ఆయన టార్గెట్ ఆమేనట

ఆమె మామూలు శాఖ చూడడంలేదు. పౌరులకు రక్షణను ఇచ్చే రక్షకభటుల‌కే ఆమె రక్షణగా ఉండే అతి పెద్ద బాధ్యత మోస్తున్నారు. ఏకంగా పోలీస్ మంత్రిగా ఉంటున్నారు. పైగా [more]

Update: 2019-10-16 03:30 GMT

ఆమె మామూలు శాఖ చూడడంలేదు. పౌరులకు రక్షణను ఇచ్చే రక్షకభటుల‌కే ఆమె రక్షణగా ఉండే అతి పెద్ద బాధ్యత మోస్తున్నారు. ఏకంగా పోలీస్ మంత్రిగా ఉంటున్నారు. పైగా ఉప ముఖ్యమంత్రి కూడా. అటువంటి పవర్ ఫుల్ మినిస్టర్ చాన్నాళ్ళుగా అయిపూ అజా లేరు. సాధారణంగా రాష్ట్రాలలో హోం శాఖ ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉంటుంది. శాంతి భద్రతలను చూసే అతి ముఖ్యమైన శాఖ. తెల్లారిలేస్తే ఎన్నో పేచీలు పూచీలు పడాల్సిన శాఖ. ఇంతటి కీలకమైన శాఖను మహిళకు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ తన చిత్తశుధ్ధి చాటుకున్నారు. మహిళలు అన్నీ చేయగలరు అన్న తన నమ్మకాన్ని అక్కడ పెట్టారు. మరి అధినేత జగన్ విశ్వాసాన్ని నిలబెట్టి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత హోం మంత్రిగా ఉన్న మేక‌తోటి సుచరిత మీద ఉంది. కానీ నాలుగు నెలలు దాటి అయిదవ నెలలో ప్రవేశించినా కూడా మంత్రిగా ఆమె తన పనితీరు మెరుగుపరచుకోలేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

టార్గెట్ చేస్తున్న బాబు….

చంద్రబాబు గత కొన్నాళ్ళుగా కేవలం పోలీస్ శాఖనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి దాసోహం అంటున్నారు. వారు పార్టీ నేతల్లా మారారని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు మితిమీరుతున్నారని, విపక్షాల హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు దాదాపుగా ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నారు. ఇక విశాఖలో జరిగిన మీటింగులో అయితే ఏకంగా పోలీసులను వైసీపీ పార్టీలో చేరిపొమ్మన్నారు. ఇది నిజంగా డామేజింగ్ స్టేట్మెంట్. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దాయన నోటి వెంట ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే పోలీస్ శాఖకు ఎంతటి ఇబ్బంది. జనంలో కొందరైనా నమ్మితే ఇక పోలీసింగ్ సజావుగా జరుగుతుందా. శాంతిభద్రతలు ప్రశార్ధకమైపోవా. ఇలా గురి పెట్టి మరీ చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూసి తట్టుకోలేపోతున్నారు పోలీసులు. సీనియర్ నేత ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారని మధన పడుతున్నారు.

కౌంటర్ అటాక్….

తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు బయటకు వచ్చి కౌంటర్ అటాక్ చేశారు. ఇది నిజంగా అసాధారణమైనా కూడా ఏపీలో ఇపుడు జరుగుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాజకీయ విమర్శలు కాకపోయినా ధీటుగా జవాబు చెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు రెడీ అయ్యారంటే ఆ శాఖను చూసే మంత్రి మేకతోటి సుచరిత ఏంచేస్తున్నట్లో మరి అనిపించకమానదు. శాంతిభద్రతల విభాగం డీజీ రవిశంకర్ మీడియా ముందుకు వచ్చి ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి సజావుగా ఉందని చెప్పుకున్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని కూడా వివరించారు. వర్గ విభేదాలు , సాధారణ తగవులను కూడా రాజకీ గొడవలుగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. మరో పోలీస్ అధికారి అయితే మాకు రాజకీయ రంగు పులమకండి అంటూ బాబుకు వేడుకున్నారు. ఇక పోలీస్ అధికారుల సంఘం నాయకులు బాబు మీద మండిపడ్డారు. బాబు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న అనుభవంతో ఇలాగేనా మాట్లాడుతారని తగులుకున్నారు.

పలకకపోతే ఎలా…?

సరే ఖాకీలు తమ శరీరాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారు. కానీ అసలు ఈ బాధ్యత రాజకీయ నాయకత్వానిది కదా. ప్రత్యేకంగా పోలీస్ మంత్రిది కదా. చాలా కాలంగా బాబు ఇలా విమర్శలు చేస్తూంటే హోం మంత్రి ముందుకు వచ్చి ధీటుగా జవాబు ఇచ్చి టీడీపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న మాట వినిపిస్తోంది. మరి జగన్ సర్కార్లో హోం మంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నా ఉలకరు పలకరు అన్నట్లుగా ఉంది కాబట్టి పోలీసులే రాజకీయ విమర్శలకు జవాబు చెప్పాల్సివస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News