మోడీ ...లాస్ట్ లాఫ్...

Update: 2018-07-22 15:30 GMT

కాంగ్రెసుకు కాసింత ఆత్మస్థైర్యం చిక్కింది. మోడీ మొనగాడనిపించుకున్నాడు. రక్తి కట్టిన నాటకీయ సన్నివేశాలు, రాజకీయ విన్యాసాల మధ్య అవిశ్వాసతీర్మానం వీగిపోయింది. అది అందించిన సందేశం మాత్రం మిగిలిపోయింది. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ వంటివి పెద్దగా వర్కవుట్ అయ్యే వ్యవహారాలు కాదని తేలిపోయింది. బలమైన రెండు పక్షాలే సమీకరించుకుని సంఘటితమయ్యే పరిస్థితికి లోక్ సభ దర్పణం పట్టింది. మూడు ముఖాలుగా సన్నివేశం ఆవిష్క్రుతం కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అధికారపక్ష భాగస్వాములైన సంకీర్ణ మిత్రులు, రాజకీయ అవసరాలతో దూరం ఉండకతప్పని పాలకపార్టీ అనుకూల ప్రత్యర్థులు, పూర్తిగా విభేదించే రాజకీయ ప్రత్యర్థులుగా రూపుదాలుస్తోంది భారత ముఖచిత్రం. నో కాన్ఫిడెన్సు మోషన్ సందర్భంగా ఒక స్పష్టత వచ్చింది. ఏ సందర్బాన్ని అయినా అందిపుచ్చుకుని తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట అయిన నరేంద్రమోడీ తన విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించారు. వాక్చాతుర్యంలో వన్ మేన్ ఆర్మీని తలపించారు. కాంగ్రెసు, విపక్షాలు ధాటిగానే విమర్శలు కురిపించినా చివరి నవ్వు తనదేనని నిరూపించుకున్నారు ప్రధాని.

రాహుల్ రైటేనా..?

అఖిలభారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనను తాను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు రాహుల్ గాంధీ. దానికి పార్లమెంటుకు మించిన వేదిక లేదు. ఆయన దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రమైన అవగాహనను పెంపొందించుకోవాలి. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాలి. తొలి ప్రయత్నంగా అవిశ్వాసంపై చెలరేగి ప్రసంగించారు రాహుల్. దేశ వ్యాప్తంగా కాంగ్రెసు క్యాడర్ లో కాసింత నమ్మకం పెంచారు. సహచర కాంగ్రెసు ఎంపీలే కాకుండా విపక్ష సభ్యులు సైతం రాహుల్ లోని ఆత్మవిశ్వాసాన్ని అభినందించారు. యువత, మహిళలు, రైతాంగం సమస్యలను ప్రస్తావించారు. కేంద్రాన్ని నిలదీసే ధోరణిలో దూకుడును కనబరిచారు. బ్యాంకులు కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న రుణాలు, సామాన్యునికి దొరకని పరపతి వంటి అంశాలపైనా ప్రశ్నలు సంధించారు. మొత్తమ్మీద ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని పోయే ధోరణి, అధికారపార్టీని ఇరకాటంలో పెట్టే వైఖరిని బాగా వంటపట్టించుకున్నారు. వారసుడు కాంగ్రెసుని సరిగా నడపగలడా? లేడా? అనే సందేహాలతో పార్టీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి. అవిశ్వాస సందర్భంగా దీనికి తెరపడింది. భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయగల సామర్ధ్యం రాహుల్ కు ఉందనే భరోసా ఏర్పడింది.

తనలోని పొలిటికల్ మెటల్ ను కాంగ్రెసు అధినేత ప్రదర్శించగలిగారు.

కౌగిలించి ...కన్ను కొట్టి..

