నాకు నువ్వు..నీకు నేను...!

Update: 2018-06-28 14:30 GMT

కేంద్రప్రభుత్వం స్పష్టంగానే సంకేతాలిచ్చేసింది. రెండు తెలుగురాష్ట్రాల పట్ల తన రాజకీయ వైఖరిని నిర్ద్వంద్వంగా చాటిచెప్పింది. ఏపీలో అధికారపక్షమైన తెలుగుదేశానికి దూరంగా ఉండకతప్పని స్థితి. అదే సమయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను చేరువ చేసుకునే వ్యూహం పక్కాగా అమలు చేస్తోంది. ప్రధాని స్థాయిలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందుకనుగుణమైన సంకేతాలను పార్టీ శ్రేణులకు పంపుతున్నారు. పైకి పోరాటమంటూ హడావిడి చేస్తున్నప్పటికీ తెలంగాణలోని బీజేపీ శ్రేణులు మానసికంగా సిద్ధపడకతప్పని స్థితిని ఆపార్టీ అధిష్టానమే కల్పిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి నడవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బాగానే లబ్ధి పొందగలిగింది. టీడీపీకి సైతం కలిసొచ్చింది. పరస్పరం ప్రయోజనదాయకమైంది వారి మైత్రి. మారిన పరిస్థితుల్లో నేరుగా బీజేపీతో కలిసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిత్రులు కరవు అయ్యారు. రహస్య నేస్తులను వెదుక్కొని వారి ద్వారా భవిష్యత్ ప్రయోజనాలకు బాటలు వేసుకొంటోంది బీజేపీ.

ముచ్చట ముగిసింది...

కాంగ్రెసు, బీజేపీలు రెండూ శత్రువులే. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకునే ఫెడరల్ సెక్యులర్ ఫ్రంట్ కావాలంటూ కేసీఆర్ కొంతకాలం క్రితం హడావిడి చేశారు. తెలంగాణలో తనకు తిరుగులేదు కాబట్టి జాతీయంగా కీలక భూమిక పోషించాలని ఉవ్విళ్లూరారు. కానీ తెలంగాణ చిన్న రాష్ట్రం. దానికి తోడు మిగిలిన ప్రాంతీయనేతల విశ్వాసాన్ని కేసీఆర్ చూరగొనలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే కేసీఆర్ జాతీయ నాయకులకు పరిచయం. వారి ద్రుష్టిలో ఆయన జూనియర్ నేతగానే లెక్క. తామంతా వెనకాల ఉండి ఆయనకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ పగ్గాలు అప్పగించేంత ఔదార్యం వారిలో లేదు. దాంతో కేసీఆర్ ప్రయత్నాలకు మొదట్నుంచీ పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. ఈలోపు ఆ స్థానంలోకి చంద్రబాబు నాయుడు వచ్చి చేరారు. త్రుతీయ ఫ్రంట్ పేరు చెప్పకపోయినా మిగిలిన ప్రాంతీయ నాయకులు ఆయనచుట్టూ చేరడం మొదలుపెట్టారు. కాంగ్రెసు సైతం వీరితో చేతులు కలిపేందుకు సానుకూల సంకేతాలిచ్చింది. దీంతో కేసీఆర్ ఫ్రంట్ మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది.

దక్షిణాది తోడు...

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలిపే అవకాశం లేదు.బీజేపీ పట్టించుకోగల బలమున్న పార్టీ కాదు. దాంతో టీఆర్ఎస్ కు వాటిల్లే నష్టం లేదు. పైపెచ్చు కేంద్రంలో బీజేపీ అండ అవసరం. ఒకవేళ ప్రభుత్వంలో లేకపోయినా ప్రతిపక్షంగా అయినా బీజేపీ కేంద్రంలో బలంగానే ఉంటుంది. రాస్ట్ర సమస్యల విషయంలో గరిష్టంగా ప్రయోజనం పొందాలంటే బీజేపీ చెలిమి అవసరమని కేసీఆర్ గ్రహించారు. ఇటీవల ప్రధానితో భేటీలో చాలా సుహ్రుద్భావమైన చర్చ చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల తర్వాత సైతం కాంగ్రెసుకు వ్యతిరేకమైన పాత్రనే టీఆర్ఎస్ వహిస్తుందని కేసీఆర్ స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. మోడికి కావాల్సింది కూడా అదే. పైపెచ్చు దక్షిణభారతంలో మిత్రుడు లేని లోటు బీజేపీని వెన్నాడుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో ఎవరూ బీజేపీతో చెలిమి చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ని కూడా పూర్తిగా నమ్మలేని స్థితి. ఒక బలమైన మిత్రుడు అండగా ఉంటే దక్షిణభారతంలో చక్రం తిప్పాలనేది బీజేపీ యోచన. అందుకుగాను కేసీఆర్ ను మించిన ప్రజాదరణ కలిగిన వ్యక్తి లేడని కమలనాథులు భావిస్తున్నారు. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు అనువుగా ఉన్నట్లు నరేంద్రమోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బాబు స్థానం భర్తీ...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి పూర్తిగా దూరమయ్యారు. జాతీయంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు ఆయనే నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన నేతగా స్థిరపడిన కేసీఆర్ తో దోస్తీ కట్టడం అవశ్యమని నరేంద్రమోడీ భావిస్తున్నారు. దాయాది రాష్ట్రంలో ఉన్న బాబుకు చెక్ పాయింట్ కేసీఆర్. నేరుగా ఆయన కమలంతో చెలిమి చేయకపోయినా రాష్ట్ర ప్రయోజనాల పేరిట అవసరమైన సహకారం అందిస్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రయోజనాలకు అనుగుణమైన సహకారం కేంద్రం అందిస్తుంది. కడప ఉక్కుఫ్యాక్టరీపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బయ్యారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ మంత్రి కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇచ్చి బయ్యారం ఉక్కు అంశంపై సమయం కేటాయించారు. కడప ఉక్కు గురించి చర్చించడానికి సమయం కోరిన తెలుగుదేశం ఎంపీలను నిరాకరించారు. దీంతో టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తమ ప్రాధాన్యతల్లోని అంతరాన్ని స్పష్టంగా చాటిచెప్పినట్లయింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News