బ్యాడ్ టైం నడుస్తోంది

రాజ‌కీయాల్లో అదృష్టి క‌లిసిరావ‌డం అంటే అంత మాట‌లు కాదు. ఎన్ని త్యాగాలు చేసినా.. టైంబాగోక పోతే. ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితే ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవే మాట‌లు [more]

Update: 2019-08-13 02:00 GMT

రాజ‌కీయాల్లో అదృష్టి క‌లిసిరావ‌డం అంటే అంత మాట‌లు కాదు. ఎన్ని త్యాగాలు చేసినా.. టైంబాగోక పోతే. ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితే ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవే మాట‌లు గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మ‌ననం చేసుకుంటున్నారు. వైఎస్‌కు ప్రియ‌నేత‌గా ఎదిగిన ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి ఈ కుటుంబానికి అండ‌దండ‌గా ఉన్నారు. 2009, 14 ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూసినా.. జ‌గ‌న్ పార్టీనే న‌మ్ముకుని, ఆ పార్టీ ఎదుగుద‌ల‌కు కృషి చేశారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిడులు వ‌చ్చినా.. ఎన్నెన్ని కేసులు న‌మోదు చేసినా.. త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు.

టిక్కెట్ ను త్యాగం చేసినా….

జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌ని అనుకున్న నేత‌ల్లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కూడా ఒక‌రు. జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా త‌న ప‌ద‌వులు వ‌దిలేసుకుని వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీలోని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో పార్టీ ప‌టిష్టత కోసం త‌న వంతుగా కృషి చేశారు. అలాంటి నాయ‌కుడు పార్టీ కోసం ఎవ‌రూ చేయ‌ని త్యాగం చేశారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోత‌న టికెట్‌ను జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు త్యాగం చేశారు. బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు విడ‌ద‌ల ర‌జ‌నీ కోసం త‌న టికెట్‌ను ఆయ‌న వ‌దులుకున్నారు.

ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే..?

ఈ క్రమంలోనే జ‌గ‌న్ త‌న ప్రభుత్వం ఏర్పడితే.. మ‌ర్రిని మంత్రిని చేస్తార‌ని బ‌హిరంగంగానే హామీ ఇచ్చారు. దీంతో విడుద‌ల గెలుపు కోసం మ‌ర్రి రాజశేఖర్ త‌న శ‌క్తినంతా ఒడ్డారు. ఇక‌, ర‌జ‌నీ కూడా త‌ను గెలిచే వ‌ర‌కు మ‌ర్రిని అనుస‌రించారు. ఆయ‌న బాట‌లో న‌డిచారు. రాష్ట్రంలో వైసీపీ నాయ‌కులు అనుకున్న విధంగా జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే మ‌ర్రి రాజశేఖర్ కి తొలివిడ‌త‌లోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కడం ఖాయ‌మ‌ని ఆయ‌న అనుకున్నారు. ఆయ‌న అనుచ‌రులు అయితే, పండ‌గే చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా తొలి జాబితాలో మ‌ర్రి పేరు క‌నిపించ‌లేదు. దీంతో తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడూ రాకపోవడంతో…..

పోనీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో ఒక‌టైనా ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. ఇప్పుడు అదికూడా ద‌క్కడం లేద‌ని స్పష్టమైంది. దీంతో మ‌ర్రి వ‌ర్గం అసంతృప్తితో ర‌గిలిపోతోంది. మ‌రోప‌క్క, నిన్న మొన్నటి వ‌ర‌కు మ‌ర్రి చుట్టూ తిరిగిన విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఇప్పుడు గెలిచిన త‌ర్వాత ఆయ‌న మొహం చూడ‌డంలేదు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చి త‌న‌ను ప‌క్కన పెట్టడంతో మ‌ర్రి కాస్త తీవ్ర అస‌హ‌నంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి మ‌ర్రి రాజశేఖర్ కి త‌న హామీని జ‌గ‌న్ ఏ రూపంలో నిల‌బెట్టుకుంటారో చూడాలి.

Tags:    

Similar News