మరొకరిని ఎదగనివ్వడం లేదుగా.. అందుకేనా?

భారతీయ జనతా పార్టీలో మరో నాయకత్వం ఎదగనివ్వకుండా చేస్తున్నారా? అవును తమకు మరో పదేళ్ల పాటు ఎదురు లేకుండా చూసుకునేందుకు మోదీ, అమిత్ షాలు ముందునుంచే ప్రయత్నిస్తున్నారు. [more]

Update: 2021-05-12 17:30 GMT

భారతీయ జనతా పార్టీలో మరో నాయకత్వం ఎదగనివ్వకుండా చేస్తున్నారా? అవును తమకు మరో పదేళ్ల పాటు ఎదురు లేకుండా చూసుకునేందుకు మోదీ, అమిత్ షాలు ముందునుంచే ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల పాటు దేశాన్ని ఏలాలన్నది వారి లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకోసమే తమ వారసులను ఎవరినీ ఎదగనివ్వకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి 2024లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ప్రధానిగా నరేంద్రమోదీని చేయాలన్నది అమిత్ షా ఆలోచనగా ఉంది.

ఆయన కాకుంటే?

నరేంద్రమోదీ కాకుంటే ఆ స్థానంలో అమిత్ షా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనేపథ్యంలో బీజేపీలో యువనేతలను ఎదగనివ్వడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజానికి మోదీ, అమిత్ షాలు నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన తర్వాతే దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురవేయగలిగింది. ఇందులో మరో సందేహానికి తావులేదు. వరస ఎన్నికల్లో గెలుపులు వారి ఇమేజ్్ ను మరింత పెంచాయనే చెప్పాలి.

యువనేతలున్నా….

అందుకోసమే రికార్డు బ్రేక్ చేయాలన్నది మోదీ ఆలోచనగా ఉంది. మరోసారి ప్రధాని పీఠమెక్కి రికార్డు సృష్టించాలనుకుంటున్నారు. అందుకోసమే బీజేపీలో ఉన్న యువనాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవేంద్ర ఫడ్నవిస్, యోగి ఆదిత్యానాధ్ వంటి యువనేతలతో పాటు నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నేతలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే తమకు నమ్మకమైన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించారంటారు.

ఆర్ఎస్ఎస్ ను కూడా….?

కొంత కాలం వరకూ ఆర్ఎస్ఎస్ ప్రభావం పనిచేసేది. అయితే ఇప్పుడు మోదీ, షాలు ఆర్ఎస్ఎస్ ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ లాంటి వారు తిరిగి అటువైపే వెళుతున్నారు. సంఘ్ పరివార్ ను కూడా అయోధ్య లాంటి అంశాలతో తమ గుప్పిట పట్టేశారంటున్నారు. తమకు పార్టీ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇప్పటి నుంచే అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర బీజేపీలపై పూర్తి పట్టు సాధించారు. మొత్తం మీద జనం ఆదరిస్తే మరో పదేళ్లపాటు కుర్చీనుంచి దిగేందుకు మోదీ ఇష్టపడటం లేదన్న టాక్ బాగా విన్పిస్తుంది.

Tags:    

Similar News