మెగా బ్రదర్స్ కు మెగా షాక్ తప్పదా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి కూడా అందడం లేదు. నిన్న చివరి విడదల పోలింగ్ తర్వాత పలు ప్రాంతీయ సర్వే సంస్థలు, జాతీయ టీవీ [more]

Update: 2019-05-20 11:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి కూడా అందడం లేదు. నిన్న చివరి విడదల పోలింగ్ తర్వాత పలు ప్రాంతీయ సర్వే సంస్థలు, జాతీయ టీవీ చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఇందులో మెజారిటీ సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని తేల్చాయి. 10కి పైగా ప్రముఖ సర్వే సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. లగడపాటి రాజగోపాల్ తో పాటు పలు స్థానిక సర్వే సంస్థలు, సీ ఓటర్, టుడేస్ చాణక్య అనే సంస్థలు మాత్రం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని తేల్చాయి. ఇలా రెండు పార్టీల గెలుపుపై సర్వే సంస్థలు తమ అంచనాలు చెప్పాయి. సర్వే సంస్థలు ఈ రెండు పార్టీల గెలుపోటములపై తలా ఓ మాట చెప్పినా ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రధాన పోటీదారుగా భావించిన పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అన్ని సర్వేలూ ఒకే అంచనాను వెల్లడి చేశాయి. జనసేన పార్టీకి 0 నుంచి 5 అసెంబ్లీ స్థానాలకు మించి రావని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక, ఒక్క పార్లమెంటు సీటు గెలిస్తే గెలవవచ్చని లేదా అది కూడా గెలవకపోవచ్చు అని తేల్చాయి.

5 సీట్ల లోపే జనసేన…

దీంతో జనసేన శ్రేణులు షాక్ లో ఉన్నాయి. ఎన్నికలకు ముందు అనేక సంస్థలు చేసిన సర్వేల్లో జనసేన పార్టీ 5 లోపు సీట్లే గెలుస్తుందని అంచనా వేసినా జనసేన శ్రేణులు కొట్టి పాడేశాయి. పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఉందని, జనసేనకు అనుకూలంగా వేవ్ ఉందని మొదట నమ్మకంగా చెప్పాయి. ఎన్నికలు సమీపించాక ఆ పార్టీ శ్రేణులు కొంత తగ్గి తమ నాయకుడు కింగ్ కాకున్నా కింగ్ మేకర్ అవుతారని భావించాయి. పవన్ కళ్యాణ్ ఓ 10 సీట్లు గెలిచి టీడీపీ, వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయి ఉంటే ఆయన కచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే వారేమో. కానీ, ఆ పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ లో కనిపించడం లేదు. చరిత్ర చూసినా తెలుగు ప్రజలు ఇలా హంగ్ ఇచ్చిన సందర్భాలు లేవు. గెలిచే పార్టీకి ప్రజలు స్పష్టమైన ఆధిక్యత ఇస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూశాక పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమైనట్లే కనిపిస్తోంది. ఆయన 10 శాతం వరకు ఓట్లు పడతాయని అంచనాలు ఉన్నా సీట్లు మాత్రం 5కి మించకపోవచ్చు.

బ్రదర్స్ అయినా గెలుస్తారా..?

పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి, ఆయన అన్న నాగబాబు నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే నాగబాబు విజయం కూడా కష్టంగానే ఉంది. పవన్ మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే, ప్రజలు మూడో ప్రత్యామ్నాయం వైపు ఆలోచించకపోవడమే పవన్ కు మైనస్ అయ్యింది. చంద్రబాబు పాలన చూసిన ప్రజల్లో పాలన మారాలని అనుకున్న వారు జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నట్లు స్పష్టమవుతోంది. పదేళ్లుగా జగన్ ప్రజల్లో ఉండటం, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే రావడం మూలంగా చంద్రబాబుకు మొదటి ప్రత్యామ్నాయంగా ప్రజలు జగన్ నే చూసినట్లే కనిపిస్తోంది. ఇక, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పవన్ అవగాహన కుదుర్చుకున్నారన్న వైసీపీ ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్లడం పవన్ కు మైనస్ అయ్యింది. మొత్తంగా 2019 ఎన్నికల ఫలితాలు జనసేనకు పెద్ద ఎదురుదెబ్బ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News