రహస్య మిత్రులుగానే ఉంటారా?

రాజకీయాల్లో రహస్యమిత్రులు అందించే సహకారం అద్బుతంగా ఉంటుంది. శత్రువులెవరో, మిత్రులెవరో తెలియనంత సందేహంలో ప్రజలను పడేస్తూ ఉంటారు ఈ తరహా పొలిటికల్ ఫ్రెండ్స్. పైకి చూస్తే బాహాబాహీ [more]

Update: 2021-02-24 15:30 GMT

రాజకీయాల్లో రహస్యమిత్రులు అందించే సహకారం అద్బుతంగా ఉంటుంది. శత్రువులెవరో, మిత్రులెవరో తెలియనంత సందేహంలో ప్రజలను పడేస్తూ ఉంటారు ఈ తరహా పొలిటికల్ ఫ్రెండ్స్. పైకి చూస్తే బాహాబాహీ తలపడుతున్నట్లు కనిపిస్తారు. కానీ మూడో శిబిరాన్ని నిర్వీర్య పరిచి పరస్పరం లాభపడటానికి నిరంతరం ఎత్తుగడలు వేస్తుంటారు. తాజాగా పరస్పర విరుద్ధమైన సైద్దాంతిక భావజాలం కలిగిన బీజేపీ, ఏఐఎంఐఎం తలపడుతున్న తీరును చూస్తుంటే దేశంలో మైనారిటీ, మెజార్టీ చీలికతో పరస్పరం రెండు పార్టీలూ లాభపడుతున్న ధోరణి కనిపిస్తోంది. దీనివల్ల జాతీయ పార్టీ అయిన బీజేపీకి అత్యధిక లాభం సమకూరుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో పాతబస్తీ ప్రాంతానికి మాత్రమే పరిమితమై గతంలో రాజకీయాలు నడిపిన ఎంఐఎం జాతీయ పార్టీగా రూపుదాల్చే పరిణామాలు ఏర్పడుతున్నాయి. తద్వారా ముస్లిం సామాజిక వర్గానికి తానే ప్రతినిధినన్న భావనతో రాజకీయ పునాదులు పటిష్ఠం చేసుకునేందుకు ఎంఐఎం కు ఆస్కారం ఏర్పడుతోంది. సమాజంలో మతపరమైన చీలిక కు స్పష్టమైన అజెండా తయారవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ ధోరణి క్రమేపీ పెరుగుతోంది.

కాంగ్రెసుకు బీటలు…

సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెసు పార్టీ మైనారిటీలు, దళితుల పట్ల సానుకూల ధోరణి రాజకీయాలను నడిపింది. దాంతో ఆయా వర్గాలు కాంగ్రెసుకు చాలా సహకరించాయి. అయితే భిన్న ప్రాంతీయ పార్టీలు, మతపరమైన, కులపరమైన అంశాల ప్రాబల్యం పెరగడంతో కాంగ్రెసు ఓటు బ్యాంకుకు బీటలు పడ్డాయి. తమను ఆలించి పాలించి ప్రేమగా చూస్తున్న కాంగ్రెసు అధికారానికి దూరమవుతున్న నేపథ్యంలో ముస్లిం, దళిత్ సామాజిక వర్గాలకు పవర్ లోకి రాగల సామర్థ్యం ఉన్న పార్టీల అండ అవసరమైంది. లేదంటే తామే సొంతంగా అస్తిత్వం చాటుకోవాల్సిన అవశ్యకత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా ఉంటున్నాయి ముస్లిం, దళిత్ సామాజిక వర్గాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరిగిందిదే. ఆయా వర్గాల బలమైన తోడ్పాటుతోనే వైసీపీ, టీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగాయి. దీనివల్ల కాంగ్రెసు ఇప్పటికే నష్టపోయింది. మైనారిటీలు,ఎస్సీ,ఎస్టీలు శాశ్వతంగా ప్రాంతీయపార్టీలవైపే మొగ్గుచూపితే జాతీయంగా ఎదుగుతున్న బీజేపీకి నష్టం వాటిల్లుతుంది. వాటిలో చీలిక వస్తేనే లాభం సమకూరుతుంది. ఇందుకు ఎంఐఎం వంటి పార్టీలు చక్కగా ఉపయోగపడుతున్నాయి.

