ఈ బూతుల మంత్రులను బయటకు తోసేయాల్సిందేనా?

విషయ పరిజ్ఞానం ఉన్న నేతలు రాజకీయాల్లో ఇప్పుడు తక్కువ మందే ఉన్నారు. కొందరు ఉన్నా వారికి సోషల్ మీడియా లో తప్ప సంప్రదాయ మీడియా లో చోటు [more]

Update: 2021-08-27 09:30 GMT

విషయ పరిజ్ఞానం ఉన్న నేతలు రాజకీయాల్లో ఇప్పుడు తక్కువ మందే ఉన్నారు. కొందరు ఉన్నా వారికి సోషల్ మీడియా లో తప్ప సంప్రదాయ మీడియా లో చోటు ఇస్తున్నది తక్కువే. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఈ ఫార్ములా ఇప్పుడు అటు సోషల్ మీడియా లోను, సాంప్రదాయ మీడియా లోను హైలైట్ అయిపోతుంది. ఇంతకి నేతలు ఎంచుకున్న కొత్త రూట్ ఏమిటి అంటే ప్రత్యర్థి పార్టీలపైనా, ప్రత్యర్థి నేతలపై బూతుల పంచాంగం విప్పడం.

కేసీఆర్ ఆద్యులు …

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత బూతుల పంచాంగానికి ఆద్యులని గత విభజన ఉద్యమంలో అంతా చెప్పుకునేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆంధ్రా నేతలపై విరుచుకు పడేందుకు కేసీఆర్ వాడిన పదాలు తెలుగు డిక్షనరీ లో కూడా దొరికేవి కావన్నంతగా ఉండేవి. పూర్తి మాస్ మసాలతో ఆయన సాగించిన ప్రసంగాలు ఆంధ్రా వారు సైతం ఆసక్తిగా వినేవారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత అధికారం దక్కడంతో ఆయన బూతు పంచాంగాన్ని సెలవు ఇచ్చేశారు. ఉద్యమ వేడి కోసం అలా అన్ననే కానీ మరొకలా అర్ధం చేసుకోవొద్దు అంటూ ఆంధ్రులు తనవారే అంటూ ముఖ్యమంత్రి గా ఉన్నందున హుందాగానే పోతున్నారు.

ఏపీ లో కొడాలి దే హవా …

కేసీఆర్ తరువాత ఈ పంచాంగం లో ఏపీ లో మంత్రి కొడాలి నాని మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన వాడే పదజాలానికి ధీటుగా ప్రధాన విపక్షం టిడిపి లో సమాధానం ఇచ్చే నేతే లేరంటే నాని ఏ రీతిన చెలరేగుతారో వేరే చెప్పక్కర్లేదు. చంద్రబాబు, లోకేష్ మాజీ మంత్రులు టిడిపి నేతలపై నాని వైసిపి పార్టీ వెపన్ గా పంచాంగం విప్పుతున్నారు. సమీప భవిష్యత్తులో కొడాలి నాని బూతుల పంచాంగం రికార్డ్ బద్దలు కొట్టే నాయకుడు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు.

ట్రెండ్ మార్చిన రేవంత్ …

కేసీఆర్ రూట్ లోనే తనదైన పంచాంగం ఆవిష్కరించారు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మంచి వాగ్ధాటి కలిగిన రేవంత్ తన ప్రసంగంలో పిట్ట కథలు చెబుతూ బూతులు జోడిస్తూ మసాలా స్పీచ్ ల స్పీడ్ పెంచారు. ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి రేవంత్ నోటికి అడ్డుకట్ట వేసే వారికోసం గులాబీ పార్టీ వెతుకుతూనే ఉంది. ఆ అన్వేషణలో ఇప్పుడు ఒక నేత ఆశాదీపంగా కారు పార్టీకి దొరికేశారు. ఆయనే మంత్రి మల్లా రెడ్డి.

రికార్డ్ లు తిరగరాసేసారు …

మంత్రి మల్లా రెడ్డికి రేవంత్ రెడ్డికి టిడిపి లో ఉన్నప్పటి నుంచి ఉప్పు నిప్పుగానే ఉండేది. కాలక్రమంలో మల్లా రెడ్డి కారెక్కేయడం, రేవంత్ సైకిల్ దిగి హస్తం చెంతకు చేరినా వీరి నడుమ ఆగ్రహావేశాలు ఇంచు కూడా తగ్గలేదని తాజా ఎపిసోడ్స్ రుజువు చేసింది. రేవంత్ తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ మంత్రి మల్లా రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా పక్కా మాస్ అవతారం ఎత్తేసి పూర్తి ఆన్ పార్లమెంటరీ భాష ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు రుచి చూపించేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి మల్లా రెడ్డి కి మించి బూతులు మాట్లాడిన నేత ఇప్పటికి లేరనే చెప్పాలి.

రేటింగ్స్ బాగుండటం తో …

ఛీ..ఛీ అంటూనే చూస్తూ ఉండటం, వినటం బూతుల ప్రత్యేకత. సభ్య సమాజం తలదించుకునే రీతిలో సాగే ఇలాంటి పంచాంగాలకు మీడియా లో ప్రోత్సహానికి కారణం ప్రజలే. మానసిక బలహీనతలే వ్యక్తుల్లో విచక్షణ ను చంపేస్తున్నాయి. వీటికి మీడియా లో విపరీత రేటింగ్స్ రావడంతో ఇప్పుడు చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు తమ పరిధిని దాటి దూషణ భూషణలకు దిగుతుండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు అనే అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మీడియా లో వీటిని చూపడానికి కొద్దిగా వెనుకాడుతున్నా సోషల్ మీడియా లో ఇలాంటివే వైరల్ అవుతూ ఉండటం దౌర్భాగ్యం అనే చెప్పాలి. ప్రజలు ప్రస్తుతం వీటిని ఎంటర్టైన్మెంట్ గా పరిగణించినా భావితరాలకు చెడు మార్గాన్ని అలవర్చిన వారే అవుతారు. ఇకనైనా పార్టీల పెద్దలు తమ నేతలను అదుపులో పెడతారా అంటే వారే ఈ బూతులకు మూల పురుషులు కావడంతో వ్యవస్థ మరింత దిగజారడం ఖాయంగానే కనిపిస్తుంది.

Tags:    

Similar News