అసోం బరిలో తెలుగోడు…!!!

ఎంజీవీకే భాను….. ఎవరికీ తెలియని పేరిది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అసోం ఐఏఎస్ అధికారుల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితం. 1985 బ్యాచ్ లోని [more]

Update: 2019-03-14 17:30 GMT

ఎంజీవీకే భాను….. ఎవరికీ తెలియని పేరిది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అసోం ఐఏఎస్ అధికారుల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితం. 1985 బ్యాచ్ లోని అసోం-మేఘాలయ క్యాడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు అసోంలో వివిధ హోదాల్లో పనిచేసి గత ఏడాది జులై 31న పదవీ విరమణ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నవాబుపాలేనికి చెందిన భాను కేంద్ర మాజీ మంత్రి , మాజీ ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్యనాయుడు అల్లుడు. పదవీ విరమణ చేసిన అనంతరం భాను రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. గతనెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగాపోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అసోంలోని ‘‘తేజ్ పూర్’’ నుంచి లోక్ సభ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అసోంలో పనిచేసిన సమయంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ కు ఆయన అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు. 2004-2009 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ కు కూడా సన్నిహితుడిగా పేరుగాంచారు. అదువల్లే కావచ్చు జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సీబీఐ భానును సయితం విచారించింది. 90వ దశకం ప్రారంభంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన భానుకు సమర్థుడన్న పేరుంది. అదే సమయంలో అవినీతి ఆరోపణలను సయితం ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రులకు సన్నిహితంగా ఉంటూ చక్రం తిప్పే వారన్న ప్రచారం ఉంది.

తెలుగు ఓటర్లు ఎక్కువగా…..

ఐఏఎస్ అధికారిగా భాను పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. అదనపు కార్యదర్శి హోదాలో అసోం కార్మిక, సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,హోంశాఖల్లో సేవలందించారు. అప్పటి అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు. కీలకమైన ‘‘తేయాకు’’ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సంచాలకుడిగా పనిచేశారు. తేజ్ పూర్ డిప్యూటీ కమిషనర్ గా సయితం పని చేశారు. తేజ్ పూర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రస్తుతం అక్కడే తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తేజ్ పూర్ నుంచి లోక్ సభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. భానుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన మామ పీవీ రంగయ్యనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఆయన 1991-96 మధ్యకాలంలో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో విద్యుత్తు, జలవనరుల శాఖమంత్రిగా పనిచేశారు. ఖమ్మం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భాను ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేశారు. ఢిల్లీలో అసోం రెసిడెంట్ కమిషనర్ గా పనిచేశారు.

అంచనా కరెక్టేనా…?

తేజ్ పూర్ లోక్ సభ స్థానం సొంటిపూర్ జిల్లాలో ఉంది. గౌహతికి ఈశాన్యాన 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన రామ్ ప్రసాద్ శర్మ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో అసోం గణపరిషత్ కు చెందిన జోసఫ్ టోప్సో గెలిచారు. వాస్తవానికి ఇది కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం. చాలా సార్లు ఆ పార్టీ అభ్యర్థే ఇక్కడి నుంచి గెలిచారు. భాను కాంగ్రెస్ లో చేరడానికి ముందు బీజేపీలో, అసోం గణపరిషత్ లో చేరడానికి ప్రయత్నించారన్న వార్తలు వచ్చాయి. అక్కడ అవకాశాలు లేకపోవడంతో చివరకు కాంగ్రెస్ లో చేరారు. భాను తేజ్ పూర్ పై దృష్టి పెట్టడానికి కారణాలు లేకపోలేదు. ఇక్కడ తెలుగు మూలాలకు చెందిన తేయాకు కార్మకులు పెద్దసంఖ్యలో ఉన్నారు. యాభై నుంచి డెబ్భయి వేల మంది వరకూ ఉండవచ్చని అంచనా. తేజ్ పూర్ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. అధికారిగా ఉన్నప్పుడు నగర అభివృద్ధికి, నగరాన్ని సుందరీకరణ చేసేందుకు యత్నించారు. రాష్ట్రానికి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగాపనిచేసిన తరుణ్ గొగొయ్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. గగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ ఎంపీగా రాహుల్ శిష్య బృందంలో కీలక పాత్రధారిగా ఉన్నారు. బలమైన రాజకీయ మద్దతు, స్థానికుల అభిమానం, తెలుగువారైన తేయాకు కార్మికుల మద్దతుతో గెలవచ్చన్నది భాను అంచనా. దీనికి తోడు కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీపై వ్యతిరేకత, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, పెట్రోలు ధరల పెంపు వంటి అంశాలు తనకు కలసి వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా, సీఎల్పీ నాయకుడు మద్దతు ఉంది. 2011 లెక్కల ప్రకారం లక్షకు పైగా జనాభా గల తేజ్ పూర్ నియోజకవర్గం బ్రహ్మాపుత్ర నదీ తీరంలో ఉంది. ఈ నది కారణంగా వ్యవసాయం ఇక్కడ బాగా విస్తరించింది. ఐఏఎస్ అధికారిగా భాను వివాదాస్పదుడన్న పేరుంది. సీఎంల సన్నిహితుడన్న పేరుతో చక్రం తిప్పారన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రాన్ని నిన్నమొన్నటి వరకూ అట్టుడికించిన 1956 నాటి పౌరసత్వ (సవరణ) బిల్లును భాను తీవ్రంగా వ్యతిరేకంచేవారు. ఈ విషయంలో అధికార బీజేపీని తప్పుపట్టారు. చట్ట సభలో ప్రవేశించాలన్న ఈ మాజీ ఐఏఎస్ అధికారి కోరిక ఎంతవరకూ నెరవేరుతుందో వేచిచూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News