మిధున్ రెడ్డి మొనగాడా?

వైసీపీ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి వైఎస్ జగన్ కు అన్ని రకాలుగా అండగా ఉన్న కుటుంబం. అందుకే ఆ [more]

Update: 2021-06-24 15:30 GMT

వైసీపీ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి వైఎస్ జగన్ కు అన్ని రకాలుగా అండగా ఉన్న కుటుంబం. అందుకే ఆ కుటుంబం నుంచి ప్రత్యేకంగా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండగా, కుమారుడు మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మిధున్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇక్కడ ఒక్కచోటే…

రాష్ట్రంలో అందరూ పార్లమెంటు సభ్యులు దాదాపు డమ్మీలనే చెప్పాలి. ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీలను పట్టించుకోరు. కానీ రాజంపేట పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా డిఫరెంట్. మిథున్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఎమ్మెల్యేలు కూడా ఎంపీకి తలవంచక తప్పడం లేదు. ఇక్కడ అధికారుల బదిలీలు, కాంట్రాక్టు పనులన్నీ మిధున్ రెడ్డి చెప్పినట్లు జరగాల్సిందే. తనకు ఆప్తులైన నేతలకే పదవులను కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పదవులన్నీ మిధున్ రెడ్డి చెప్పిన వారికే దక్కాయి. ఇది రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, తంబళ్ల పల్లి, రాయచోటి, మదనపల్లి నియోజకవర్గాలున్నాయి. అన్ని చోట్లా మిధున్ రెడ్డి చెప్పినట్లే నడుస్తుండటం విశేషం.

ఎమ్మెల్యే అసంతృప్తితో…

రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి వ్యతిరేకంగా మిధున్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయనకు అండగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తోడయ్యారు. దీంతో మిధున్ రెడ్డి వైఖరి పట్ల మేడా మల్లికార్జున్ రెడ్డి చికాకు పడుతున్నారని తెలిసింది. అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద మిధున్ రెడ్డి వ్యవహారం ఇప్పడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరి అధినాయకత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరమే.

Tags:    

Similar News