ఆ మంత్రి దూకుడుకు అడ్డు ప‌డుతున్న ఎమ్మెల్యే

ఆయ‌న వైసీపీలో కీల‌క‌మైన మంత్రి. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ద‌గ్గర కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికి ఇద్దరు కీల‌క నేత‌ల‌ను కూడా పార్టీలోకి చేర్పించి.. [more]

Update: 2020-12-25 08:00 GMT

ఆయ‌న వైసీపీలో కీల‌క‌మైన మంత్రి. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ద‌గ్గర కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికి ఇద్దరు కీల‌క నేత‌ల‌ను కూడా పార్టీలోకి చేర్పించి.. జ‌గ‌న్ ద‌గ్గర భేష్ అని అని పించుకున్నారు. త‌న సామాజిక వ‌ర్గంలో కీల‌క నేత‌గా, ఎదురు లేని నేత‌గా ఎదిగేందుకు అష్టక‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే.. ఇప్పుడు అదే మంత్రి దూకుడుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఒక‌రు అడ్డు ప‌డు తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా.. మంత్రుల దూకుడుతో త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. కానీ, ఇక్క‌డ ఈ మంత్రి విష‌యంలో మాత్రం ఎమ్మెల్యే కాల‌ర్ ఎగ‌రేసుకుంటున్నారు. ఇద్దరూ అగ్రవ‌ర్ణాల‌కు చెందిన వారు కావ‌డం.. ఇద్దరిలోనూ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో వైఎస్ ఫ్యామిలీకి స‌న్నిహితంగా ఉండ‌డం ఇక్కడ ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న ప్రధాన విష‌యం.

దుర్గగుడి బోర్డు మెంబర్ పై….

ఇటీవ‌ల బెజ‌వాడ దుర్గగుడికి సంబంధించిన బోర్డు మెంబ‌ర్ ఒక‌రు తెలంగాణ మ‌ద్యం సీసాలు తీసుకువ‌స్తూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆమెను బోర్డు నుంచి త‌ప్పించాల‌ని పెద్ద ఎత్తున వివాదం రేగింది. ఆమెను ప‌క్కన పెట్టేలోపే ఎమ్మెల్యే ఎంట‌రై పోయి త‌న వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌కు అవ‌కాశం ఇవ్వాలంటూ ఏకంగా సీఎంవోలో చ‌క్రం తిప్పుతున్న ఓ స‌ల‌హాదారుకు లేఖ‌రాశారు. అయితే అదే శాఖ‌కు మంత్రి అయిన స‌ద‌రు నేత బోర్డు మెంబ‌ర్‌గా.. ఏకంగా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ నేత స‌తీమ‌ణికి అవకాశం ఇప్పించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న నేరుగా సీఎంకే ప్రతిపాద‌న పంపారు.

మంత్రి గుస్సాగా…?

కానీ, ఈ విష‌యంలో సీఎం జోక్యం చేసుకోకుండా.. స‌ల‌హాదారుకు బాధ్యత అప్పగించారు. దీంతో ఎమ్మెల్యే తిప్పిన చ‌క్రం బాగా ఉప‌యోగ‌ప‌డింద‌ని భావించిన మంత్రి.. గుస్సాగా ఉన్నారు. త‌న‌కు విలువ త‌గ్గుతోంద‌ని.. ఆయ‌న అనుచ‌రులు తెగ ప్రచారం చేస్తుండ‌డం వెనుక కూడా ఎమ్మెల్యే హ‌స్తం ఉంద‌ని భావిస్తున్నారు. దీంతో ఇటీవ‌ల కాలంలో ఆయ‌న అదుపు త‌ప్పుతున్నారు. త‌న ఇమేజ్‌ను మ‌రింత పెంచుకునేలా.. ప్రతిప‌క్ష అభ్యర్థుల‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా అయినా.. త‌న‌కు ఇమేజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. కానీ.. ఎమ్మెల్యే మాత్రం త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో దూకుడు చూపించి.. మంత్రికి అడ్డుక‌ట్ట వేశారు. ఇంత‌కీ దుర్గగుడి బోర్డు మెంబ‌ర్ అవ‌కాశం ఇద్దరిలో ఎవ‌రికీ చిక్కక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News