మొండి మోడీ..మొరటు సిద్ధయ్య... మధ్యలో యడ్డీ

Update: 2018-04-04 16:30 GMT

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. దక్షిణాదిన ప్రధాని నరేంద్రమోడీకి బలమైన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. అవే వ్యూహాలు, ఎత్తుగడలు, విభజన వాదాలు, ఆత్మగౌరవ నినాదాలు. మోడీ ఏ అంశాలనైతే ఎమోషనలైజ్ చేయడం ద్వారా పైచేయి సాధిస్తూ ఉంటారో అవే అంశాలను తన అంబుల పొదిలో చేర్చుకుని పైఎత్తులు వేస్తున్నారు సిద్దరామయ్య. గుజరాత్ తర్వాత మోడీకి అత్యంతప్రతిష్ఠాత్మక ఎన్నికగా మారుతోంది కర్ణాటక. హిందుత్వ అజెండాకు ప్రాంతీయ వాద అస్తిత్వ అజెండాతో చెక్ చెప్పేందుకు ముమ్మర యత్నాలే సాగుతున్నాయి. దేశసమగ్రతకు కొంత ఇబ్బందికరమనే వాదనలు ఉన్నప్పటికీ నియంతృత్వ పోకడతో దూసుకుపోతున్న మోడీ,అమిత్ షా ద్వయానికి చెక్ చెప్పేందుకు ఇదే సరైన సమాధానమనే వారి సంఖ్యకూ కొదవ లేదు.

కన్నడ గౌరవ...

గుజరాతీ ఆత్మాభిమానం పేరుతో దేశపీఠం ఎక్కిన మోడీకి ‘కన్నడ స్వయం గౌరవ’తో బదులివ్వాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. హిందీ బోర్డులు లేకుండా మెట్రోలో కన్నడం మాత్రమే ఉండాలనడం, జాతీయ సంస్థల్లో సైతం స్థానికులకే ఉద్యోగాలని నినాదం లేవనెత్తడం, కన్నడ రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఆవిష్కరించడం వంటివన్నీ మోడీని ప్రతిఘటించే వ్యూహాలే. సాధారణ పరిస్థితుల్లో అయితే కాంగ్రెసు ఇటువంటి వాటిని ప్రోత్సహించదు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసం చేయరు. కానీ ప్రస్తుతం కాంగ్రెసు పరిస్థితులు వేరు. కర్ణాటక గెలుపు దేశ రాజకీయాల్లో మలుపునకు నాంది కావాలని రాహుల్ గాంధీ ఆశిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రికి విపరీతమైన స్వేచ్ఛను కల్పించారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుని స్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నారు. పోటీ మోడీ వర్సస్ సిద్ధరామయ్య అన్న రీతిలో ప్రచారంలోకి తేవడం ద్వారా యడియూరప్పను సైడ్ ట్రాక్ లో పెట్టాలనే వ్యూహం కనిపిస్తోంది. దీనివల్ల సిద్ధరామయ్య కు కన్నడిగుల్లో పైచేయి లభిస్తుందనేది అంచనా. తెలుగు ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ బాగా ఎక్కువ. ఏపీ ప్రత్యేక హోదాపై మోడీ మొండి వైఖరి కారణంగా ఈ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తారనే యోచనలో కాంగ్రెసు ఉంది. ప్రత్యర్థి బీజేపీ సీఎం అభ్యర్థి యడియూరప్పకు మద్దతుగా ఉన్న లింగాయత్ లకు మతపరమైన మైనారటీ హోదా వల వేసింది కాంగ్రెసు. ఇటువంటి విభజన రాజకీయ అజెండాను సైతం చేపట్టారంటేనే కాంగ్రెసు ఏస్థాయి యుద్దానికైనా సిద్దమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

సమీకరణలు సరిపోతాయా?

