జగన్ కు ఫిదా అయింది అందుకే

మెగాస్టార్ చిరంజీవి మనిషి ఎక్కడున్నా మనసు ఆంధ్రావైపే ఉంటుందని నిరూపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా సామాజిక తెలంగాణ అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎన్నికల [more]

Update: 2020-01-05 14:30 GMT

మెగాస్టార్ చిరంజీవి మనిషి ఎక్కడున్నా మనసు ఆంధ్రావైపే ఉంటుందని నిరూపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా సామాజిక తెలంగాణ అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎన్నికల మ్యానిఫెస్టో లో స్పష్టం చేశారు. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చెప్పినట్లే ఎన్నడు చట్టసభకు ప్రాతినిధ్యం వహించని కులాలకు టికెట్లు ఇచ్చి ఓటమి పాలైన తాను అందరి వాడిగా ఉంటానన్న అనే సందేశాన్ని చాటి చెప్పారు. ఇక సమైక్యవాదిగా చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం తో సంప్రదింపులను కేంద్రమంత్రి హోదాలో సాగించారు. ఏపీని తప్పనిసరి పరిస్థితుల్లో ముక్కలు చేయాలిసివస్తే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా పట్టుబట్టారు. అయితే జైపాల్ రెడ్డి రాజకీయం ముందు చిరంజీవి, పల్లం రాజు వంటి వారి ప్రయత్నాలు విఫలం అయినా తెలుగువారి ఐక్యత కోసం మెగాస్టార్ కృషి మరువలేనిదనే చెప్పాలి. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఏపిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి శ్రీకారం చుట్టేందుకు నడుం కట్టడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

విశాఖ అంటే చిరుకు బాగా మక్కువ…

మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నానికి విడతీయరాని అనుబంధం ఉంది. వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్న చిరంజీవి ప్రతీసినిమా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సాగర తీరంలోని సహజ అందాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పెట్టని కోటలాగా పనికొస్తాయని ఆయన భావించడం వల్లే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు ఈ ప్రపోజల్ ముందు పెట్టడం దానికి సిఎం ఒకే చెప్పడం చక చకా జరిగిపోయాయి. ఈవిషయాన్ని చిరంజీవే స్వయంగా వెల్లడించారు ఇటీవలి మా అసోషియేషన్ డైరీ కార్యక్రమంలో. చిత్ర పరిశ్రమ ఐక్యంగా వుంటే మా అసోసియేషన్ ద్వారా విశాఖలో అడుగుపెడదామన్న ప్రపోజల్ ముందుకు తెచ్చారు. తెలంగాణలో కెసిఆర్ ఇప్పటికే పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని ఇప్పుడు జగన్ వయసులో తనకన్నా చిన్నవాడు అయినా ఎంతో ఆప్యాయంగా ఏమికావాలన్న చేస్తా అంటూ ముందుకు రావడం అభినందనీయం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

బాబు పెట్టని ఫోకస్ …

సినీ పరిశ్రమ పెద్దలందరు చేతిలో ఉన్నా, స్యయంగా తన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ తనయుడిగా క్రేజ్ వున్నా వేలమంది కి ఉపాధి కల్పించే టాలీవుడ్ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిందేమి లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే విషయం పై ఇప్పుడు టాలీవుడ్ లోని సినివర్గాల్లో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి. ఎపి సీఎం జగన్ మెగాస్టార్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో విశాఖ తీరంలో స్టూడియోల ఏర్పాటు సాగుతుందని సినీ వర్గాలు ఇప్పుడు ఆశపడుతున్నాయి. వాస్తవానికి జగన్ సిఎం అయ్యాక చిత్ర పరిశ్రమ నుంచి మౌనరాగమే వినిపించింది. టాలీవుడ్ రెండు వర్గాల చేతుల్లో ఉండటం అందులో ఒక వర్గం పూర్తిగా టిడిపి గా ముద్ర పడి ఉండటం అందరికి తెలిసిందే. మరో వర్గానికి మెగా ఫ్యామిలీ నాయకత్వం వహిస్తుంది. సోదరుడు పవన్ జనసేన పార్టీ తో మమేకం కావడంతో కొత్త సర్కార్ వచ్చి ఆరునెలలు అయినా మెగా కుటుంబం మద్దతు జగన్ కి మొన్నటి దాకా దక్కలేదు. అయితే సైరా సినిమా చూడాలంటూ సిఎం ను కోరేందుకు వెళ్ళిన మెగాస్టార్ కి అద్భుత స్వాగతం పలికి విందు ఏర్పాటు చేసి అన్నా అన్నా అంటూ జగన్ పెద్దరికాన్ని సైతం చిరంజీవికి కట్టబెట్టడంతో ఆయన ఫిదా అయిపోయారు. అందుకే మాఅసోసియేషన్ విషయాలను పెద్దగా పట్టించుకోని చిరు ముందు దానిని గాడిన పెట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టి సిఎం ఇచ్చిన ఆఫర్ టాలీవుడ్ కి కానుకగా అందించాలనే తపన పడుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.

రామానాయుడు ముందే ….

విశాఖ టాలీవుడ్ కి వేదికగా మారుతుందని నిర్మాత స్వర్గీయ రామానాయుడు ఎప్పుడో ఊహించారు. ఆయన నిర్మించిన అనేక సినిమాల్లో విశాఖ లోని అందాలు లేకుండా పిక్చర్ ఉండేదే కాదు. సాగరతీరం వెండితెర వరంగా ఆయన ఎప్పుడు చెబుతూ వచ్చేవారు కూడా. అందుకే ఆయన ఎంతో సాహసం తో స్టూడియో నిర్మించి తొలి అడుగు కూడా వేశారు. అయితే మిగిలిన సినీ వర్గాలు కానీ అధికారంలో ఉన్నవారు రామానాయుడు కలలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవి మరో అడుగు ముందుకు వేసి ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి నడుం కట్టడం వైసిపి నిర్ణయాలకు బ్రాండ్ గా మారడం విశేషమే.

Tags:    

Similar News