వైసీపీ తొలి ఎమ్మెల్సీ.. రాజ‌కీయం ముగిసిందా..?

అవును! ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఈ మాటే వినిపిస్తోంది. వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ స్థాపించిన వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్సీగా ఎన్నికై రికార్డు సృష్టించిన [more]

Update: 2019-09-30 12:30 GMT

అవును! ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఈ మాటే వినిపిస్తోంది. వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ స్థాపించిన వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్సీగా ఎన్నికై రికార్డు సృష్టించిన మేకా శేషుబాబు.. త‌న స్వ‌యంకృత రాజ‌కీయం కార‌ణంగా త‌న కెరీర్‌ను తానే కూల‌దోసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఆయ‌న జ‌గ‌న్ మాట విని ఉంటే.. ఇప్పుడు ఓ రేంజ్‌లో కీల‌క నేతల జాబితాలో ఆయ‌న పేరు క‌నిపించేది. అయితే, త‌న‌కు తాను చేసుకున్న సొంత రాజ‌కీయం, మ‌రోప‌క్క‌, కుట్ర రాజ‌కీయం, పార్టీలో దురుసుగా వ్య‌వ‌హరించ‌డం వంటి కార‌ణాలే ఆయ‌న ఎదుగుద‌ల‌కు అడ్డుక‌ట్ట‌లుగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ చైర్మ‌న్ అయిన మేకా శేషుబాబు.. కాంగ్రెస్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు.

వైఎస్ కు అనుచరుడిగా….

దివంగ‌త వైఎస్‌కు అత్యంత కీల‌క అనుచ‌రుడుగా మేకా శేషుబాబు ఎదిగారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ స్వ‌యంగా ఈయ‌న‌కు 2004లో పాల‌కొల్లు టికెట్ ఇవ్వాల‌నుకున్నారు.. అయితే, అప్ప‌ట్లో సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ ఒత్తిడి చేయ‌డంతో ఈ టికెట్‌ను వైఎస్ గుణ్ణం నాగ‌బాబుకు ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌తో .. విసిగిపోయిన మేకా శేషుబాబు ఆ ఎన్నిక‌ల్లో రెబ‌ల్‌గా రంగంలొకి దిగారు. మేకా శేషుబాబు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 13 వేల ఓట్లు చీల్చారు. దీంతో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన నాగ‌బాబు.. 11 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా బాబ్జీ విజ‌యంసాధించారు. ఇక‌, 2009 విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు అవ‌కాశం వ‌చ్చినా.. ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి పోటీలో ఉండ‌డంతో మేకా శేషుబాబు వెన‌క్కి త‌గ్గారు. దీంతో బండారు ఉషారాణి రంగంలోకిదిగారు. ఈమె గెలుపు కోసం మేకా శేషుబాబు కృషి చేశారు. ఆమె చిరంజీవిని ఓడించి విజ‌యం సాధించారు.

వైసీపీలో చేరి….

దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేకా శేషుబాబు చేసిన కృషిని గుర్తించి 2009లో జెడ్పీ చైర్మ్‌న్‌గా (అప్ప‌టి వ‌ర‌కు జ‌డ్పీ చైర్మ‌న్‌గా ఉన్న కారుమూరి నాగేశ్వ‌ర‌రావు త‌ణుకు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో ఆ ప్లేస్‌లో) అవ‌కాశం ఇచ్చారు. 2009-2011 వ‌ర‌కు ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్నారు. జ‌గ‌న్ పార్టీ పెట్ట‌గానే పార్టీలోకి వ‌చ్చి వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీగా మేకా శేషుబాబు రికార్డు సృష్టించారు. 2011లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శేషుబాబు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఘ‌న‌విజ‌యం సాధించి.. వైసీపీ తొలి ఎమ్మెల్యేల్లో ఒక‌రిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ 2014లో పాల‌కొల్లు సీటు ఇచ్చారు. అయితే, ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడిపై ఓట‌మి చెందారు.

చేతిలో చెయ్యేసి మరీ….

ఇక‌, తాజా ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఇబ్బందుల‌లో ఉండ‌డంతో టీడీపీలోకి జంప్ చేయాల‌ని చూశాడు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు తెలిసింది. దీంతో జ‌గ‌న్ మేకా శేషుబాబును త‌ప్పించి గుణ్ణం నాగ‌బాబు కు ఇంచార్జ్ ప‌ద‌విని అప్ప‌గించారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో చేతిలో చేయేసి నాగ‌బాబును గెలిపించాల‌ని మేకా శేషుబాబును కోరారు. అయితే, దీనిని ఆయ‌న వ్య‌తిరేకించారు.చేతిలో చేయి వేసిన జ‌గ‌న్‌ను విసిరి కొట్టి వెళ్లిపోయారు. ఇక‌, అక్క‌డి నుంచి వైసీపీలో ఆయ‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీ అధినేత జ‌గ‌న్‌.. పాల‌కొల్లు టికెట్‌ను డాక్ట‌ర్ బాబ్జీ కి ఇచ్చారు.

చేజేతులారా…..

అయితే, పార్టీలోనే ఉన్న మేకా శేషుబాబు కుట్ర రాజ‌కీయాలు చేయ‌డంతో ఇంత జ‌గ‌న్ సునామీలోనూ బాబ్జీ ఓట‌మి పాల‌య్యారు. దీనిపై జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్ప‌టికే నివేదిక‌లు ఉన్నాయి. మ‌రోసారి నిమ్మ‌ల విజ‌యం సాధించారు. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను క‌లిసి, త‌న బాధ చెప్పుకొనేందుకు మేకా శేషుబాబు ప్ర‌య‌త్నించారు. అయితే, గ‌త విష‌యాల‌ను మ‌రిచిపోలేని జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు అప్పాయింట్ మెంట్‌గా కూడా ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు పాల‌కొల్లు కొత్త వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌వురు శ్రీనివాస్ నియ‌మితులు అయ్యారు. ఆయ‌న కూడా బీసీ వ‌ర్గానికి చెందిన నేతే. మేకా శేషుబాబుకు చెక్ పెట్టే క్ర‌మంలోనే జ‌గ‌న్ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శ్రీనివాస్‌కు బాధ్య‌త‌లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మేకా శేషుబాబు ఫ్యూచ‌ర్ ఏంట‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మేకా శేషుబాబు స్వ‌యంగా జ‌గ‌నే పొమ్మ‌న‌కుండా పొగ పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు, వైసీపీ త‌ర‌ఫున గెలిచిన తొలి ఎమ్మెల్సీ ఇలా ఫ్యూచ‌ర్ పాడుచేసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News