మనీ "మాయం"

Update: 2018-04-10 15:30 GMT

అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరును, ద్విజుడును ..ఉన్న ఊళ్లో ఉండమంటాడు శతకకారుడు. మిగిలిన వాటి సంగతేమో కానీ క్యాష్ రూపంలో అప్పు ఇచ్చేవాడు దొరికితే చాలు, హాయిగా కాలం గడుపుకోవచ్చని ఎదురుచూస్తున్నారు తెలుగురాష్ట్రాల ప్రజలు. ఎందుకంటే చిల్లిగవ్వ చేతిలో ఆడటం లేదు. ఏటీఎంలు ఖాళీ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల్లో సైతం అడిగినంత నగదు ఇవ్వడం లేదు. కొరత ఉందని చెబుతూ మొక్కుబడిగా పదో,ఇరవయ్యో వేలు చేతిలో పెడుతున్నారు. సొమ్ము మనది, దానిపై వ్యాపారం చేసి లాభం తెచ్చుకునేది బ్యాంకులు. నిత్యం సొంత అవసరాలకోసం కాసుల కోసం కటకట. 2016 నవంబరులో నోట్లరద్దుతో మోడీ కొట్టిన దెబ్బ ఇంకా సలుపుతూనే ఉంది. తాజాగా మరింత తిరగబెట్టి ఎటీఎంలు నోళ్లు వెళ్లబెడుతున్నాయి. ఒక వ్యవస్థ విశ్వాసం కోల్పోతే ఎదురయ్యే పరిస్థితులకు పరాకాష్టగా తయారైంది బ్యాంకింగు వ్యవస్థ. ఒక వెయ్యిరూపాయలు చేబదులివ్వు గురూ అని అడిగేవారు కార్యాలయాల్లో తరచూ కనిపిస్తున్నారు.

వెయ్యరు..తియ్యరు...

నోట్ల రద్దుకు ముందు వరకూ ప్రజలు ఏదో నామమాత్రం డబ్బులను చేతిలో ఉంచుకునేవారు. మిగిలిందంతా బ్యాంకుల్లోనే ఉండేది. అవసరాన్ని బట్టి కార్డు తో రోడ్డు పక్కన ఉన్న ఏదో ఏటీఎంలో డ్రా చేసుకునేవారు. వస్తువుల కొనుగోళ్లకు సైతం చాలావరకూ క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించేవారు. నోట్ల రద్దు పుణ్యమా? అని ప్రజల్లో అవేర్ నెస్ పెరిగింది. కార్డుల ద్వారా జరుగుతున్న లావాదేవీలపై పన్ను పడుతోందన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా ఇది జరిగినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. నోట్ల రద్దు తర్వాత కార్డులు వాడమని ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. ప్రజల్లో వాదోపవాదనలు మొదలయ్యాయి. మా సొమ్ము మేము నచ్చినట్లు వాడుకునే అవకాశం లేకుండా ప్రభుత్వ నియంత్రణ ఏమిటనే ఆందోళన మొదలైంది. ఆ తర్వాతనే ఒకటొకటిగా వాస్తవాలు బయటికిరావడం మొదలైంది. కార్డుల వాడకంతో పన్నులు పడతాయని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. అంతేకాదు, ప్రతి కొనుగోలు ప్రభుత్వ నిఘాలోకి వెళ్లిపోతుందన్న వాస్తవమూ బోధ పడింది. దీంతో ప్రభుత్వ పరంగా వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. అయినా ప్రజలు విశ్వసించలేకపోయారు. దాంతో నగదు పెట్టి కొనుగోలు చేస్తే ఎటువంటి బెడదా ఉండదనే నిర్ణయానికి వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్డు కొనుగోళ్లు పెరిగినా అది బలవంతంగానే తప్ప స్వచ్ఛందంగా కాదు. ఏటీఎంలు చాలావరకూ తాత్కాలికంగా మూతపడటమో, నో క్యాష్ బోర్డులు పెట్టడమో సాగుతోంది. దీంతో తమ అవసరాల నిమిత్తం ప్రజలు నగదును తమ ఇళ్లల్లోనే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగస్థులు సైతం జీతం అకౌంట్లో పడినతర్వాత చాలావరకూ బ్యాంకు నుంచి ఏదోరకంగా డ్రా చేసి ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. దీనివల్ల బ్యాంకులకు నష్టం జరుగుతోంది. నిరర్థకంగా మనీ బీరువాల్లో మూలుగుతోంది.

సొమ్ము దాచేస్తున్నారా?