2013 ఎన్నికల్లో 122 స్థానాలలో కాంగ్రెసు చెరి 40 స్థానాల్లో బీజేపీ, జేడీఎస్ లు ఆధిక్యం సాధించాయి. 2014లో మోడీ,బీజేపీ వేవ్ తో లోక్ సభ స్థానాల పరిధిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కాంగ్రెసు ఆధిక్యం 77 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 132 స్థానాల పరిధిలో ఆధిక్యం సాధించింది. జేడీఎస్ పరిధి మరింత కుదించుకుపోయి కేవలం 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనే మెరుగైన పొజిషన్ లో నిలిచింది. అయితే అవి లోక్ సభ ఎన్నికలు కావడం వల్ల వాటి సమీకరణ వేరని కాంగ్రెసు చెబుతోంది. 2013 ఎన్నికల్లో యడియూరప్ప విడిగా పోటీ చేయడం వల్ల తాము దెబ్బతిన్నామని , ఇప్పుడు ఆయనే ఎన్నికలకు నేతృత్వం వహించడం తమకు లాభిస్తుందని బీజేపీ చెబుతోంది. దాదాపు 15 నుంచి 17 శాతం వరకూ ఉన్న లింగాయత్ లు తమ వర్గానికి చెందిన యడియూరప్ప సీఎం అవుతారనే ఉద్దేశంతో సంఘటితంగా అండగా నిలుస్తారనే భావన ను బీజేపీ వ్యక్తం చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్య దళిత్, మైనారిటీ వర్గాలకు ఎరవేస్తూనే సాఫ్ట్ హిందూత్వ ఎజెండాను తెరమీదకు తెస్తున్నారు. ఇదికాంగ్రెసుకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. గడచిన నలభై సంవత్సరాలలో అయిదేళ్లపాటు ఏకధాటిగా కొనసాగిన సీఎం సిద్దరామయ్యే కావడం అందులోనూ కాంగ్రెసు వంటిపార్టీ ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోక పోవడం ఆయనకున్న బలానికి నిదర్శనం.

వర్గ పోరు వడ్డింపులెవరికి? ...

బలమైన ముఖ్యమంత్రే అయినప్పటికీ సిద్దరామయ్య పార్టీతో సమన్వయం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వర్గ పోరు సీట్ల కేటాయింపు తర్వాత మరింత ముదురుపాకాన పడవచ్చంటున్నారు. ముఠాలు, సొంతకుంపట్లు పార్టీ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అటువైపు బీజేపీలోనూ యడియూరప్ప కు ఈశ్వరప్ప వర్గంతో పడటం లేదు.బీజేపీ, కాంగ్రెసు సీఎం అభ్యర్ధులిద్దరూ కూడా వర్గ పోరును ఎదుర్కోక తప్పని స్థితి. మరోవైపు జేడీఎస్ ఎవరికి నష్టం చేకూరుస్తుందనే భయమూ వెంటాడుతోంది. జేడీఎస్ బలహీనపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక తగ్గిపోతుంది. అదే జేడీఎస్ బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బాగా చీల్చగలుగుతుంది. ముఖాముఖిగా తలపడుతున్న కాంగ్రెసు,బీజేపీల మధ్య బలాబలాలను తారుమారుచేయడంలో జనతాదళ్ సెక్యులర్ కూడా కీలకమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెసు వ్యూహకర్తలు జేడీఎస్ ను బీజేపీ బీ టీమ్ గా ముద్ర వేసి వంటరిని చేయాలనే ఎత్తుగడ వేస్తున్నారు. దీనిని ప్రజలు విశ్వసిస్తే తమ ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోతుందని గ్రహించిన ఆ పార్టీ నేత కుమారస్వామి కాంగ్రెసు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఒక రకంగా కాంగ్రెసు పార్టీకే లాభం చేకూర్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో బలమైన చీలిక ఏర్పడితే ఒకే చోట కేంద్రీక్రుతం కాకుండా రెండు శక్తులు సర్కారుతో తలపడితే గట్టెక్కేయడం సులభమని కాంగ్రెసు అంచనా. కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం బాగా పుంజుకుంటే తటస్థ ఓటర్లు ప్రతిపక్షం వైపు స్వింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రానున్న నలభై అయిదు రోజులూ కర్ణాటక వైపే దేశం ద్రుష్టి కేంద్రీక్రుతమవుతుంది. జాతీయ పార్టీలు రెండూ 2019 కి దిశానిర్దేశంగా భావిస్తూ ఉండటమే దీనికి కారణం.

 

ఎడిటోరియల్ డెస్క్

Similar News