మోదీ సామాన్యుడు కాడుగా…. అక్కడ కూడా?

భారత్ – చైనాల మధ్య ఏనాడూ స్నేహభావన లేదు. మొదటినుంచీ పరస్పరం అనుమానంతోనే చూసుకుంటున్నాయి. 1962లో జరిగిన యద్ధం దీనికి ప్రధాన కారణం. నాటి యుద్ధంలో పరాజయం [more]

Update: 2020-09-17 16:30 GMT

భారత్ – చైనాల మధ్య ఏనాడూ స్నేహభావన లేదు. మొదటినుంచీ పరస్పరం అనుమానంతోనే చూసుకుంటున్నాయి. 1962లో జరిగిన యద్ధం దీనికి ప్రధాన కారణం. నాటి యుద్ధంలో పరాజయం కారణంగా అవమాన భారంతోనే ప్రధాని నెహ్రూ కన్నుమూశారన్న వాదనా లేకపోలేదు. దీంతో దౌత్య సంబంధాలు తెగిపోయాయి. తరవాత రోజుల్లో పరస్పర సంబంధాలు మొదలైనప్పటికీ చాలాకాలం పాటు నాయకుల రాకపోకలు లేవు, అంతర్జాతీయ వేదికలపై అధినేతల కరచాలనాలు తప్ప అధినేతల అధికారిక పర్యటనలు లేవు. గత మూడు దశాబ్దలుగా సంబంధాలు ఒకింత మెరుగుపడినప్పటికీ జూన్ లో చోటుచేసుకున్న గల్వాన్ లోయ ఘర్షణ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. ఈ ఘర్షణలో 20 మంది బారత సైనికులు అశువులు బాయడంతో రెండు దేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో భారత్ లో చైనా వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది.

వస్తువులను బహిష్కరించాలని….

ఛైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్లు సైతం వినపడుతున్నాయి. భారత్ లోని చైనా కంపెనీలను వెనక్కి పంపాలన్న వాదనా వినపడుతోంది. సగటు పౌరుడు చైనా పేరు చెబితేనే మండిపడుతున్నాడు. గత ఏడాది తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించిన చైనా అధినేత జిన్ పింగ్ ఏడాది తిరిగేసరికి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆవేదన చెందుతున్నారు. రెండు దేశాల మధ్య 1962 నాటి తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని స్వయంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ లో చైనా వ్యతిరేకత ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు చైనాలో కూడా ఇదేవిధంగా భారత్ వ్యతిరేకత ఉండాలి. ఇది సహజసిద్ధ పరిణామం కూడా. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి బీజింగ్ లో నెలకొంది.

చైనాలో మాత్రం……

సగటు చైనీయుడు భారత్ నుగానీ, భారత అధినేత ప్రధానమంత్రిని గానీ వ్యతిరేకించడం లేదు. లేకపోగా ఆయనను ఇంకా అభిమానిస్తున్నారు. సగం మంది చైనీయులు భారత్ ను ప్రేమిస్తున్నారు. ఇది ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. అభూత కల్పనలు అంతకంటే కావు. ప్రభుత్వ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ నిర్వహించిన ఈ సర్వేలో ఆశ్ఛర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో గ్లోబల్ టైమ్స్ ను చైనా అధికార వాణిగా పరిగణిస్తారు. గ్లోబల్ టైమ్స్ సర్వే ప్రకారం 50 శాతం మంది చైనీయులు భారత్ ను, మోదీని అభిమానిస్తున్నారు. మరో సగం మంది బీజింగ్ వైపు, తమ దేశ అధినేత జిన్ పింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సైన్యానికి సంబంధించి భారతీయులు అనసరిస్తున్న పారదర్శక విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ దేశం అమరవీరులలకు అరుదైన గౌరవాన్ని ఇస్తుందని, యావత్ దేశం అమరవీరుల సేవలను, త్యాగాలను ప్రస్తుతిస్తుందని, కానీ తమ దేశంలో అలాంటి పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. యుద్ధవీరుల గురించి తమకు ఏమీ తెలియదని అందువల్లే వారికి కనీసం నివాళులు కూడా అర్పించలేకపోతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని కొంతమంది ఆశాభావంతో ఉండగా, అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

నిషేధం విధించడంతో……

చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘హువై’ భారత్ లో భారీ వ్యాపారం చేస్తోంది. గల్వాన్ ఘటన తరవాత ఈ సంస్థ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కంటోంది. పరిస్థితిని తేలిక పరిచేందుకు ఈ సంస్థ భారతీయ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్ లో వ్యాపారం చేస్తున్న హువై ఢిల్లీతో మంచి సంబంధాలను నెరపాలనుకుంటోంది. ఇప్పటికే ఈ సంస్థను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా నిషేధించాయి. న్యూజిలాండ్ పాక్షికంగా నిషేధించింది. హువై పై భారత్ లో ప్రస్తుతానికి నిషేధం లేదు. అయితే టెలికాం కంపెనీలు చైనా ప్రభావం నుంచి దూరంగా ఉండాలని భారత్ ఆశిస్తోంది. చైనా పరికరాల వాడకాన్ని తగ్గించాలని భారతీయ కంపెనీలకు సూచిస్తోంది. అదే సమయంలో హువై చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కెనడాలో న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికా అయితే ఏకంగా ఆయనను అదుపులోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ను కానీ, బారతీయ కంపెనీలనుగానీ ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా దూరం చసుకోవాలని చైనా అనుకోవడం లేదు. ఇదొక చీకటి అధ్యాయమని, కాలక్రమంలో పరిస్థితులు కుదుటపడతాయని భారత్ లని చైనా రాయబారి సన్ వెడాంగ్ పేర్కనడమే ఇందుకు నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News