పాపం… హోం మంత్రి

ఆమె ఏపీలో తొలి మహిళా హోం మంత్రి. వైఎస్సార్ స్పూర్తిగా జగన్ తన ఫస్ట్ క్యాబినెట్ లో పోలీస్ మంత్రిగా మహిళ ఉండాలని కోరుకున్నారు. అలాగే తాను [more]

Update: 2021-08-18 02:00 GMT

ఆమె ఏపీలో తొలి మహిళా హోం మంత్రి. వైఎస్సార్ స్పూర్తిగా జగన్ తన ఫస్ట్ క్యాబినెట్ లో పోలీస్ మంత్రిగా మహిళ ఉండాలని కోరుకున్నారు. అలాగే తాను చెల్లెమ్మగా భావించి అభిమానించే గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరితను ఆ ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టారు. దాదాపుగా రెండున్నరేళ్ళకు పాలన దగ్గరపడుతోంది. ఏపీ పాలనలో హోం మంత్రి ముద్ర ఏమైనా ఉందా అంటే లేదు అన్నదే సమాధానం. సరే అనుకున్నా వైసీపీ పాలనలో ఎన్నో కేసులు పెరిగాయి. ముఖ్యంగా దళితులు మహిళల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. ఇది ఒక విధంగా మేకతోటి సుచరితకు ఇబ్బందికరమైన అంశమే.

ఆమె షాడోనా…?

ఇక ఇక్కడ విమర్శగా అనుకున్నా కూడా ఒక విషయం అయితే ప్రచారంలో ఉంది. మేకతోటి సుచరిత పేరుకు మాత్రమే హోం మంత్రి. అసలు కధ అంతా ముఖ్యమంత్రిని అతి సన్నిహితుడైన ఒక సలహాదారు నడిపిస్తున్నారు అన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆమె ఉత్సవ విగ్రహంలా ముందుంటే చక్రం తిప్పేది మాత్రం ఆయనే అంటున్నారు. మరి ఇది జగన్ కి తెలిసి జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మేకతోటి సుచరిత హోం మంత్రిగా అత్యంత కీలకమైన శాఖను నిర్వహిస్తూ కూడా ఎక్కడా తన సత్తాను చాటుకున్న దాఖలాలు లేవనే అంటారు. తాజాగా చంద్రబాబు కూడా ఆమెను పక్కన పెట్టి వైసీపీ పెద్దలే ఆ శాఖను నడిపిస్తున్నారు అని అన్నారు.

రెండువైపులా బాధ…

మేకతోటి సుచరిత మహిళ. పైగా దళిత సామాజికవర్గానికి చెందిన వారు. మరో వైపు చూస్తే ఏపీలో దళితుల మీద అనూహ్యంగా దాడులు జరుగుతున్నాయి. విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ ఉదంతం అయినా, అదే చోట సినీ నటుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడి శిరోముండనం కేసు అయినా హోం మంత్రి మీదకే నేరుగా బాణాలు వెళ్తున్నాయి. ఇక తాడేపల్లిలో కొన్నాళ్ళ కిందట ఒక యువతి మీద అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే అదే జిల్లాలో బీటెక్ విద్యార్ధిని రమ్య దారుణ హత్య. అది కూడా స్వాతంత్ర దినోత్సవ వేళ పట్టపగలు జరిగిన ఘాతుకం ఇది. ఆమె దళిత యువతి కావడంతో మేకతోటి సుచరితను విపక్షాలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి.

చేతులెత్తేశారా…?

ఇక ఏపీలో వీటితో పాటు అనేక ఘటనలు ఈ మధ్యన చోటు చేసుకున్నాయి. ఘటన జరిగినపుడు బాధితులను కలసి పరామర్శించడం. న్యాయం చేస్తామని చెప్పిరావడం సుచరిత వంతు అవుతోంది. తాజాగా రమ్య హత్య తరువాత ఆమె ఎందుకో ఒకింత ఆవేదనకు గురి అయ్యారు. ఎన్ని చట్టాలు తెచ్చినా జనంలో మార్పు రాకపోతే ఏం చేస్తామంటూ చేతులెత్తేసేలా మేకతోటి సుచరిత మాట్లాడడమే విడ్డూరం. నిజానికి దిశ చట్టం ఇంకా ఆమోదం పొందాలి. అయితే దానికంటే ముందు ఉన్న చట్టాలు కూడా కొరగాకుండా పోతున్నాయా లేక జనాలకు వాటి పట్ల భయం పోయిందా అన్నది ఒక చర్చ అయితే హోం మంత్రి మేకతోటి సుచరిత నిస్సహాయంగా మాట్లాడం వెనక అసలు ఆవేదన‌ వేరే ఉందా అన్నది మరో చర్చ. ఆమె శాఖాపరంగా స్వేచ్చగా లేరన్నది కూడా బాధ అయి ఉండవచ్చు అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి ఏపీలో సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా వ్యవహరించా పెద్దగా రాణించలేదు. ఏపీలో కూడా సుచరిత అలాగే విఫల ముద్ర వేసుకుంటున్నారా అన్నదే ఆమె అనుచరుల ఆవేదన.

Tags:    

Similar News