మర్రి...ఒక పాఠశాల....!

Update: 2018-07-16 16:30 GMT

మర్రి చెన్నారెడ్డి..... తెలుగురాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆయన పేరు తెలియని వారుండరు. మూర్తీభవించిన తెలంగాణ వాది. నాయకత్వానికి మారుపేరు. ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడు. ఎమ్మెల్యే, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, వివిధ రాష్ట్రాల గవర్నర్ గా విశేష సేవలు అందించిన నాయకుడు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిన నిజమైన నాయకుడు. ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి ఒకప్పటి ఆద్యుడు. నాడు ఆయన పోసిన నారు-నీరు కారణంగానే అనంతర కాలంలో ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా నిలిచింది. చెన్నారెడ్డి శతజయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం, ఆయన నాయకత్వ లక్షణాలను తెలుసుకోవడం నేటి తరం నాయకులకు అవసరం. మర్రి చెన్నారెడ్డి ప్రస్థానమే ఒక పాఠశాల. ఆయన గురించి తెలుసుకోవడం అంటే తెలంగాణ పౌరుషాన్ని, ఖ్యాతిని,గొప్పతనాన్ని గుర్తుకు తెచ్చుకోవడమే. మర్రి చెన్నారెడ్డి శత జయంతి సందర్భంగా ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

సొంతంగా పార్టీ పెట్టి.....

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో 1919 జనవరి 13న జన్మించిన చెన్నారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. 1957 లో వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1962, 1967ల్లో తాండూరు నుంచి చట్టసభలోకి ప్రవేశించారు. ప్రత్యేక తెలంగాణకోసం అనంతర కాలంలో పోరాడారు. తన పదునైన ప్రసంగాలు, నాయకత్వ లక్షణాలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అప్పట్లో ఉర్రూత లూగించారు. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్), ను స్థాపించి రాజకీయంగా సత్తా చాటారు. అప్పట్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 లోక్ సభ స్థానాలకు గాను 11 స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి విజయకేతనం ఎగురవేయడం ప్రజల్లో ఆయన పట్ల గల ఆదరణకు నిదర్శనం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ జోక్యంతో తెలంగాణ వాదానికి స్వస్తి పలికారు. అనంతరం దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్లారు. 1974 నుంచి 1977 వరకూ యూపీ ప్రధమ పౌరుడిగా కొనసాగారు. 1978లో కాంగ్రెస్ లో చీలిక అనంతరం ఇందిర పక్షాన నిలిచారు. అదే ఏడాది ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

రెండుసార్లు ముఖ్యమంత్రిగా......

1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకూ పదవిలో కొనసాగారు. అంతర్గత రాజకీయాలు, అధిష్టానాన్ని థిక్కరించడం వంటి కారణాలతో పదవికి దూరమయ్యారు. అనంతరం 1982లో పంజాబ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 1983 వరకూ ఆ పదవిలో కొనసాగారు. కొద్దికాలం స్తబ్దుగా ఉన్న చెన్నారెడ్డి 1989లో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1989జూన్ ప్రాంతంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో తెలుగుదేశంపార్టీ ప్రభంజనం వీస్తోంది. ఎన్టీఆర్ ధాటికి తట్టుకుని నిబలడే స్థితిలో కాంగ్రెస్ లేదు. ఎన్టీఆర్ కు ఢీకొనగల ధీటైన నాయకుడు చెన్నారెడ్డేనని గుర్తించిన అధిష్టానం ఆయనను పీసీసీ చీఫ్ ను చేసింది. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి స్థానంలో పదవి చేపట్టిన చెన్నారెడ్డి పార్టీని ముందుకు ఉరికించారు. ఎన్టీఆర్ ను తన పదునైన ప్రసంగాలతో దునుమాడారు. ఆయన పాలనలో అక్రమాలను, అవినీతిని ఊరూరా ప్రచారం చేశారు. 1989 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ను మహబూమ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓడించారు. ఆయనపై గెలిచిన చిత్తరంజన్ దాస్ కు తన మంత్రివర్గంలో చోటు కల్పించిన ఘనత మర్రి చెన్నారెడ్డిదే. 1990 డిసెంబరు 17వరకూ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి కొనసాగారు. మళ్లీ ఎప్పటిలాగానే అంతర్గత కలహాలు, అధిష్టానాన్ని థిక్కరించే ధోరణిలో వ్యవహరించడం కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కొద్దికాలానికి 1992లో రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు. 1993లో తమిళనాడుకు బదిలీ అయ్యారు. 1996 డిసెంబరు 2న మరణించేంత వరకూ ఆయన గవర్నర్ గా కొనసాగారు.

విశిష్టమైన వ్యక్తిత్వం....

మర్రి చెన్నారెడ్డిది విశిష్టమైన వ్యక్తిత్వం. స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరికీ లొంగరు. తాను చెప్పిందే వేదమనే అలవాటుంది. అణకువగా...అనామకునిగా ఉండటం ఆయనకు చేతకాని పని. నాయకుడిగా తప్ప అనుచరుడిగా ఉండటాన్ని ఆయన అస్సలు ఇష్టపడరు. ప్రజాబలం లేని కొందరు నాయకుల తప్పిదాల ఫలితంగా పార్టీ దెబ్బతింటోందని, ఫలితంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. తెలుగు గంగ జలాల పేరిట అప్పటి మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు శరద్ పవార్, వీరేంద్ర పాటిల్ తో సమావేశమయ్యారు చెన్నారెడ్డి. ముగ్గురు కాంగ్రెస్ నాయకులే. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వీరు మంతనాలు జరిపినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయినా మర్రి చెన్నారెడ్డి కంగారు పడలేదు. ‘‘అలా ఎవరైనా అనుకుంటే పరవాలేదు’’ అని అనడం ఆయనలాంటి ధీరాదత్త నాయకుడికే చెల్లింది.

ఈ భాషల్లో అనర్గళంగా.....

హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగుల్లో అనర్గళంగా మాట్లాడే ఆయనకు ముందుగా రాసిచ్చిన ప్రసంగాలు చదివే అలవాటు లేదు. ముక్కుసూటిగా చెప్పాల్సిన విషయాలను చెప్పేసేవారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతాన్ని రాజేంద్ర నగర్ గా పేరు మార్చింది ఆయనే. 1989 ఎన్నికల సందర్భంగా తన ప్రసంగాలనే పార్టీ ఎన్నికల ప్రణాళిక అని చాటిచెప్పిన ఘనత ఆయనది. అవినీతిని, అసమ్మతిని సహించేవారు కాదు. 1990 ప్రాంతంలో తన మంత్రివర్గం లోని కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు రంగారావుపై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్దాక్షిణ్యంగా రాజీనామా చేయించారు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మంత్రులు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సంగీత వెంకటరెడ్డిలను అప్రధాన్య శాఖలకు మార్చారు. ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీలను సయితం థిక్కరించడానికి వెనుకాడని ధీశాలి. తాను అనుకున్నది నీళ్లు నమలకుండా, నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పడం ఆయనకు అలవాటు. అచ్చమైన తెలంగాణ పౌరుషానికి నూటికి నూరుపాళ్లు ప్రతీక చెన్నారెడ్డి.....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News