గ్రిప్ ఏమాత్రం తగ్గలేదుగా?

మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లోనే పుట్టిన పార్టీ. ప్రత్యేకంగా పాతబస్తీ కేంద్రంగా ఎదిగిన పార్టీ. అలాంటి ఎంఐఎం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుందని [more]

Update: 2020-12-04 13:30 GMT

మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లోనే పుట్టిన పార్టీ. ప్రత్యేకంగా పాతబస్తీ కేంద్రంగా ఎదిగిన పార్టీ. అలాంటి ఎంఐఎం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుందని తొలి నుంచి ఊహించిందే. అలాగే ఎన్నికల ఫలితాలను చూస్తుంటే అదే రుజువవుతుంది. తమ గ్రిప్ నగరంలో ఏమాత్రం తగ్గలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నిరూపించారు. మొత్తం 52 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం దాదాపు 45 స్థానాలకు పైగానే ఆధిక్యంలో ఉండటం విశేషం. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో గెలిచింది.

పాతబస్తీలో వన్ సైడ్…

హైదరాబాద్ పాతబస్తీ అంటే అదో ప్రత్యేక సామ్రాజ్యం. వేరే ఎవరూ, ఎంతటి పెద్ద వారైనా ఆ కోట లోకి ప్రవేశించటం అసంభవం అంటారు. మరోసారి అది రుజువయింది. పాతబస్తీలోని అన్ని సీట్లను ఎంఐఎం దాదాపుగా కైవసం చేసుకుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమకు, టీఆర్ఎస్ కు పొత్తు లేదని బహిరంగంగా చెప్పింది. అక్బరుద్దీన్ వంటి నేతలు సయితం టీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేలయితే రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చి వేస్తామని చెప్పారు.

సొంత నగరంలో….

తాము పోటీ చేసిన 52 స్థానాల్లోనూ ఎంఐఎం తరుపున అన్నదమ్ములిద్దరూ మాత్రమే ప్రచారం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ లు ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇతర రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్రల్లో ఎంఐఎం గెలుస్తున్నప్పుడు సొంత నగరంలో పట్టుకోల్పోకూడదన్న లక్ష్యంతో ఎంఐఎం పనిచేసిందనే చెప్పాలి. టీఆర్ఎస్ అభ్యర్థులపై నామమాత్రంగా అభ్యర్థులను ఎంఐఎం నిలబెట్టగా, టీఆర్ఎస్ కూడా ఎంఐఎం మీద డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్న ప్రచారం కూడా ఉంది.

విజయమే ముఖ్యం….

అవన్నీ పక్కన పెడితే విజయం మాత్రమే ముఖ్యం. తమకు పట్టున్న అన్ని ప్రాంతాల్లోనూ ఎంఐఎం విజయకేతనం ఎగుర వేసింది. తమకు మరే పార్టీ తమ ప్రాంతంలో సరిపోదని తేల్చి చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను శాసించే స్థాయిలో ఎంఐఎం ఉందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అనధికారికంగా టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతిచ్చినా అత్యధిక స్థానాల్లో నిలిచి అసద్ మరోసారి నగరంలో తన గ్రిప్ ను నిలబెట్టుకోగలిగారు.

Tags:    

Similar News