వారికి ఎమ్మెల్సీలు కావాలట…!!

అధికారం ఓ మత్తు. అందుకోవడమే గమ్మత్తు. దానికి లక్ ఉండాలి. వై.ఎస్. జగన్ గాలిలో కూడా టికెట్లు రాని వారు దురద్రుష్టవంతులైతే, వచ్చినా గెలవని వారు మరీ [more]

Update: 2019-07-10 09:30 GMT

అధికారం ఓ మత్తు. అందుకోవడమే గమ్మత్తు. దానికి లక్ ఉండాలి. వై.ఎస్. జగన్ గాలిలో కూడా టికెట్లు రాని వారు దురద్రుష్టవంతులైతే, వచ్చినా గెలవని వారు మరీ బ్యాడ్ లక్ బ్యాచ్ వాళ్ళు. ఇక వేరే పార్టీలో ఉండి చివరి నిముషంలో వైసీపీలో చేరి టికెట్ కొట్టేసిన వారు సైతం ఓడిపోయినా హవా చాటాలనుకుంటున్నారు. నామినేటేడ్ పదవుల్లో వీరు మళ్ళీ వాటాకు రావడంతో మొదటి నుంచి ఉన్న వారు, టికెట్లు కూడా దక్కని వారు గుస్సా అవుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే చాలా మంది ఇపుడు ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. విశాఖ అర్బన్ జిల్లాలో సౌత్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ద్రోణం రాజు శ్రీనివాస్ ఇపుడు ఎమ్మెల్సీ వైపు చూపు సారించారని అంటున్నారు. ఆయన చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిపోయారు. కేవలం నాలుగున్నర వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన తనకు తగిన ప్రాధాన్యత కొత్త సర్కార్ ఇస్తుందని ఆశిస్తున్నారు.

ఆ పదవి వద్దట…

బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ద్రోణం రాజు శ్రీనివాస్ కి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ పదవి చేపట్టేందుకు శ్రీనివాస్ విముఖంగా ఉన్నారని అంటున్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితమైపోతే తనకు పొలిటికల్ కెరీర్ ఉండదన్న ముందు చూపుతో నో చెప్పేస్తున్నారట. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన స్వయంగా వై.ఎస్. జగన్ ను కలసి కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇదే వరసలో ఎమ్మెల్సీ రేసులో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఉన్నారు. ఆయన ఈ మధ్యనే అమరావతి వెళ్ళి వై.ఎస్. జగన్ ను కలిసి వచ్చారు. తనకు పెద్దల సభలో సీటు ఇచ్చి పెద్దమనిషి గా గౌరవించాలని కోరుతున్నారు. గవర సామాజిక వర్గానికి వైసీపీలో ప్రాముఖ్యత లేదని, దాన్ని భర్తీ చేయాలని ఆయన విన్నపం చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ ఇద్దరూ అదే రూట్లో….

ఇక విశాఖలో మరో ఇద్దరు నాయకులు ఉన్నారు. వీరు వైఎస్సార్ హయాం నుంచి ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నారు. వైసీపీ లో కూడా చురుకుగా పనిచేస్తున్నారు. అప్పట్లో కార్పోరేషన్ చైర్మన్ పోస్టులకు వీరిని నామినేట్ చేశారు. ఇపుడు వై.ఎస్. జగన్ తమకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని వీరు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామక్రిష్ణారెడ్డి విసాఖ జిల్లా రెడ్డి కోటాలో తమకు న్యాయం చేయాలని అడుగుతున్నారని టాక్. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా ఎమ్మెల్సీ పోస్ట్ ఆశిస్తున్నారు. ఆమె సైతం తనకు హామీ ఇచ్చిన ప్రకారం పదవి దక్కుతుందని ఆశపడుతున్నారు. వీరు కాకుండా ఇంకా అనేకమంది ఎమ్మెల్సీ పోస్ట్ అడుగుతున్నారు. అయితే విజయనగరం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే కావడంతో ఆ పోస్ట్ ఖాళీ అవుతోంది. మరి ఒక్క పోస్ట్ కు ఎంతో మంది రేసులో ఉన్నారు. వై.ఎస్. జగన్ ఎవరికి ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News