ప్రధానంగా రాహుల్ అనుసరించిన నాటకీయత దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ప్రధాని సీటు వద్దకు వెళ్లి మోడీని కౌగిలించుకొన్న ఘట్టం పత్రికల పతాక చిత్రంగా మారింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా హోరెత్తింది. తన సహచరులవైపు చూసి కన్నుకొట్టిన ఘట్టమూ మీడియా సెన్సేషన్ గా మారింది. నిజానికి రాహుల్ శైలికి భిన్నమైన ఘట్టాలు ఇవి. సాధారణంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ తరహా నాటకీయతకు పెట్టింది పేరు. హఠాత్తుగా తనకు ప్రత్యర్థిగా నిలిచే వ్యక్తికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడము, ఎవరూ ఊహించని విధంగా సానుకూల సంకేతాలు పంపడం వంటివి మోడీకి వెన్నతో పెట్టిన విద్యలు. నవాజ్ షరీప్ పుట్టిన రోజుకు పాకిస్తాన్ లో వాలిపోయిన దృశ్యం ఇంకా ప్రేక్షకుల కళ్లలో మెదలుతూనే ఉంటుంది. అంతవరకూ మోడీపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడిన రాహుల్ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకొన్నారు. అందర్నీ సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తారు. అయితే కొన్ని వర్గాలు రాహుల్ వైఖరిని తప్పుపట్టాయి. పార్లమెంటేరియన్ స్థాయికి తగినది కాదని విమర్శలూ వినవచ్చాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ప్రధానిని ఆలింగనం చేసుకోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. వ్యక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఆ ద్రుశ్యం దేశ ప్రజల్లో కలిగించిన సంచలనం చెరిపివేయలేనిది. యువ ఓటర్లలో క్రేజ్ స్రుష్టించుకోవడానికి ఇటువంటి టెక్నిక్ లు దోహదం చేస్తాయి.

కడిగి పారేశాడు...

సాధారణ పరిస్థితుల్లోనే మోడీకి మైక్ ఇస్తే ..శ్రోతలు మంత్రముగ్ధులైపోవాల్సిందే. తన ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఊరుకుంటాడా? వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్న కాంగ్రెసు వైఖరిని కడిగిపారేశాడు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం, ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్లు వేటిపైనా కాంగ్రెసు విశ్వాసం కనబరచదు. అటువంటి పార్టీ తన ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించడం పెద్ద విషయమే కాదన్నట్లు తీసి పారవేశాడు. రాహుల్ ప్రధాని సీటు వద్దకు చేరుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నారంటూ కాంగ్రెసు అద్యక్షుని చర్యను ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ కన్నుకొట్టి ప్రతిపక్షాలను చీల్చి వేస్తోందని ఆరోపించారు. చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ల నేత్రుత్వాల్లోని ప్రభుత్వాలకు మద్దతిచ్చి తర్వాత కూల్చి వేసిన ఉదంతాలను గుర్తు చేశారు. విపక్షాలు కాంగ్రెసు చెంత చేరడం ప్రమాదకరమనే సంకేతాలను పంపించారు. ఇక కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ సేవలు అందించిన వారికి సైతం తగిన స్థానం కల్పించలేదన్నారు. శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ వంటివారిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తమ్మీద కాంగ్రెసుపార్టీ నాయకత్వం పట్ల సీనియర్లలో అనుమాన బీజాలు నాటే ప్రయత్నం చేశారు. కాంగ్రెసు నాయకత్వం పట్ల ఇతర పార్టీలలో సందేహాలు రేకెత్తించడం, సొంత నాయకుల్లో అనుమానం రేపడం అనే ద్విముఖ వ్యూహంతో కాంగ్రెసుపై చెలరేగిపోయారు మోడీ. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదా వంటి అంశాలు పెద్ద విషయాలు కాదన్నట్లుగా తేల్చిపారేశారు. కాంగ్రెసును సీన్ లోకి తీసుకు రావడం ద్వారా లార్జర్ పిక్చర్ ను పక్కాగా టార్గెట్ చేశారు మోడీ.

Similar News