జాతీయంగా….

అసదుద్దీన్ ఓవైసీ జాతీయ నేతగా ఎదిగారు. ఇప్పటికీ ఒకే ఎంపీ ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో జెండా ఎగరేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ముస్లిం సామాజిక వర్గాల్లో బలమైన మద్దతు లభిస్తోంది. ఈ వర్గానికి రాజకీయ ప్రాబల్యం కల్పించే దిక్సూచిగా ఆయన చాలా వేగంగా గుర్తింపు పొందుతున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి చోట్ల తన ప్రాబల్యాన్ని నిరూపించుకున్నారు. తాజాగా గుజరాత్ లో పురపాలిక ఎన్నికల్లో కూడా అరంగేట్రం చేశారు. కనీస బలం చాటుకున్నారు. పశ్చిమబెంగాల్ కూడా తన టార్గెట్ లో పెట్టుకున్నారు. ఎంఐఎం రంగప్రవేశం చేసిన ప్రతిచోటా బీజేపీకి అనుకూలంగా హిందూ ఓటు పోలరైజ్ అవుతోంది. 15 శాతం వరకూ ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక వస్తోంది. అంతకుముందు వరకూ మద్దతునిచ్చిన పార్టీలకు అనుకూలంగా కొందరు మత పెద్దలు రాజకీయం చేస్తున్నారు ఎంఐఎం యువతరాన్ని ఆకట్టుకుంటూ ఓట్ల ను లక్షల సంఖ్యలో చీలుస్తోంది. కొన్ని విజయాలను నమోదు చేసుకుంటోంది. ఫలితంగా కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీలు నష్టపోతున్నాయి . పరోక్షంగా బీజేపీ లాభపడుతోంది. ఎంఐఎం తన రాజకీయ భూమికను పెంచుకుంటోంది. ఇది దీర్ఘకాలంలో బీజేపీ అధికారం స్థిరపడటానికి దోహదం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ముస్లింలు , ఎస్సీ,ఎస్టీలు అధికార పార్టీలకు మద్దతుగా ఉన్నారు. టీఆర్ఎస్ కు ఎంఐఎం బహిరంగంగానే మిత్రపక్షంగా మెలుగుతోంది. నిజానికి తెలంగాణలో అన్నిసీట్లలో ఎంఐఎం పోటీ చేస్తే కనీసం 45 స్థానాల్లో ప్రభావం చూపగలుగుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. 12 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే అధికార టీఆర్ఎస్ తో తనకున్న అనధికార పొత్తు వల్ల పాతబస్తీకి మాత్రమే ఎంఐఎం పరిమితమవుతోంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం టీఆర్ఎస్ కు అండగా నిలుస్తోంది. కానీ రానున్న ఎణ్నికల్లో ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఎంఐఎం పోటీ అనగానే మతపరమైన అజెండా ముందుకు వస్తుంది. టీఆర్ఎస్ డీలా పడిపోతుంది. అటు హిందూ, ఇటు ముస్లిం అజెండాల్లో దేనినీ క్లయిం చేయలేదు. ఫలితంగా పోటీ ఎంఐఎం , బీజేపీ మధ్య సాగుతోందనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది. ఇది టీఆర్ఎస్ కొంప ముంచేస్తుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంఐఎం రంగంలోకి దిగితే వైసీపీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. బీజేపీ కూటమి బలపడేందుకు అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలు, ఎంఐఎం తో సత్సంబంధాలు నడుపుతున్నారు. ఇటీవల జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ పరస్పర సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. బీజేపీ , ఎంఐఎం లు ప్రత్యర్తులుగా బరిలో ఉన్నారనే ఆలోచన ఓటర్లకు వస్తే ఇతర పార్టీలకు ఆదరణ తగ్గిపోతుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కోలుకోకపోతే బీజేపీ కి శాశ్వత అధికారం కట్టబెట్టేందుకు ఎంఐఎం ఒక పావుగా ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో శత్రువు చేసే మేలే అధికంగా ఉంటుంది.-Uఎ

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News