mekapati : మేకపాటి మళ్లీ కంటిన్యూ… కారణమిదేనట

మేకపాటి గౌతం రెడ్డి వివాదాలకు దూరంగా ఉండే నేత. యువకుడు అయినా ఆయన రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లోనూ ఆయనను వ్యతిరేకించే వారు [more]

Update: 2021-09-28 14:30 GMT

మేకపాటి గౌతం రెడ్డి వివాదాలకు దూరంగా ఉండే నేత. యువకుడు అయినా ఆయన రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లోనూ ఆయనను వ్యతిరేకించే వారు తక్కువనే చెప్పాలి. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. జగన్ చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తారాయన. కీలకమైన పరిశ్రమల శాఖను చూసే మేకపాటి గౌతం రెడ్డిని వచ్చే కేబినెట్ లో కూడా కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి.

తొలి నుంచి అండగా…

మేకపాటి కుటుంబం తొలి నుంచి జగన్ కు అండగా ఉంటూ వస్తుంది. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీలో కీలకంగా మారారు. ఆయనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. మేకపాటి కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇచ్చిన జగన్ తొలి కేబినెట్ లోనే మేకపాటి గౌతం రెడ్డికి స్థానం కల్పించారు. పరిశ్రమల శాఖను ఆయనకు అప్పగించారు. ఆయన చేపట్టిన రెండేళ్లలో పెద్దగా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు.

పరిశ్రమల స్థాపనకు…

ఇప్పుడిప్పుడే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. మేకపాటి గౌతంరెడ్డి కూడా పారిశ్రామిక వేత్త కావడంతో రానున్న కాలంలో ఆయన పరిశ్రమలను రాష్ట్రానికి తెప్పిస్తారని జగన్ అంచనా వేస్తున్నారు. మధ్యలో తప్పించి వేరే వారికి అప్పగిస్తే పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో జరగదని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ కంటిన్యూ చేసే మంత్రుల్లో మేకపాటి గౌతంరెడ్డి ఒకరన్న చర్చ పార్టీలో నడుస్తుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వకపోవడం కూడా ఆయనను కొనసాగిస్తారన్న సంకేతాలున్నాయి.

జిల్లా రాజకీయాలు కూడా….

ఇక మేకపాటి గౌతంరెడ్డిని తప్పిస్తే జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతలను కూడా సంతృప్తి పర్చడం సాధ్యం కాదు. ఇప్పటికే అనేక మంది రెడ్డి సామాజికవర్గం నేతలు నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతం రెడ్డి జగన్ కేబినెట్ లో కొనసాగే అవకాశాలే ఎక్కువ కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News