రెండు పాత్రలు ఆయనే పోషిస్తున్నారే?

రాజమండ్రి లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధి ఇప్పుడు ఒక్కరే. ఈ నియోజకవర్గంలో దాంతో చిత్రమైన పరిస్థితి నెలకొంది. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా వైసిపి నుంచి మార్గాని [more]

Update: 2020-06-16 08:00 GMT

రాజమండ్రి లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధి ఇప్పుడు ఒక్కరే. ఈ నియోజకవర్గంలో దాంతో చిత్రమైన పరిస్థితి నెలకొంది. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా వైసిపి నుంచి మార్గాని భరత్ రామ్, అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిరెడ్డి భవాని గెలుపొందారు. దాంతో రెండు పార్టీలు తమ ఆధిపత్యం కోసం అడుగడుగునా కార్యక్రమాలు సాగిస్తూ వస్తుంటాయి. అయితే లాక్ డౌన్ 4.0 పూర్తి అయ్యేవరకు బయటకే రాలేదు. ఆ సమయంలో ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని తరపున ఆమె బాధ్యతలను భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వర్తించారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున పెద్ద ఎత్తునే సేవలు అందించారు.టిడిపి అధిష్టానం ఇంట్లోనే వైసిపి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసన తెలిపే పిలుపుల్లో సైతం దూరంగానే ఉన్నారు భవాని. వీటిని ఆమె భర్త శ్రీనివాస్, మామ అప్పారావు లే చేపట్టారు.

ఎంపీ చక్రం తిప్పుతున్నారు …

అయితే ఎమ్యెల్యే బయటకు రాకుండా భర్త తిరగడంతో ఆ అవకాశాన్ని వైసిపి బాగా వినియోగించుకుంది. అధికారపార్టీలోని రెండు గ్రూప్ లు పోటా పోటీగా సేవా కార్యక్రమాలు చేపట్టి దూసుకుపోయింది. సహజంగా అధికారపార్టీ కావడంతో దాతలు కూడా అధికారపార్టీకి అండ దండ గట్టిగానే అందించారు. దాంతో దాదాపు 80 శాతం ప్రజలకు నేరుగా వైసిపి వీలైనంత ఆదుకునే ప్రయత్నం చేసి రాజమండ్రి అర్బన్ లో మైనస్ లో ఉన్న స్థానాన్ని బాగానే మెరుగు పరుచుకుంది. ఇది పక్కన పెడితే ఎమ్యెల్యే అధికారిక కార్యక్రమాలకు లాక్ డౌన్ లో దూరం గా ఉండటంతో యువ ఎంపి భరత్ అటు అర్బన్ ఎమ్యెల్యే గాను ఎంపి గాను ద్విపాత్రాభినయం చేసేస్తున్నారు. అంతా తానై అన్నిటా తన ముద్ర వేసుకుంటూ టిడిపి కి చుక్కలు చూపించేస్తున్నారు.

ఆదిరెడ్డి భవాని కి ప్రోటోకాల్ ఇవ్వడం లేదా … ?

అధికారులు సైతం ఎంపి మార్గాని భరత్ కి అత్యధిక ప్రాధాన్యత సహజంగానే ఇస్తున్నారు. చాలా కార్యక్రమాల్లో ఎమ్యెల్యే భవాని కి ఆహ్వానాలే వెళ్ళడం లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి . అధికారిక కార్యక్రమాల వివరాలు కూడా ఇవ్వడం లేదని టిడిపి అర్బన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికార వర్గాలు ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి. తాము సమాచారం ఇచ్చినా ఎమ్యెల్యే హాజరు కావడం లేదంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపి భరత్ మాత్రం ప్రతి కార్యక్రమం లో పాల్గొంటూ రెండు పాత్రలను అన్ని తానై నిర్వర్తించేస్తున్నారు. అదే ఇప్పుడు రాజమండ్రి అర్బన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దాంతో లాక్ డౌన్ 5.0 లో తొలి సారి బయటకు వచ్చారు ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని. రానున్న వర్షాకాలం లో సిటీ లో ముంపు సమస్య పై నల్లా ఛానెల్ ను సందర్శించి తిరిగి ఇంటికే పరిమితం అయ్యారు. దాంతో తిరిగి అడ్వాంటేజ్ వైసిపి గా మారిపోయింది.

Tags:    

Similar News