ఓటమికి కోట్ల కారణాలు విన్నారా?

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. సీనియర్ నేతగా, మాజీ కేంద్రమంత్రిగా ఆయన అందరికీ సుపరిచితులే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కర్నూలు [more]

Update: 2019-07-30 06:30 GMT

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. సీనియర్ నేతగా, మాజీ కేంద్రమంత్రిగా ఆయన అందరికీ సుపరిచితులే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి అనామకుల చేతిలో ఓటమి పాలయ్యారు. దీనికి కారణం జగన్ సునామీ అని ఎవరైనా చెబుతారు.

క్లీన్ స్వీప్ చేసినా…..

కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామంటూ వైరల్ గా మారిన నినాదం జగన్ కు అధికారం కట్టబెట్టిందని అందరికీ తెలిసిందే. దీనికి తోడు ఐదేళ్లు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత బాగానే ఉంది. విశ్లేషకులందరూ జగన్ పై సానుభూతి, చంద్రబాబుపై వ్యతిరేకత వైసీపీ గెలవడానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఓటమిపాలయిన తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం భిన్నంగా స్పందించారు.

మోడీయే కారణమట….

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం మోడీనట. మోదీ సహకారం లేకపోతే జగన్ గెలిచేవాడు కాడట. ప్రధాని మోదీ జగన్ కు అన్ని రకాలుగా సహకారం అందించడం వల్లనే గెలిచారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొత్త విశ్లేషణ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని కూడా చెప్పారు. ఈవీఎంలను మార్చడం వల్లనే చంద్రబాబునాయుడు ఓ‌డిపోయారని, జగన్ గెలిచారంటున్నారు పాలిటిక్స్ లో పేరున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.

సత్తా చూపిస్తానంటూ….

అంతటితో ఆగారా? ఇక జగన్ పాలనను ప్రజలు చూశారని, అసహ్యించుకుంటున్నారని నిర్ధారణకు వచ్చేశారు. ఇక త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని, అందులో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని అంటున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆ ఎన్నికల్లో తన సత్తా చూపుతానని అంటున్నారు. మొత్తం మీద రెడ్డిగారు ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలే సణుగుతుండటం విశేషం.

Tags:    

Similar News