కేంద్రం ఇచ్చిన నివేదిక‌: సుచ‌రితపై పెరుగుతున్న సెగ‌

రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు ఎస్సీల నుంచి మ‌రింత సెగ త‌గ‌ల‌నుందా? మ‌హిళా హోం మంత్రిగా ఉండి కూడా త‌మకు ర‌క్షణ క‌రువైంద‌ని ఇప్పటికే [more]

Update: 2020-10-11 03:30 GMT

రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు ఎస్సీల నుంచి మ‌రింత సెగ త‌గ‌ల‌నుందా? మ‌హిళా హోం మంత్రిగా ఉండి కూడా త‌మకు ర‌క్షణ క‌రువైంద‌ని ఇప్పటికే మ‌హిళ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఎస్సీల‌పైనా దాడులు జ‌రుగుతున్నాయ‌ని ప్రతిప‌క్షాలు తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఓ నివేదిక అందింది. కేంద్ర నేర‌గ‌ణాంకాల విభాగం ఈ నివేదిక‌ను రాష్ట్రానికి పంపించింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏటా .. రాష్ట్రాల్లోను, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నేరాలు, ఘోరాల‌పై ఓ నివేదిక‌ను రూపొందిస్తారు.

ఇతర రాష్ట్రాల కన్నా….

తాజాగా 2019 సంవ‌త్సరానికి సంబంధించిన నివేదిక రాష్ట్రానికి చేరింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో కేసులు దేశంలోని బిహార్‌, ఉత్తర‌ప్రదేశ్ వంటి అత్యంత వెనుక‌బ‌డిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ‌గా ఉన్నారు. మొత్తం కేసుల శాతం 4.4గా ఉంది. ఇది ద‌క్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని సూచించింది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న దాడులు ఇంకా కొన‌సాగుతున్నాయి. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీల‌పైనా అత్యాచారాలు, ఇత‌ర నేరాలు, నిర్బంధాలు పెరుగుతున్నాయి. ఈ విష‌యంలో మంత్రి మేక‌తోటి సుచ‌రిత కు ఇబ్బంది క‌ర ప‌రిస్థితి ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పోలీసులపై కేసులు……

ఇదిలావుంటే, పోలీసులపై కేసులు భారీగానే న‌మోదైన రాష్ట్రంగా దేశంలో ఏపీ ముందుంది. నిజానికి అతిపెద్ద రాష్ట్రం యూపీలో పోలీసుల సంఖ్య ఎక్కువ‌. అయితే, ఇక్కడ పోలీసుల‌పై కేసులు త‌క్కువ సంఖ్యలో న‌మోద‌య్యాయి. కానీ, ఏపీలో మాత్రం 1681 కేసులు కేవ‌లం పోలీసుల‌పైనే న‌మోదు కావ‌డంతో పోలీసు వ్యవ‌స్థను స‌రైన గాడిలో పెట్ట‌లేక పోయార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాలు కూడా మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కి ఇబ్బందిక‌రంగా మారాయ‌ని అంటున్నారు.

బాధ్యత వహించాల్సిందేనా?

నిజానికి 2019లో మే నాటికి ప్రభుత్వం ఏర్పడినా..కేసులు మాత్రం జ‌న‌వ‌రి నుంచి లెక్కగ‌ట్టారు. అయితే, దీనిలో నాలుగు మాసాల‌ను ఉప‌సంహ‌రిస్తే.. మిగిలిన నెల‌ల‌కు మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ బాధ్యత వ‌హించ‌క త‌ప్పద‌ని అంటున్నారు. హోం మంత్రిగా ఆమె వైఫ‌ల్యం చెందార‌న్న విమ‌ర్శలే ఇంటా బ‌య‌టా వినిపిస్తున్నాయి. అయితే దీనికి మ‌రో కార‌ణం ఆమెకు స్వేచ్ఛ లేక‌పోవ‌డం అన్న టాక్ కూడా వ‌స్తోంది. మ‌రి మంత్రిగా మేక‌తోటి సుచ‌రిత‌ దీనిని ఎదుర్కొని ఎలా ? ముందుకు వెళ‌తారో ? చూడాలి.

Tags:    

Similar News