నాతో పెట్టుకోకు….!!

కూటమి ప్రభుత్వం అంటే ఇలానే ఉుంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ యేతర కూటమిలో వార్నింగ్ లు, డిమాండ్లు పెరిగిపోయాయి. సీట్ల సర్దుబాటు అంశాన్ని పక్కనపెడితే [more]

Update: 2019-01-01 17:30 GMT

కూటమి ప్రభుత్వం అంటే ఇలానే ఉుంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ యేతర కూటమిలో వార్నింగ్ లు, డిమాండ్లు పెరిగిపోయాయి. సీట్ల సర్దుబాటు అంశాన్ని పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీకి తాజా వ్యవహారంతో భవిష్యత్ అంటేనే భయంపుట్టేలా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీఎస్పీ అండ అధికార కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మాయావతి తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు దడ రేపుతున్నాయి.

వార్నింగ్ ఎందుకు?

తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పొత్తుపై పునరాలోచిస్తామని మాయావతి కాంగ్రెస్ పార్టీకి గట్టి వార్నింగే ఇచ్చారు. అక్కడి ప్రభుత్వాలు ఏర్పడి పక్షం రోజులు కాకముందే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలపై వత్తిడి తేవడం ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో భారత్ బంద్ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లేకుంటే మద్దతుపై పునరాలోచించాల్సి వస్తుందని ఆమె చేసిన హెచ్చరిక కాంగ్రెస్ నేతలను కలవర పెడుతోంది.

ముందు చూపుతోనేనా?

మాయావతి చేసిన ఈ హెచ్చరికను కేవలం మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకే పరిమితం చేసి చూడకూడదంటున్నారు విశ్లేషకులు. ఆమె లోక్ సభఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్నది కాంగ్రెస్ నేతల భావన. లోక్ సభ ఎన్నికలకు ముందు పొత్తు ఉండాలని కాంగ్రెస్, ఎన్నికల అనంతరం కూటమిగా ఏర్పడాలని బీఎస్పీ, ఎస్పీ, కమ్యునిస్టు పార్టీలు తలపోస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఫలితాలను బట్టి పొత్తు కుదుర్చుకుంటే తమకు లాభమని మాయావతి అంచనా వేస్తున్నారు.

కట్టడి సాధ్యమేనా?

ఈనేపథ్యంలో మాయావతిని కట్టడి చేయడం కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది. ఒకవైపు బీజేపీ యేతర కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనుకుంటున్న తరుణంలో మాయావతి పెడుతున్న ఫిట్టింగ్ లతో కూటమి లో ఎన్నికలకు ముందే విభేదాలు తలెత్తేలా కన్పిస్తున్నాయి. ఒకవైపు మాయావతి, మరోవైపు మమత బెనర్జీలతో నెట్టుకు రావడం కాంగ్రెస్ కు కష్టంతో కూడుకున్న పనేనన్నది వాస్తవం. మరి ఎన్నికల నాటికి ఎలాటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News