తన అవసరానికి డబ్బులను ఈ బ్యాంకులు, ఏటీఎంలు సమకూర్చవని సామాన్యుడు ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడే వ్యవస్థపై విశ్వసనీయత క్షీణించింది. యాభైరోజులాగండి . మీసమస్యలు తీరిపోతాయని చెప్పిన మోడీ వాగ్దానం వట్టి బూటకంగా తేలిపోయింది. ఈ నాటికి కూడా నగదు కొరత వెన్నాడుతోంది. కూలినాలి పనులు చేసుకునేవారికి, చిన్నాచితక కొనుగోళ్లకు నగదు మార్పిడికి ఇంకా ప్రత్యామ్నాయం రాలేదు. చిన్న మోస్తరు హోటళ్లలో కూడా ఇంకా నగదునే స్వీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సొమ్ము గడప దాటడం లేదు. ఇళ్లల్లోనే బందీ అవుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కొరతకు మరో కారణాన్ని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. దాదాపు ఏడాదికాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో పోటీపడాలనుకుంటున్న ఔత్సాహికులు నగదు నిల్వపై దృష్టిపెడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రానున్న ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థి కనీసం 20 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయా పార్టీల అగ్రనేతలే చెబుతున్నారు. ఎంపీ నియోజకవర్గానికైతే ఈమొత్తం 60 కోట్ల వరకూ ఉంటుందట. ఇంత పెద్ద మొత్తం నగదును అప్పటికప్పుడు సమకూర్చుకోవడం కష్టం. ఎన్నికల షెడ్యూలు వెలువడకముందునుంచే నిఘా మొదలై పోతుంది. ఇప్పుడైతే చాలా సేఫ్. అందుకే వివిధ కాంట్రాక్టులు, కమీషన్ల రూపంలో వస్తున్న సొమ్ములను నగదు రూపంలో దాచిపెడుతున్నారనేది అభియోగం. ఈ డబ్బునే వచ్చే ఎన్నికలకు పెట్టుబడిగా వాడతారంటున్నారు. ఇది నమ్మశక్యంగా కనిపించదు. కానీ తెలుగు నేతలు ఎంతవరకైనా తెగిస్తారనేది రాజకీయ వర్గాల నమ్మకం. అందులోనూ ఈ సారి ఎన్నికలు బహుముఖ పోటీలతో కురుక్షేత్రాన్ని తలపింపచేయబోతున్నాయి. తాడోపేడో తేల్చుకునే క్రమంలో కోట్ల రూపాయలు పెద్ద లెక్కకాదు. దొరికిపోయే పద్ధతులు కాకుండా రక్షిత విధానం నగదు పంపిణీతో ఓట్లు కొనుగోలు చేసుకోవడమేనన్నది నాయకుల సిద్దాంతం. దీనికి ఇప్పట్నుంచే హంగామా మొదలైందన్న వాదనకూ నగదు కొరత ఊతమిస్తోంది.

కమలానికి కష్ట కాలం...

నోట్ల రద్దుతో నల్ల ధనానికి చెల్లుచీటీ అంటూ చేసిన ప్రచారం ప్రధాని మోడీ కొంప ముంచేట్లు కనిపిస్తోంది. నల్ల ధనం కట్టడి కాలేదన్న వాస్తవం ప్రజలందరూ అంగీకరిస్తున్నారు. అవినీతికి ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. మామూళ్లు, లంచాలు, కమీషన్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. పైపెచ్చు నగదుకొరతకు నోట్ల రద్దు కారణంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఆవేదనే ఆందోళనగా, ఆగ్రహంగా రూపాంతరం చెంది అవకాశం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇంకా నోట్ల కష్టాలు తీరకపోవడం వల్ల 2019లో బీజేపీకి నష్టం వాటిల్లే సూచనలున్నాయంటున్నారు పరిశీలకులు. మోడీ చిత్తశుద్ధిని, అంకితభావాన్ని శంకించేవారు లేరు. కానీ మొండితనంతో పర్యవసనాల గురించి పట్టించుకోకుండా తీసుకున్న చర్యలతో 130 కోట్ల మంది ప్రజలను రోడ్డున నిలబెట్టడమేమిటన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. అవినీతిపరులు, రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం చేస్తే తప్పులేదు. కానీ మోడీ నేరుగా అన్నెం పున్నెం ఎరగని సామాన్యుడిపైనే పోరు మొదలెట్టారు. ఫలితం ప్రతికూలంగా ఉంటుందని సంబరపడుతున్నారు రాజకీయ విమర్శకులు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News