మాయా ..కాలం..!!

Update: 2018-12-26 16:30 GMT

దేశరాజకీయాలను 2019లో తామే దున్నేస్తామని భావిస్తున్న నేతలు ముగ్గురు కనిపిస్తున్నారు. వీరి ముఖచిత్రం అందరికీ తెలిసిందే. లోప్రొఫైల్ తో అసలు రాజకీయ చిత్రాన్ని ఆడించే దిక్సూచి మరొకరున్నారు. ఆమె అంతుచిక్కని వ్యూహాలు, పంతం, పట్టుదలలు , క్షణ క్షణం మారే నిర్ణయాలకు పెట్టింది పేరైన బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉత్తరప్రదేశ్ లో కీలక రాజకీయశక్తిగా ఉండటానికి తోడు మరో ఎనిమిది రాష్ట్రాల్లో కొంత ప్రభావాన్నిచూపగల ఓటు బ్యాంకు ఆమె సొంతం. దాంతో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో సీట్లను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఆమె కరుణాకటాక్షాల కోసం సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెసు పార్టీలు సాగిలపడుతున్నాయి. బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో ఆమెతో పొత్తు పెట్టుకోవాలని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. నిజానికి ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సీట్లను సాధించగల సామర్థ్యం బహుజన సమాజ్ పార్టీకి లేదు. కానీ ప్రధాన పక్షాలతో జట్టుకడితే అదనపు బలం సమకూర్చి పెట్టగల సత్తువ మాత్రం బీఎస్పీ కి ఉంది. అదే సమయంలో అధికార విపక్షాల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉంటే బలాబలాలను తారుమారు చేయగలదు. పోటాపోటీ వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో గెలుపు తులసీదళంగా బీఎస్పీ మారేందుకూ అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మాయావతి రాజకీయంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

చంద్రుల హడావిడే...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రానున్న లోక్సభ ఎన్నికల్లో చక్రం తిప్పాలని బలంగా భావిస్తున్నారు. అందుకు తామే అర్హులమని విశ్వసిస్తున్నారు. ప్రధాని అభ్యర్థులుగా తమనుతాము ఎక్సపోజ్ చేసుకోవడం లేదు. అయితే కింగ్ మేకర్లుగా వ్యవహరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెసు నేతృత్వంలోని విస్తరించిన యూపీఏ కూటమికి అనుసంధాన కర్త పాత్రపోషించే దిశలో చంద్రబాబు నాయుడు చురుకుగా వ్యవహరిస్తున్నారు. యూపేఏ పేరుతో కాకుండా బీజేపీకి ప్రత్యామ్నాయకూటమి పేరిట కాంగ్రెసు, వామపక్షాల సహా ఒకే వేదికపైకి తీసుకు రావాలనేది బాబు ప్రయత్నం. దీనికి ఇప్పటికే కొన్నిపార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి క్లియర్ పిక్చర్ తో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ , కాంగ్రెసు ప్రధాన భాగస్వామిగా ఉండే ప్రత్యామ్నాయ కూటమి రెండూ ముఖాముఖిగా నిలవాలనేది చంద్రబాబు యోచన. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ది ఇందుకు భిన్నమైన వ్యూహం. కాంగ్రెసు, బీజేపీలకు అప్పనంగా జాతీయాధికారాన్ని అప్పగించకుండా ప్రాంతీయపార్టీల పెత్తనంతో శాసించాలనేది ఆయన భావన. ఇందుకుగాను ఒక బలమైన ప్రాంతీయపార్టీల సమాఖ్యను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పెద్దగా స్పందన లభించకపోయినా పనిగట్టుకుని తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు అందర్నీ ఒప్పించగలనని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ దిశలో తొలి అడుగు తనదే కాబట్టి కచ్చితంగా ఈ సమాఖ్యకు కీలకమైన వ్యక్తిగా తానే ఉంటాననేది ఆయన నమ్మకం.

మమతకూ చెక్...

