కలిసి వచ్చిన అదృష్టమేనా?

Update: 2018-04-09 15:30 GMT

మరక పడితే పడింది. ఎవరూ చూడలేదు. అంతే చాలు. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెద్ద గా చర్చ లేకుండానే తూతూమంత్రంగా ముగిసిపోయింది. ద్రవ్యవినిమయ బిల్లు నిముషాల వ్యవధిలోనే పాస్ అయిపోయింది. కాగ్ వంటి రాజ్యాంగ సంస్థలు వెలికి తెచ్చిన లోపాలు వెలుగులోకి రాకుండా పోయాయి. పార్లమెంటు స్తంభించి పోయింది. ప్రతిపక్షాల గోలే తప్ప పాలకపక్షాలు లోలోపల మురిసిపోయాయి. ప్రశ్నించే నాథుడే లేకుండా తమ ఇష్టారాజ్యంగా బిల్లులకు ఆమోదముద్ర వేసేసుకున్నారు. ధరలు పెరిగి సామాన్యుడు గగ్గోలు పెడుతున్న అంశాల ప్రస్తావనే లేకుండా బయటపడిపోయారు. కష్టాల్లో కలిసొచ్చే కాలమంటే ఇదే. కేంద్రంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైలైట్ కావాల్సిన అనేక ఆందోళనలు అటకెక్కేశాయి.

సందట్లో సడేమియా...

కేంద్రప్రభుత్వం సంస్కరణల రూపంలో ప్రజలపై భారం పడే అనేక నిర్ణయాలను వరసగా తీసుకొంటోంది. ముఖ్యంగా ఖజానాకు నిధులు సమకూర్చే వాటి విషయంలో ప్రతిపక్షాల నిరసనలు పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యుల అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన పుణ్యమా అని వేరే నిరసనలకే తావు లేకుండా పోయింది. అసలు చర్చే చోటు చేసుకోలేదు. వ్యూహాత్మకమో లేక యాధృచ్ఛికమో కేంద్రానికి టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలూ కలిసివచ్చాయి. అవిశ్వాసం చర్చకు వస్తే మొత్తం ప్రభుత్వ విధానాలపైనే దాడి చేసేందుకు విపక్షాలకు అవకాశం దక్కేది. నాలుగేళ్లపాలనను కడిగిపారేసేవారు. కనీసం సాధారణంగా పార్లమెంటు జరిగినా ప్రశ్నోత్తరాలు, స్వల్పవ్యవధి చర్చలు, డిమాండ్లపై చర్చల వంటి వాటి ద్వారా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు వీలుంటుంది. అవేమీ లేకుండా పోయాయి. బడ్జెట్ తో పాటు లిఖితపూర్వకంగా ఇచ్చిన అనేక సమాధానాల్లో విలువైన సమాచారం గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. ఒక రకంగా చూస్తే ప్రభుత్వానికి విపక్షాలే వెసులుబాటు కల్పించాయి. ప్రభుత్వ పక్షం సాధ్యమైనంత తక్కువ రోజుల్లో చట్టసభల నిర్వహణను ముగించేయాలనుకుంటుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై సభ్యులు సంధించే ప్రశ్నలు ప్రజల్లో నానకుండా ఉంటాయి. ఇప్పుడు జరిగింది అదే. 13 రోజుల పాటు ఒక్క గంట కూడా సభ నడవకుండా క్షణాల్లోనే వాయిదా పడటం , 2000 సంవత్సరం తర్వాత అత్యంత తక్కువ రోజులు నడిచిన బడ్జెట్ సెషన్ గా రికార్డు కెక్కడం చట్టసభకు వన్నెతెచ్చే విషయం కాదు.

దోపిడీకి దొంగబాట....

