పెత్తనం వారిదేనట… !!

ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంతకాలం ఏం చేసినా పర్వాలేదు, ఇపుడు మాత్రం జనంలో ఉండాలి. వారి కరుణా కటాక్షాలు సంపాదించాలి. ఎందుచేతనంటే ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి, [more]

Update: 2019-01-07 09:30 GMT

ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంతకాలం ఏం చేసినా పర్వాలేదు, ఇపుడు మాత్రం జనంలో ఉండాలి. వారి కరుణా కటాక్షాలు సంపాదించాలి. ఎందుచేతనంటే ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ యావ ఇపుడు బాగా పట్టుకుంది. ప్రతీ దాంట్లోనూ మేమున్నామని జొరబడిపోతున్నారు. ఆఖరుకు ప్రతీ ఏడాది పంపిణీ చేసే చంద్రన్న సంక్రాంతి కానుకల్లోనూ ఎమ్మెల్యేలే చేరి హడావుడి చేస్తున్నారు. విశాఖ జిల్లాతో సహా ఉత్తరాంధ్రలో ఇపుడు సంక్రాంతి కానుకలను ఎమ్మెల్యేల చేతుల మీదుగా చాలా చోట్ల ప్రారంభించడం విశేషం. తాము వచ్చేవరకూ సరకు పంపిణీ చేయొద్దంటూ హుకుం జారీ చేసి మరీ ఎమ్మెల్యేలు దర్జా ఒలకబోస్తున్నారు. సరకులు రేషన్ దుకాణాలకు వచ్చి మూడు రోజులైనా ఎమ్మెల్యేలు రిబ్బన్ కటింగు చేయకపోతే పంపిణీ చేయడానికి వీలులేని స్థితి కల్పించారు. ఈ విధంగా తామే జనాలను ఉద్దరిస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చి మరీ తెల్లకార్డుదారుల కరుణ కోసం పరితపిస్తున్నారు.

వాటాల గొడవ….

ఇక అభివృద్ధి పనుల్లో సైతం వాటాల గొడవ పడుతూ ఎమ్మెల్యేలు మంత్రులు ఏకంగా రంగంలోకి దిగిపోతున్నారు. అది కార్పోరేషన్ చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన దుకాణాల‌ సముదాయమైనా, గల్లీలో వేసిన రోడ్డు అయినా సరే తమ ముద్ర ఉండాల్సిందేనని ఇపుడు కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ విధంగా విశాఖలో కార్పోరేషన్ కట్టిన దుకాణాల‌ సముదాయంలో షాపుల వాటా కోసం ఓ మంత్రి గారు, మరో ఎమ్మెల్యే వాటాలు కుదరక తాజాగా బజారున పడ్డారు. దాంతో షాఫుల ప్రారంభం సైతం ఆగిపోయింది. తనది కాని నియోజకవర్గంలో మంత్రి గారు వేలు పెట్టి మరీ తన అనుచరులకు షాపులు కావాలని అడిగితే కాదు పొమ్మన్నందుకు ఆ ఎమ్మెల్యేతో మంత్రి గారికి వార్ మొదలైపోయింది.

ఇళ్ళ మంజూరులోనూ….

ఇక పేదలకు ఇళ్ల మంజూరులోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేతి వాటం బాగా చూపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వర్గం వారికి ఎక్కువ ఇళ్ళు ఇవ్వాలని మంత్రి స్థాయిలో ఆదేశాలు వస్తే, మా నియోజకవర్గంలో మంత్రి గారి పెత్తనమేంటని ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నారు. మొత్తానికి ఎవరి మటుకు వారు ఓట్ల పంట పండించుకోవడానికి ప్రభుత్వ పధకల, సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ధి పనులను సైతం వాటాలేసుకుని గొడవలకు దిగుతున్నారు.

మంత్రులదే పైచేయి…

ఎన్నికల్లో మళ్లీ గెలవడం ప్రతి ఎమ్మెల్యేకూ అవసరమే, కానీ అందుకు విలువైన నాలుగున్నరేళ్ళ కాలాన్ని వదిలేసి ఎన్నికల ముందు ఈ తరహా వీరంగాలు వేయడమేంటని బాధిత జనం ఆవేదన చెందుతున్నారు. తమ చేతికి అందాల్సిన పధకలు ఇలా నాయకుల మధ్యన‌ యుధ్ధం పుణ్యమాని వెనక్కు పోతున్నాయని లబ్దిదారులు గోడుమంటున్నారు. ఇది చాలదన్నట్లుగా అధికారులను సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు వత్తిడి తెస్తూ తమ ఏరియాల్లో మరిన్ని అన్న క్యాంటీన్లు, ఇతర పధకాలు మంజూరు చేయమంటున్నారుట. ప్రతీ పధకాన్ని తమ ఇలాకాలోకి తీసుకుపోవడం ద్వారా క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు. మరి ఈ రాజకీయ జోరుని జనం సహించి ఓటేస్తారా.

Tags:    

Similar News