ఆ ఓట్లే కీలకం..గెలిపించేది వారేనా...?

Update: 2018-11-18 15:30 GMT

రానున్న తెలంగాణ ఎన్నికల్లో ముస్లింలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. దక్షిణభారతంలో కేరళ, కర్ణాటక తర్వాత జనాభా సంఖ్యాపరంగా తెలంగాణలో అధికంగా ముస్లింలు ఉన్నారు. కొన్ని శతాబ్దాలపాటు అధికారిక మతంగా ఉండటంతో అత్యంత ప్రాధాన్యం కలిగిన వర్గం గా ముస్లింలు ఉంటూ వచ్చారు. స్వాతంత్ర్యానంతర కాలంలో వీరి ప్రాధాన్యం తగ్గుముఖం పట్టింది. కాంగ్రెసు పార్టీ వీరిని బుజ్జగిస్తూ తమ పార్టీకి ఓటు బ్యాంకుగా మలచుకోగలిగింది. ఏఐఎంఐఎం ప్రాబల్యంతో గడచిన మూడు దశాబ్దాలుగా హైదరాబాదు నగరంలో సొంత అస్తిత్వాన్ని చాటు కోగలిగారు. కాంగ్రెసుకు అండదండలిచ్చినప్పటికీ గంపగుత్తగా వీరి ఓట్లు ఒక పార్టీకే పడుతున్నాయని చెప్పలేని పరిస్థితి ఉంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని తమ పార్టీలకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రధాన పార్టీలు పాచికలు విసురుతున్నాయి. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో వీరు గెలుపును శాసించగల స్థితి లో ఉన్నారనేది అంచనా. గడచిన ఎన్నికల్లో విజేతకు, ప్రధాన ప్రత్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడాను దృష్టిలో పెట్టుకుని ముస్లిం ఓట్లు కలిస్తే విజయం తారుమారయ్యే స్థానాలపై ముందుగా దృష్టి పెడుతున్నారు. టీఆర్ఎస్, కూటమి నేతలు మైనారిటీల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.

అసద్ అండదండలు...

రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఎంఐఎం తర్వాత కాలంలో టీఆర్ఎస్ కు బాగా చేరువ అయ్యింది. ప్రధానంగా అధికారకేంద్రానికి చేరువగా ఉండటం ద్వారా పాతబస్తీపై పట్టు సాధించడం ఎంఐఎంకు అలవాటు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ల హయాంలోనూ ఇదే తంతు కొనసాగింది. అధికార పార్టీలతో మైత్రీ పూర్వక సంబంధాలతో హైదరాబాదు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో బాగా బలపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెసు, టీడీపీలు అండదండలందించాయి. ప్రత్యుపకారంగా అధికారపార్టీకి శాసనసభలో ఎంఐఎం సహకరిస్తూ వచ్చింది. హైదరాబాదు మినహా మిగిలిన జిల్లాల్లో మైనారిటీ ప్రభావిత నియోజకవర్గాల్లో అధికారపార్టీకి ఎంఐఎం పరోక్ష మద్దతు లభించేది. ఈరకంగా ఎక్కువగా లబ్ధి పొందింది కాంగ్రెసు. ప్రస్తుతం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారు. టీఆర్ఎస్ కు మద్దతునిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది తమ పార్టీకి ప్లస్ పాయింటు అవుతుందని తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు భావిస్తున్నారు. సమీకరణల్లో కాంగ్రెసు కంటే టీఆర్ఎస్ తోనే ప్రయోజనదాయకమని భావించిన ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా తమ శ్రేణులను ఆ పార్టీకి అనుకూలంగా మోహరిస్తోంది.

హస్తానికి అగ్రనేతలు...

ఇంతకాలం అండగా ఉంటున్న ఎంఐఎం ప్రత్యర్థితో చేతులు కలపడంతో కాంగ్రెసు డైలమాలో పడింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెసు వైపు మైనారిటీలు మొగ్గు చూపుతుంటారు. ముస్లింల సంతృప్తవిధానాలతో హిందువులకు కాంగ్రెసు అన్యాయం చేస్తోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కేరళ వంటి చోట్ల మైనారిటీ పార్టీలతో పొత్తులు కొనసాగిస్తోంది. హైదరాబాదులో ఎంఐఎం, కాంగ్రెసు కలిసినడుస్తూ ఉండేవి. యూపీఏ లో భాగస్వామి కాకపోయినప్పటికీ అసదుద్దీన్ సోనియాతో నిత్యం సమావేశాలకు హాజరవుతుండేవారు. దీనికి ప్రతిఫలంగా హైదరాబాదు పాతబస్తీలో ఎంఐఎంకి వ్యతిరేకంగా నామమాత్రంగా పోటీ అభ్యర్థులను నిలుపుతుండేది కాంగ్రెసు. మైనారిటీల్లో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ కాంగ్రెసు స్వయంక్రుతాపరాధాలతో పాతబస్తీలో బలహీనపడిపోయింది. ఎంఐఎంని నమ్ముకోవడంతో నిండా మునిగిపోయింది. రాజకీయాల్లో శాశ్వతమిత్రులు ఉండరన్న సూక్తిని మరిచిపోయింది. ఇప్పుడు మళ్లీ సొంతంగా తనకాళ్లపై తాను నిలబడేందుకు , ముస్లిం వర్గాల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్, షబ్బీర్ అలి వంటి నేతలను రంగంలోకి దింపుతోంది. అహ్మద్ పటేల్ , గులాం నబి అజాద్ లు ముస్లిం నేతలతో చర్చలు జరిపి కాంగ్రెసుకు సానుకూల వాతావరణం కల్పించాలని యోచిస్తున్నారు. అజాద్ మైనారిటీ ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగసభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ముస్లిం వర్గాలను చేరువ చేసుకుని టీఆర్ఎస్ వైపు మళ్లకుండా నిరోధించాలని భావిస్తున్నారు.

హామీలపై తర్జనభర్జన...

ముస్లిం వర్గాలకు హామీలు గుప్పించే విషయంలో పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ ఆడంబరం చేసింది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంది. రాజ్యాంగం , సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి అది సాధ్యం కాదని తెలుసు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించదనీ తెలుసు. అయినా అమలు కాని వాగ్దానం చేసింది. దీనిపై బీజేపీని విమర్శించే సాహసం కూడా చేయడం లేదు. అటు ఎంఐఎంతో, ఇటు బీజేపీతో మైత్రిని కొనసాగించడమనే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఎంఐఎం తో కలిసి తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో కీలకం అవుతామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అప్పుడు రిజర్వేషన్లను అమలు చేస్తామంటున్నారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన నాలుగుశాతం రిజర్వేషన్లను కాంగ్రెసు పార్టీ నాయకులు నొక్కి చెబుతున్నారు. వెనుకబడిన తరగతుల కోటాలో ముస్లిం రిజర్వేషన్లకు నాంది పలికింది తామేనంటున్నారు. అందువల్ల తమకు మద్దతునివ్వాలని కోరుతున్నారు. అయితే 12 శాతం రిజర్వేషన్లపై హామీనివ్వలేకపోతున్నారు. మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్రంలో మూడో వంతు సీట్లలో ప్రభావం చూపే ముస్లింలు అటు ఎంఐఎం మాటపై టీఆర్ఎస్ కు అండగా నిలుస్తారా? జాతీయ స్థాయి పరిణామాలను బేరీజు వేసుకుని కాంగ్రెసుకు అండదండలిస్తారా? అన్నది వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News