ఉపవాసంతో....పాపం కడిగేసుకున్నట్లేనా?

Update: 2018-04-12 16:30 GMT

మొత్తమ్మీద దేశంలో దీక్షాకాలం మొదలైంది. పట్టుమని పదినిముషాల పాటు సాగకుండా 13 రోజులపాటు నిరంతర వాయిదాలతో ముగిసిన పార్లమెంటు సమావేశాలకు నిరసనగా జాతీయ పార్టీలు రెండూ దీక్షలు చేపట్టడం విశేషం. ఇంతకీ పార్లమెంటు తీరుకు నిరసనగా వీరు దీక్షలు చేస్తున్నారా? లేక దానిని సజావుగా నిర్వహించలేకపోయిన తమ అసమర్థతకు ప్రతీకగా, తమకు తామే వ్యతిరేకంగా నిరసన తెలుపుకుంటున్నారా? అన్నప్రశ్న రేకెత్తుతుంది. ఎదుటివారిదే తప్పు. తాము చేసేది నూటికి నూరుపాళ్లు ఒప్పు అని ప్రజలముందు చెప్పుకోవాలనే తపన తప్ప నిరాహార దీక్షల్లో సైతం చిత్తశుద్ధి లేకపోవడమే రాజకీయ వైచిత్రి. తొమ్మిదో తేదీన కాంగ్రెసు పార్టీ దీక్ష చేసి అధికార బీజేపీని ఆడిపోసుకుందనే దుగ్ధ కమలనాధులను వెంటాడుతోంది. దీనికి ప్రతిగా ప్రధాని రంగంలోకి దిగారు ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా పాల్గొనాలని హుకుం జారీ చేశారు. నిజానికి స్వచ్ఛందంగా సాగాల్సిన నిరాహార దీక్షలో అంతా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడమే నియంతృత్వం. వ్యవస్థీక్రుతమైన విలువలకు నిదర్శనంగా ఉండే పార్టీ మోడీ, అమిత్ షాల సారథ్యంలోకి వచ్చాక వ్యక్తిపాలనకు దిగజారింది. ఈ నిర్బంధ దీక్షల పిలుపులోనూ ఈ ధోరణి తేటతెల్లమవుతోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ పులుగడిగిన ముత్యాలే అయితే అసలు దోషులెవరు? పార్లమెంటరీ కార్యకలాపాలు గంట పాటు కూడా నడవకుండా ప్రజాస్వామ్య హననానికి పాల్పడిన దుష్ట దుర్మార్గులెవరు? అన్న సందేహం తలెత్తుతుంది. రాజకీయ పార్టీలన్నీ తెల్లపూసలం అని చెప్పుకోవాలనుకునే తాపత్రయమే ఇక్కడ ద్యోతకమవుతోంది. అన్ని పార్టీల్లోనూ అభద్రత తొంగి చూస్తోంది. ఓటర్ల అభయం కోసం పాకులాట కనిపిస్తోంది.

కమలం కురచ వ్యూహం...

విశాలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన జాతీయ పార్టీ బీజేపీ అంతకంతకూ ఆలోచనల్లో కురచనైపోతోంది. ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదని ఏడెనిమిది పార్టీలు అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడమే అవమానం. వాటన్నిటినీ పక్కనపెట్టేసి పార్లమెంటును వాయిదా వేయించడం కురుచ ఎత్తుగడ. బలాబలాలు, ఆధిక్యతలన్నవి చట్టసభలో గణాంక సహితంగా తేలాల్సిన విషయాలు. దాదాపు నాలుగోవంతుమంది సభ్యులు మాకు ఈ ప్రభుత్వం వద్దంటుంటే మిగిలిన మూడువంతుల మంది తమకు దన్నుగా ఉన్నారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికే ఇష్టపడకపోవడమంటే పారిపోవడమే ననేది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. ఇది నిజమేనని రాజనీతిజ్ఝులు సైతం ధృవీకరిస్తున్నారు. సొంతంగానే తగినంత సభ్యుల బలం ఉన్నప్పటికీ నో కాన్ఫిడెన్సు కు నో చెప్పేసిన కేంద్రప్రభుత్వం నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని చెప్పుకోవాలి. ప్రతిపక్షాల మాట పార్లమెంటులో నెగ్గదని నిరూపించే మొండి పట్టుదలలో మొత్తం వ్యవస్థనే అపహాస్యం చేసే చర్యలకు పూనుకుంది కేంద్రం. నిజంగానే తాను అవిశ్వాసాన్ని ఎదుర్కొని తన బలాన్ని పార్లమెంటు సాక్షిగా చాటిచెప్పాలనుకుంటే గొడవ చేసిన అన్నాడీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలను ఏదో రకంగాబుజ్జగించి ఉండేది. ఇప్పుడు పార్లమెంటు సమయం వృథా అయిపోయిందంటూ దీక్ష చేపట్టడమంటే మొసలి కన్నీరు కార్చడమేనంటున్నారు పరిశీలకులు.

