పాలఘాట్ శ్రీధరన్ గెలుపంటే……?

సాధారణ పరిస్థితుల్లో అయితే పాలక్కాడ్ నియోజకవర్గం గురించి పెద్దగా చెప్పుకోవలసింది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. దక్షిణాది రాష్ర్టమైన కేరళలోని 140 అసెంబ్లీ స్థానాల్లో అదొకటి. అంతకు [more]

Update: 2021-04-15 16:30 GMT

సాధారణ పరిస్థితుల్లో అయితే పాలక్కాడ్ నియోజకవర్గం గురించి పెద్దగా చెప్పుకోవలసింది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. దక్షిణాది రాష్ర్టమైన కేరళలోని 140 అసెంబ్లీ స్థానాల్లో అదొకటి. అంతకు మించి ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే మెట్రో శ్రీధరన్ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారో ఈ నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. అందరి చూపు అటు వైపు మళ్లింది. 88 సంవత్సరాల శ్రీధరన్ ఎన్నికల్లో పోటీ చేయడమే విశేషమైతే కనీస పునాదులు లేని పార్టీ అయిన బీజేపీ ఆయనను తమ ముఖ్యమంత్రిగా ప్రకటించడం మరో విశేషం. దీంతో ఇక్కడి గెలుపోటములు, పార్టీల బలా బలాలపై చర్చ సాగుతోంది.

త్రిముఖ పోటీ ఉన్నా…..

ఒకప్సుడు పాల్ ఘాట్ గాపిలిచే ప్రస్తుత పాలక్కాడ్ లో త్రిముఖ పోటీ జరుగుతోంది. శ్రీధరన్ ను యూడీఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) తరఫున సిట్టింగ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు షఫీ పారాంబిల్, ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) తరఫున సీపీఎం అభ్యర్థి సీపీ ప్రమోద్ ఢీకొంటున్నారు. దేశంలో మెట్రో రైళ్లకు రూపకర్త అయిన శ్రీధరన్ ను పెద్దాయనగా తాము గౌరవిస్తామని, అంతమాత్రాన ఆయనను తేలిగ్గా తీసుకోబోమని, ఓడించి తీరుతామని కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు చెబుతున్నారు. శ్రీధరన్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తన వయసులో సగం కూడా లేని, తన కుమారుల వయసు గల ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోబోమని, ఓడించి తీరుతానని, తన సత్తా ఏమిటో చాటుతానని పేర్కొంటున్నారు. ఇటీవల పాలక్కాడ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కార్యక్రమంలో ఒకే వేదికపైన ఆశీనులైన ఈ ముగ్గురు నేతలు పైకి చిరునవ్వులు చిందించినప్పటికీ తెరవెనక గెలుపు వ్యూహాల రచనలో తీరిక లేకుండా ఉన్నారు.

అన్ని పార్టీలకూ ఆశలు….

పాలక్కాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పారాంబిల్ 2011, 2016ల్లో గెలిచారు. సిటింగ్ ఎమ్మెల్యేగా చురుగ్గా వ్యవహరిస్తారన్న పేరు గల షఫీ ప్రచారంలో దూసుకుపోయారు. ఇంధన, గ్యాస్ ధరల పెంపుతో మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ పార్టీకి ప్రజలు తగినవిధంగా బుద్ధి చెబుతారని షఫీ అంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సీపీఎం ఇప్పుడూ అదే పనితీరును కనబరుస్తుందన్న ధీమాను సీపీఎం అభ్యర్థి ప్రమోద్ కనబరుస్తున్నారు. మెట్రో శ్రీధరన్ కూడా తనవైన లెక్కలు చెబుతున్నారు. విజయం తనదేన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆషామాషీగా బరిలోకి దిగలేదు. అన్నీ అంచనాలు వేసుకునే తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేరళలో నెమోమ్ తరవాత కమలం పార్టీకి మంచి పునాది గల నియోజకవర్గం పాలక్కాడ్.

పునాదులుండటంతో…..

2016 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శోభ సురేంద్రన్ 40,076 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ 17,483 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు. ఇటీవల జరిగిన పాలక్కాడ్ మున్సిపల్ ఎన్నికల్లోకాషాయ పార్టీ ఇక్కడ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 52 వార్డులకు ఆ పార్టీ 29, యూడీఎఫ్ 10, సీపీఎం 6 వార్డులను కైవశం చేసుకున్నాయి. అంతే కాక పథనం తిట్ట జిల్లాలోని పండలం పురపాలక సంఘాన్నీ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 52 వార్డులకు గాను 28 స్థానాలను కమలం తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. ఈ జిల్లాలోనే శబరిమల ఉంది. ఈ నేపథ్యంలో శ్రీధరన్ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. ఎనిమిది పదుల వయసులోనూ ఉత్సాహంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,84, 310 మంది ఉండగా వారిలో 89,851 మంది పురుషులు, 94,457 మంది మహిళలు. కేరళలో ఎవరు గెలుస్తారన్న విషయం కన్నా పాలక్కాడ్ ను ఎవరు కైవశం చేసుకుంటారన్న దానిపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News