ఏమిటీ అరాచకం..? ఎక్కడకీ ప్రస్థానం...?

Update: 2018-09-24 15:30 GMT

హింసకు ప్రతిహింస ఎప్పటికీ బదులు కాదు. సంచలనం సృష్టించడం ద్వారా సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మూడు నాలుగు రోజుల మీడియా హడావిడితో చల్లారిపోతుంది. తాజాగా విశాఖలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన ఘట్టం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. గతంలో నక్సలైట్లను ఏరిపారేసే నెపంతో ఎన్ కౌంటర్లు చేసి తుదిముట్టించిన సంఘటనలకూ కొదవ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇరువైపులా కలిపి చూస్తే దేశంలో 12 వేలమందికిపైగా హతులైనట్లు అనధికారిక సమాచారం. వర్గశత్రువులుగా భావించుకుంటున్న పోలీసులు, నక్సలైట్లు పరస్పరం దాడులతో అటవీ, గిరిజన ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అసలు తమకు కేటాయించిన కేంద్రాల్లో నివాసం ఉండటానికే భయపడుతున్నారు. ఎమ్మెల్యేలకు తప్పదు కాబట్టి పటిష్ట భద్రత మధ్య ప్రజల్లో తిరుగుతున్నారు. కుటుంబాలు, నివాసాలు సమీప జిల్లాకేంద్రాలకు , పెద్ద పట్టణాలకు మార్చేసుకుంటున్నారు. కేవలం క్యాంప్ ఆపీసులే నడుస్తున్నాయి. ఇక అధికారుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఉద్యోగం మొక్కుబడి చేసుకుంటున్నారు. చేరిన మొదటిరోజునుంచే బదిలీ యత్నాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. కుటుంబాలు పట్టణ కేంద్రాల్లోనే ఉంటున్నాయి.

ఇంకానా...?

కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు గిరిజన ప్ర్రాంతాల అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ప్రగతి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న పరిస్థితులే. గిరిజన ప్రాంతాల ప్రగతికి ఉద్దేశించిన నిధులు చాలామేరకు అవినీతిపరుల భోజ్యంగా మారుతున్నాయి. కాంట్రాక్టర్ల పరమవుతున్నాయి. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములవుతున్నారు. ఈ తంతు అందరికీ తెలిసిందే . అయినా ఎవరూ మాట్టాడరు. ఎందుకంటే అంతా ఆ తాను ముక్కలే. మౌలిక వసతులు ఏర్పడితే తమ స్వేచ్ఛకు భంగకరమని ఇటువంటి విషయాల్లో మావోలు సైతం పట్టీ పట్టనట్లు చూస్తుంటారు. కొన్నిచోట్ల వీరికీ కాంట్రాక్టర్లు, రాజకీయనాయకులు ఫండింగ్ చేస్తుంటారు. దీంతో ఈమూడు వర్గాల మధ్య సిండికేట్ ప్రయోజనం తాండవిస్తూ ఉంటుంది. సిద్దాంతాల కోసం రహస్య, అజ్ణాత జీవితం గడుపుతున్న మావోలు సైతం మనుగడ కోసం, మనీ కోసం రాజీపడి కాసుల యావలో పడిపోవడం విచిత్రం. ఈరకమైన లాలూచీ కారణంగానే అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు పూయడం లేదు.

వెన్నుదన్ను....

గిరిజనులకు కూడా తెలుసు. మావోలు తమకోసం పూర్తిగా, స్వచ్చందంగా పనిచేయడం లేదని. అయినా వారికి మద్దతిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం తమ ప్రాంతాల్లో దోపిడీని అరికట్టకపోయినా, తమ జీవనస్థితిగతులు ఛిద్రం కాకుండా కాపాడటానికి మావోలు అవసరమనేది వారి అభిప్రాయం. మావోయిస్టులు వెన్నంటి ఉన్నారని తెలిస్తే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తమ చుట్టూ ఎంతభద్రత ఉన్నప్పటికీ మాటు వేసి మట్టుబెడతారనే భయంతో నాయకులు మావోల హెచ్చరికలను బేఖాతరు చేయరు. తద్వారా పర్యావరణం, ప్రకృతి, గిరిజన జీవన విధానానికి సంబంధించి కనీస ప్రమాణాలను కాపాడుకోగలుగుతున్నారు. ఆమాత్రమైనా తమకు మావోల వల్ల మేలు చేకూరుతుందనే భరోసాతోనే వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు గిరిజనులు. తమ వ్యవహారాలకు ట్రైబల్స్ మద్దతు ఎంత అవసరమో తెలుసుకాబట్టే మావోలు సైతం అడ్డగోలుగా వెళ్లడం లేదు. గిరిజనుల డిమాండ్లు, ప్రతినిధులు, కాంట్రాక్టర్ల దోపిడీకి మధ్య బ్యాలెన్సింగ్ ఫాక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యమకారులకూ, మావోలకు డబ్బులు పారేస్తున్నాం కాబట్టి లెక్కచేయనవసరం లేదని కొందరు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించిన సందర్భాల్లోనే కాల్పుల వంటి ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి.

సర్కారుకే సవాల్...

ప్రభుత్వ లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. తమకు పెట్టుబడులు సమకూర్చేవారికి, ఎన్నికల్లో నిధులు ఖర్చుపెట్టేవారికి ప్రక్రుతి సంపదను దోచిపెట్టడమే పనిగా ఉంటోంది. ఇక్కడ పార్టీ ప్రయోజనాలే ప్రభుత్వ ఉద్దేశంగా మారుతోంది. గిరిజనులు నిర్వాసితులైనా ఫర్వాలేదు. భూగర్భసంపద, ప్రకృతి సంపదను దోచేసేందుకు అనుమతులిస్తున్నారు. తమ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులపై తిరుగుబాటు ధోరణిని కనబరుస్తున్నారు నిర్వాసితులు. డబ్బుకు అలవాటు పడిన ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ఏదో రూపేణా ప్రజలపై సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. దీనిని అరికట్టమని మావోలపై ఒత్తిడి పెరుగుతోంది. తమ సైద్దాంతిక మనుగడకే సవాల్ ఎదురవుతోందని భావించిన సందర్బాల్లో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లపై వీరు దాడులకు తెగబడుతున్నారు. గిరిజన సంస్కృతిని , వారిజీవన విధానాన్ని, ప్రకృతిని పరిరక్షిస్తూ సహజసంపద దోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఆ కర్తవ్యాన్ని విస్మరించి తామే దోపిడీకి మూలంగా, సూత్రధారులుగా నిలవడం ప్రభుత్వ పెద్దలుచేస్తున్న నిర్వాకం. ఫలితం గిరిజనులు, మావోలు, ప్రజాప్రతినిధుల మధ్య సంఘర్షణాత్మక వాతావరణం నెలకొంటోంది. ఈ యుద్దంలో అసలు దోషి సర్కారే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News