సామాన్యుడు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా అడ్డదారుల్లో ప్రభుత్వ ఖజానా నింపుకునే యత్నాలు నిరంతరం సాగుతున్నాయి. అందులోనూ 2014 తర్వాత ఈ వ్యవహారంలో కేంద్రం మరింతగా రాటుదేలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా రేట్లు తగ్గించకుండా ఏడాదికి కేంద్రప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఆర్జించే విధంగా పెట్రోలియం ఉత్పత్తుల లాభాలాను దండుకుంది. 2014 కు ముందు ఏడాదికి లక్ష కోట్లరూపాయల మేరకు మాత్రమే వార్షిక ఆదాయం ఉండగా అది రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రతి లీటరుపై పదిరూపాయల వరకూ ఉన్న కేంద్రపన్ను భారాన్ని 22 రూపాయలకు పెంచేసుకున్నారు. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా సవరిస్తామన్న సూత్రాలను తుంగలో తొక్కి సెస్సుల రూపంలో వాస్తవధర చూపకుండా ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేశారు. ఇప్పుడు గడచిన పదిహేను రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లలో రేట్లు పెరగడంతో ఆ భారాన్ని మళ్లీ వినియోగదారునిపై మోపుతూ వచ్చారు. లాభాలను మాత్రం ఏమాత్రం తగ్గించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశ్నించడంలోనే ప్రతిపక్షాలు వైఫల్యం చెందాయి. నిజానికి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ వంటి అంశాలు ప్రతి ఇంటితోనూ ముడిపడిన సమస్యలు . వీటిని ఫోకస్ గా చెప్పగలిగితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. కానీ పూర్తిగా రాజకీయాంశాల్లో తలమునకలైన విపక్షాలు వీటిని పట్టించుకోలేదు. దోపిడీకి రాచమార్గం పరిచినట్లయింది. ధరలపై గతంలో కనిపించే సెన్సిటివిటీ కరవు అయ్యింది. ఇది ప్రభుత్వాలకు కలిసొచ్చే అంశం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ తెగించి ధరల పెంపుదలను నియంత్రించకుండా వదిలేస్తున్నాయంటే ప్రభుత్వాలు ఎంత ధీమాగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. రేట్లు పెరిగినప్పుడు ఎక్సైజ్ సుంకాలను తగ్గించి, సెస్ లను ఎత్తివేయడం ద్వారా ఆ భారం ప్రజలపై పడకుండా చూడవచ్చు. కానీ ఆ దిశలో చర్యలు ఉండటం లేదు. ఎన్నికల సంవత్సరంలోనే ఇంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటే ముందు ముందు గడ్డుకాలమేనంటున్నారు సామాజికవేత్తలు.

హమ్మయ్య పనై పోయింది...

తెలుగు రాష్ట్రాల సర్కారులు కూడా దేశంలోని రాజకీయ గందరగోళానికి సంబరాలు చేసుకున్నాయి. కాగ్ వంటి రాజ్యాంగ వ్యవస్థలు ఎత్తిచూపిన తప్పులు పెద్దగా మీడియాలోనూ, ప్రజల్లోనూ చర్చకు నోచుకోలేదు. అప్పులను ఆదాయంగా చూపి మిగులు బడ్జెట్లను రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వమూ బదులివ్వలేదు. ఇక ఆంధ్రా సర్కారుది మరో రూటు. రుణపరిమితిని దృష్టిలో పెట్టుకుని హౌసింగు కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసుకుంది. ఎఫ్ఆర్బీఎం అనే నిఘానేత్రం కంటిలో పడకుండా తప్పించుకుంది. మళ్లీ అంతలోనే అదే సంస్థకు తిరిగి చెల్లించేసింది. అంతా బుక్ అడ్జస్ట్ మెంట్ తంతే. ఇలాంటి ఘట్టాలు చాలానే ఉన్నా ఎవరూ మాట్లాడుకోలేదు. అవిశ్వాసం,ఆత్మాభిమానం, అయిదుకోట్ల ప్రజలకు నష్టం అంటూ సెంటిమెంటుతో చెలరేగిపోతున్న ఆంధ్రా సర్కారు అవకతవకలూ ప్రజలకు చేరలేదు. మొత్తమ్మీద ఎవరి పని వాళ్లు పూర్తయ్యిందనిపించుకుని చేతులు దులిపేసుకున్నారు. ప్రజలే నష్టపోయారు. కనీసం తమకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగే వారు లేకుండా పోయారు. తాము చెల్లిస్తున్న పన్నుల కు జవాబుదారీతనం ఆశించడమే అత్యాశగా మారింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News