ఏపీపై ఎంఐఎం టార్గెట్‌… ఈ నియోజ‌క‌వ‌ర్గాలే గురి

హైద‌రాబాద్ కేంద్రంగా ఏర్పడిన మ‌జ్లిస్ పార్టీ ఎంఐఎం..దూకుడు మామూలుగా లేద‌నే వార్తలు వ‌స్తున్నాయి. సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆయ‌న [more]

Update: 2020-11-25 02:00 GMT

హైద‌రాబాద్ కేంద్రంగా ఏర్పడిన మ‌జ్లిస్ పార్టీ ఎంఐఎం..దూకుడు మామూలుగా లేద‌నే వార్తలు వ‌స్తున్నాయి. సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆయ‌న వార‌సుల ఆధ్వర్యంలో క్రమ‌క్రమంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తూ వ‌స్తోంది. తాజాగా బిహార్ ఎన్నిక‌ల్లో సీమాంచ‌ల్ ప్రాంతంలో ఐదు కీల‌క స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న ఎంఐఎం.. ముస్లిం మైనార్టీ వ‌ర్గాల్లో ఆశ‌లు రేకెత్తించింది. దేశ‌వ్యాప్తంగా మోడీ హ‌వా క‌నిపించినా.. బిహార్‌లోనూ బీజేపీ దూకుడు ఉన్నా.. ఎంఐఎం అసాధార‌ణ స్థాయిలో అక్కడ పాగా వేసింది. వాస్తవానికి 2015లో అక్కడ పోటీ చేసి ఘోర ఓట‌మి పాలైంది. ఆరు చోట్ల పోటీ చేసి ఆరుచోట్లా ప‌రాజ‌యం పాలైన పార్టీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు ఐదు చోట్ల విజ‌యం ద‌క్కించుకుని మంచి జోష్ మీదుంది.

ఏపీలోనూ…..

దేశ‌వ్యాప్తంగా త‌మ స‌త్తాచాటుతామ‌ని ఎంఐఎం అధినేత ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే బెంగాల్‌, యూపీ ఎన్నిక‌ల్లోనూ వీరు పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. మ‌రో సంచ‌ల‌నం ఏంటంటే పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ ఎంఐఎం దృష్టి సారించేందుకు ప్రయ‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఏపీలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లిం మైనార్టీ వ‌ర్గాల ఓట్లు ఉన్నప్పటికీ.. వారిని ప్రభావితం చేయ‌గ‌లిగే ముస్లిం మైనార్టీ పార్టీ అంటూ ఏమీ లేదు. నిన్న మొన్నటి వ‌ర‌కు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఈ వ‌ర్గం ఇప్పుడు వైసీపీ వైపు మ‌ళ్లింది.

జగన్ కు దగ్గరగా…..

అయితే, రాబోయేరోజుల్లో అంటే.. 2024 ఎన్నిక‌ల నాటికి ఎంఐఎం.. ఏపీలోనూ పాగా వేస్తే.. ఈ వ‌ర్గాలు ఆ పార్టీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. నిజానికి ఏపీ విష‌యంలో ఎంఐఎంకి సానుకూల దృక్ఫథం ఉంది. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఒవైసీకి మిత్రుడు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో దూరంగా ఉన్నారు. చంద్రబాబుపై క‌మింగ్ టు ఏపీ, అంటూ.. వైసీపీ త‌ర‌ఫున ప్రచారం చేస్తాన‌ని ప్రక‌టించారు. అయితే, ఎందుకో ఆయ‌న అప్పట్లో దూరంగా ఉన్నారు. కానీ, ఇక్కడ ఎంఐఎంకు నాయ‌క‌త్వం ఉంది.

ఇక్కడే పోటీ చేసి……

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌తో స్నేహం ఉందనో లేదా మ‌రో కార‌ణంతోనే ఏపీలో ప‌ట్టు, కేడ‌ర్ ఉన్న ప్రాంతాల్లో కూడా పోటీ చేయ‌క‌పోతే న‌ష్టపోతామ‌ని ఆ పార్టీ అధి నాయ‌క‌త్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో మైనార్టీలు ఎక్కువుగా ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేయాల‌న్న ఒత్తిళ్లు ఆ పార్టీపై ఉన్నాయి. ఈక్రమంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్న క‌ర్నూలు, గుంటూరు వెస్ట్‌‌, విజ‌య‌వాడ వెస్ట్‌. రాయ‌ల‌సీమలో క‌ర్నూలు, హిందూపురం, క‌డ‌ప‌, రాయ‌చోటి, మ‌న‌ద‌ప‌ల్లి, అనంత‌పురం త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక్కడి నేత‌లు ఎప్పటి నుంచో తాము పోటీ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంఐఎం ఏపీలోనూ దూకుడు పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Tags:    

Similar News