ఆ మంత్రి ఇలాకాలో ట్ర‌యాంగిల్ ఫైట్ త‌ప్ప‌దా…!

ఏపీలో కొన్ని జిల్లాల్లో కుల రాజ‌కీయాలు ఎక్కువ‌. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కుల రాజ‌కీయాల ప్ర‌భావం ఆచంట నియోజ‌క‌వ‌ర్గంపై కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇక్క‌డ బీసీలు, [more]

Update: 2019-02-08 11:00 GMT

ఏపీలో కొన్ని జిల్లాల్లో కుల రాజ‌కీయాలు ఎక్కువ‌. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కుల రాజ‌కీయాల ప్ర‌భావం ఆచంట నియోజ‌క‌వ‌ర్గంపై కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇక్క‌డ బీసీలు, కాపులు నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఉన్నారు. వీరితో పాటు శెట్టి బ‌లిజ సామాజకవ‌ర్గం ఓట‌ర్లు కూడా అభ్య‌ర్థుల విజ‌య‌వ‌కాశాల‌పై ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపుతారు. అందుకే ఏ పార్టీ అభ్య‌ర్థి గెల‌వాల‌నుకున్నా ముందు వీరిని మెప్పించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే వైసీపీ ప్‌యయోగాత్మ‌కంగా క్ష‌త్రియ సామాజకవ‌ర్గానికి చెందిన చెరుకుపాటి రంగ‌నాథ‌రాజుకు టికెట్ కేటాయించ‌డం విశేషం. ఇక టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న పితాని స‌త్య‌నారాయ‌ణకే టికెట్ ద‌క్‌్నుంది. ఇప్ప‌టికే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం మొద‌లు పెట్టారు. రోజూ నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల్లో పార్టీకి సంబంధించి ఏదో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ కార్య‌క‌ర్త‌లు జారిపోకుండా చూసుకుంటూనే ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

వైసీపీ నుంచి రంగనాథరాజు

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి త‌క్కువ ఓట్లే ఉన్న‌ప్ప‌టికి ఆ వ‌ర్గానికి చెందిన రంగ‌నాథరాజును బ‌రిలోకి దింపుతోంది. గ‌తంలో ఆయ‌న అత్తిలి నియోజ‌క‌వ‌ర్గం ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రంగ‌నాథ‌రాజు ఆర్థికంగా బ‌లంగా ఉండ‌టం కూడా ఆ పార్టీకి దోహ‌దం చేస్తుందని ఆ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయం వ్య‌క్త‌వుతోంది. అయితే కుల రాజ‌కీయాల ప్రాబ‌ల్యం ఉన్న ఆచంటలో ఆయ‌న ఎంపిక స‌రైందేనా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇక జ‌న‌సేన నుంచి శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లుల ల‌క్ష్మీనారాయ‌ణ‌ టికెట్ ద‌క్కించుకునేలా క‌నిపిస్తున్నారు. ఈయ‌న మాజీ ఎమ్మెల్సీగా ప‌నిచేశారు. గ‌తంలో 1999లో ర‌ద్ద‌యిన పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ల్లుల టీడీపీ నుంచి, పితాని కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు ఓడిపోగా ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కూన‌పురెడ్డి రాఘ‌వేంద్ర‌రావు విజ‌యం సాధించారు. వీరిద్ద‌రు పాత ప్ర‌త్య‌ర్థులే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక జ‌న‌సేన టిక్కెట్ విష‌యానికి వ‌స్తే గ‌త అనుభ‌వాన్ని ప‌రిగ‌ణలోకి తీసుకుని పార్టీ మ‌ల్లుల‌కే టికెట్ ఖ‌రారు చేస్తుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఓట్లు చీలితే ఎవరికి లాభం…

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పితాని విష‌యానికి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా పాతుకుపోవ‌డంతో పాటు కుల రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరు… పాత టీడీపీ వాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో ఆయ‌నపై నియోజ‌క‌వ‌ర్గంలో కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు పితాని స‌త్యానార‌య‌ణ టీడీపీలో చేరి ఆచంట టికెట్ ద‌క్కించుకున్నారు. చంద్ర‌బాబు అభిమానాన్ని చూర‌గొన్న ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే ప‌దేళ్లు మంత్రి హోదాలో ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయ‌లేకపోయార‌నే వాద‌న ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గిన స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని సొంత పార్టీలోనే కొంత‌మంది చెప్పుకొస్తున్నారు. అయినా టికెట్ మాత్రం ఆయ‌న‌కే ద‌క్కే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లు స‌మాచారం. కాపులు, శెట్టిబ‌లిజ‌ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఓట్లు చీలే అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీలో టెన్ష‌న్ పెరుగుతోంది. పితాని, జ‌న‌సేన అభ్య‌ర్థి మ‌ల్లుల ఓకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో ఓట్లు చీలితే మాత్రం టీడీపీకి ఇక్క‌డ ఇబ్బంది త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ ముఖ్యంగా జ‌న‌సేన గెలిచినా.. గెల‌వ‌కున్నా ఓట్ల‌ను చీల్చి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News