ఇద్దరు చంద్రుల కథలు.. జాతీయంగా కొంత సందిగ్ధతకు దారితీస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెసుల ఫ్రంట్ లు ముఖాముఖి పోటీ పడతాయా? లేదా? అన్న సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తనను తాను తిరుగులేని నాయకురాలిగా భావించుకునే మమతా బెనర్జీ తన మనసులోని మాటను క్రమేపీ బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమబంగ నుంచి ఇప్పటివరకూ ప్రధాని ఎవరూ లేరు. తాను కొంచెం గట్టిగా తలపెడితే ఇప్పుడున్న అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవని ఆమె గ్రహించారు. కాంగ్రెసు, బీజేపీలను పెద్దగా పట్టించుకోనక్కర్లేకుండా సొంతబలం చాటుకోవడంపైనే ఆమె దృష్టి సారిస్తున్నారు. మోడీని తీవ్రంగా వ్యతిరేకించే మమత , రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపైనా పెద్దగా సుముఖత చూపకపోవడానికి తన ఢిల్లీ ఆకాంక్షలే కారణం. ఒకవేళ పీఎం రేసులో నిలవాల్సి వస్తే.. ఏపీలో చంద్రబాబు , యూపీలో మాయావతి, మహారాష్ట్రలో శరద్ పవార్ లు బలమైన పోటీదారులుగా ఉంటారనేది మమత భావన. నిజానికి తృణమూల్ కాంగ్రెసు కంటే మాయావతిపార్టీ బీఎస్పీకి జాతీయ నిర్మాణం ఉంది. దళిత ఓటు బ్యాంకును సంఘటితం చేయగల శక్తి ఉంది. ప్రధాని రేసులో మాయావతికి అవకాశాలున్నాయని కన్ఫర్మ్ అయితే దేశంలోని ఎస్సీ ఓట్ల పోలరైజేషన్ బీఎస్పీకి అనుకూలంగా మారుతుంది. మమతా బెనర్జీ ఆశలకు గండి పడుతుంది. చంద్రబాబు, శరద్ పవార్ ల కంటే మాయావతినే మమతకు ప్రధాన పోటీదారుగా చెప్పుకోవాలి.

చంచలం...

సరైన ఎత్తుగడలతో ముందుకు వెళితే .. చక్కని అవకాశాలు కలిగిన నేత మాయావతి. అయితే ఎవరినీ లెక్క చేయని దూకుడు స్వభావం. తన బలాన్ని అతిగా అంచనా వేసుకోవడం , ఆధిపత్య ధోరణి బీఎస్పీ అధినేత్రి అవకాశాలకు గండి కొడుతున్నాయి. లౌక్యం, సమయస్ఫూర్తి, అందరినీ కలుపుకుని పోగల నేర్పు అలవరుచుకుంటే ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమెకు ఆటంకాలే ఉండవనేది పరిశీలకుల అంచనా. ఉత్తరప్రదేశ్ లో పార్టీ బాగా దెబ్బతింది. అలాగని ఓటు బ్యాంకు పోలేదు . కానీ సమీకరణలు కలిసి రావడం లేదు. సమాజ్ వాదీ పార్టీతో కలిస్తే యూపీని స్వీప్ చేసే అవకాశాలుంటాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ సైతం ఆమె తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ఎటూ తేల్చిచెప్పకపోవడమే ఆమె ప్రత్యేకత. కేంద్రంలో నువ్వు, రాష్ట్రంలో నేను అన్న ఒక మధ్యేమార్గ ఒప్పందానికి వచ్చేస్తే, ఎస్పీ, బీఎస్సీలే జాతీయ రాజకీయాలను శాసించే ఛాన్సులున్నాయి. తాజాగా జరిపిన సర్వేలో బీజేపీ, ఎన్డీఏ కూటమి 220స్థానాలతో నిలిచిపోతుందని తేలింది. యూపీఏ కూటమి 187 వద్ద ఆగిపోతుంది. ఎస్పీ,బీఎస్పీలు కలిస్తే 55 స్థానాలు గెలుచుకుంటాయనేది అంచనా. ఏ కూటమి అయినా ఈ పార్టీల టర్మ్స్ ను అంగీకరించాల్సిందే. అవసరాలను, అవకాశాలను బట్టినడుచుకునే రాజకీయవేత్త అఖిలేష్. ఇప్పుడు మాయానే డిసైడ్ చేయాలి మార్గమేమిటో...!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News