హస్తవాసి హ్రస్వ దృష్టి...

రాష్ట్రవిభజన చట్టాన్ని ఆదరాబాదరాగా అయిపోయిందనిపించిన కాంగ్రెసు పార్టీ మొదటి దోషిగానే నిలుస్తుంది. అటు ఆంధ్రాకు, ఇటు తెలంగాణకు స్పష్టమైన హామీలు లేకుండా తేల్చేశారు. తెలంగాణకు కొంత ఆర్థిక వెసులుబాటు ఉండటంతో సమస్యల తీవ్రత కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం అల్లాడిపోతోంది. రైల్వేజోన్, ప్రత్యేకహోదా, పోలవరం వంటి ప్రధాన విషయాలన్నీ వివిధ రూపాలు, స్థాయుల్లో పెండింగులో పడిపోయాయి. ఇందుకు ప్రధానకారణంగా కాంగ్రెసునే చూపిస్తోంది బీజేపీ. అది పాక్షిక సత్యమే అయినప్పటికీ పూర్తిగా తోసిపుచ్చలేనిది. ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన విషయంలో సంతృప్తి కలిగేవిధంగా వ్యవహరించకుండా తూతూ మంత్రంగా పని ముగించేసిన దృష్టి లోపం కాంగ్రెసును ఈనాటికీ వెన్నాడుతోంది. చట్ట పరంగా తాము చేసిన లోపాలను, పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దమని కేంద్రప్రభుత్వాన్ని డిమాండు చేసి ఉంటే బాగుండేది. రాజకీయంగా అవకాశం దొరికింది కదా? అని కేంద్రంపై అవిశ్వాసంలో తాను కూడా సై అంటూ ముందుకురికింది. విభజన సందర్బంగా అవిశ్వాసాన్ని కాంగ్రెసు పార్టీ తొక్కిపెట్టింది. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా బీజేపీ కూడా అదే పద్దతిలో ఇప్పుడు అవిశ్వాసాన్ని తొక్కిపెట్టింది. ఇప్పుడు కొత్తగా ప్రజాస్వామ్య విలువలు నాశనమైపోతున్నట్లుగా అభినయిస్తూ హస్తం పార్టీ నిరశన దీక్ష చేసేసి మమ అనిపించేసింది. కమిట్ మెంట్ లోపమే కాంగ్రెసు నూ వెన్నాడింది. రాజకీయ వాసనల కంపు కొట్టింది.

ప్రాంతీయ పక్షుల పన్నాగం...

అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ శత్రుశిబిరాలుగా తలపడటం కొత్త విషయమేమీ కాదు. వారికి ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా అంశం నేపథ్యంగా అవిశ్వాసం అస్త్రంగా దొరికింది. బడ్జెట్ ఆమోదం పొందకముందే ఈ తీర్మానంపై నోటీసు ఇచ్చి ఉంటే కేంద్రం చిక్కుల్లో పడి ఉండేది. నోటీసు పెండింగులో ఉండగా ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలపడం నైతికంగా, చట్టపరంగా కేంద్రప్రభుత్వానికి ఇబ్బందికరమయ్యేది. కానీ అంతా అయిపోయాక నోటీసులు ఇచ్చి హడావిడి మొదలుపెట్టాయి ఈరెండు పార్టీలు. ఈవిషయంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ పడ్డాయి. కానీ ఆలస్యం అమృతం విషమన్నట్లుగా కేంద్రం వీరి నోటీసులను కేర్ చెయ్యలేదు. వరస వాయిదాలతో పుణ్యకాలం గడిచిపోయేలా చూసుకుని నిరవధికంగా సభను వాయిదావేసేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనను పక్కనపెట్టేశారు. రానున్న ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఆందోళనలు, ధర్నాలు, రైల్, రోడ్డు రోకోలతో సమరక్షేత్రంగా మార్చాలని చూస్తున్నాయి రెండు పార్టీలు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని 16వేల కోట్ల రూపాయలు తీసుకోండి. విదేశీరుణసాయం ప్రాజెక్టులకు బదులుగా ఈనిధులు వాడుకోండి అంటూ కేంద్రం చెబుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం వినబడనట్లు నటిస్తోంది. ఇప్పుడు ఈ సొమ్ము తీసుకుంటే తనకు రావాల్సిన రాజకీయ ప్రయోజనం పోతుంది. అందుకే రాష్ట్రం ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఎస్పీవీ ని మాత్రం ఏర్పాటు చేయదు. మరోవైపు ఏ విషయంలోనూ కేంద్రాన్ని గట్టిగా నిలదీయడానికి వైసీపీ సాహసించదు. నిరంతరం టీడీపీతోనే పోరాటం చేస్తుంది. ఇలా రెండుపార్టీలూ పక్కదారి పట్టాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News