ఇంతకీ ఆ లేడీ ఎవరో?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో [more]

Update: 2020-12-07 00:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతు కూడా ఉండటంతో గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ కే దక్కనుంది. అయితే ఈసారి గ్రేటర్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి మేయర్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది.

23 మంది మహిళా కార్పొరేటర్లు…..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 55 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. అందులో 23 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో కొందరు రెండోసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికైన వారినే మేయర్ పదవికి ఎంపిక చేస్తారన్న చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. అయితే గత మేయర్ పదవిని బీసీకి కేటాయించారు. ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో ఓసీలు కూడా మేయర్ పదవికి పోటీ పడుతున్నారు.

ఓసీకి ఇస్తే….

మేయర్ పదవికి పోటీ పడే వారిలో మాధవరం రోజారావు, చింతల శాంతి, సింధూరెడ్డి, విజయారెడ్డి ఉన్నారు. వీరిలో పి. జనార్థన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి మేయర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి రెండోసారి విజయారెడ్డి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచారు. ఈమెతో పాటు సింధూరెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఈమె అభ్యర్థిత్వానికి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

బీసీలకు మళ్లీ ఛాన్సిస్తే….

ఇక టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. బీసీ కోటా కింద తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని అడుగుతున్నారు. ఇటీవలే కేకేకు రెండోసారి రాజ్యసభ పదవి ఇవ్వడంతో ఆమె పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి కూడా రేసులో ఉన్నారు. అయితే ఈసారి మళ్లీ అదే కుటుంబానికి మేయర్ పదవిని ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. మొత్తం మీద టీఆర్ఎస్ లో ఆ ఫస్ట్ లేడీ ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News