా వ‌ర్కవుట్ అవ్వడ‌మే. ట్విస్ట్ ఏంటంటే మొడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయ‌న చుట్టూ సాధార‌ణ కార్యక‌ర్తగా ప్రద‌క్షిణ‌లు చేస్తూ మొడియంను అన్నా అన్నా అని పిలిచిన బొర‌గం శ్రీను గ‌త ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కించుకుని పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు బొర‌గం పోల‌వ‌రం ఇన్‌చార్జ్‌గా ఉండ‌డంతో పాటు పార్టీలో త‌న గ్రిప్‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో చిన్నా చిత‌కా అసంతృప్తుల‌ను కూడా సెట్ చేసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో మొడియం శ్రీనివాస్‌కు ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది.

భవిష్యత్ ఎలా ఉంటుందో?

పార్టీలోనే ఉన్నప్పట‌కీ మ‌ళ్లీ ఛాన్స్ రాక‌పోదా ? అన్న ఆశ‌తో ఉన్నా… స్థానిక సమీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి చూస్తే మొడియం శ్రీనివాస్‌కు ఆ ఛాన్స్ క‌ష్టంగానే ఉంది. పోల‌వ‌రంలో మొడియంను అభిమానించే వ‌ర్గం కూడా టీడీపీలో ఉన్నా.. బొర‌గం కూడా వివాదాలు లేకుండా ముందుకు సాగుతుండ‌డంతో ఆయ‌న్ను మార్చే అవ‌కాశాలు కూడా క‌న‌ప‌డ‌డం లేదు. మ‌రి నాడు ఒకే ఒక్క ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న మొడియం శ్రీనివాస్‌ భ‌విష్యత్తు ఎలా ఉంటుందో ? కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News