అందరూ అమరావతి మీద పడితే ?

అమరావతి కామధేనువులా కనిపిస్తోందిపుడు. తరగని ఓట్లను రాల్చే అక్షయపాత్రలాగానూ అగుపిస్తోంది. ఇంతకీ అమరావతి మీద ఒక్కసారిగా ఎందుకు అటెక్షన్ పెరిగింది అంటే దానికి చాలానే కారణాలు ఉన్నాయి. [more]

Update: 2020-12-23 11:00 GMT

అమరావతి కామధేనువులా కనిపిస్తోందిపుడు. తరగని ఓట్లను రాల్చే అక్షయపాత్రలాగానూ అగుపిస్తోంది. ఇంతకీ అమరావతి మీద ఒక్కసారిగా ఎందుకు అటెక్షన్ పెరిగింది అంటే దానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఏపీలో చెప్పుకోవడానికి మరే పెద్ద సమస్య లేకపోవడం అసలు కారణం. ఇక అమరావతి సమస్య అలా సాగదీసేలా కనిపిస్తూండడం ఇంకో కారణం. అమరావతి చుట్టూ కొన్ని సామాజికవర్గాలు, మరికొన్ని జిల్లాలూ అల్లుకుని ఉండడం మరో కారణం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క వైసీపీ తప్ప తక్కిన రాజకీయ పార్టీలన్నీ అమరావతిని పట్టుకుని రాజకీయ జూదమే ఆడుతున్నాయి.

మైలేజ్ ఎవరికి….?

నిజానికి అమరావతి, మూడు రాజధానుల సమస్యల‌నే తీసుకుంటే ఒక వైపు చంద్రబాబు ఉంటారు, మరో వైపు జగన్ ఉంటారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలుగా ఏపీలో ఉన్నాయి. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగితే చుట్టుపక్కల జిల్లాల్లో కచ్చితంగా పొలిటికల్ మైలేజ్ వచ్చేది టీడీపీకే. మూడు రాజధానుల వల్ల జగన్ కి గరిష్ట లాభం ఉంది. అమరావతి చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాలను మినహాయించినా తొమ్మిది జిల్లాల మీద వైసీపీ కన్నెసి మరీ మూడు రాజధానులు పేరిట ట్రంప్ కార్డుని వాడుతోంది.

వారికి విధానం ఉందా….?

ఇక బీజేపీ విషయానికి వస్తే జనం నమ్మేలా సీన్ ఏమీ కనిపించడంలేదు. ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజే అమరావతి రాజధాని విషయంలో ఎన్ని వంకర్లు పోవాలో అన్నీ పోయారు. చివరికి ఇపుడు ఆయన అమరావతే మన రాజధాని అంటున్నారు. ఏపీలో బీజేపీ రాజకీయ భూమిక చూసినా, కేంద్రం దాగుడుమూతలు చూసినా, ఇక విభజన హామీల గురించి మాట్లాడుకున్నా కూడా కమలనాధుల మాటలను అమరావతి కోరుతున్న వారు పెద్దగా పట్టించుకోరు. అందువల్ల ఓట్లు రాల్చుకుందామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా వర్కౌట్ కావు అన్న మాట ఉంది.

రెడీ అయిన పవన్…..

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏడాదిగా సాగిన అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం గురించి తన పార్టీ స్టాండ్ ఇది అని కచ్చితంగా వివరించలేకపోయారు. లాంగ్ మార్చ్ చేస్తామని, కేంద్రాన్ని ఒప్పిస్తామని మాటలు బాగానే చెప్పారు కానీ ఆచరణలో ఏమీ లేదు. ఇపుడు అటూ ఇటూ తిరిగి అమరావతే దిక్కు అన్నట్లుగా జనసేన పోరాటం చేస్తోంది. దాని వల్ల జనసేనకు కలసివచ్చేది ఏముందో తెలియదు కానీ ఈ పార్టీలతో పాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వంటి పార్టీలు ఎంతగా మద్దతు ఇస్తే అంతలా టీడీపీకే ఈ పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది. ఎందుకంటే ప్రధాన సామాజికవర్గాలు అన్నీ టీడీపీతోనే ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి, రేపు చంద్రబాబు సీఎం అయితేనే వారి ప్రయోజనాలు నెరవేరుతాయి కాబట్టి. మొత్తానికి చూస్తూటే జగన్ కి మిగిలిన ఏపీ అంతా వదిలేసి అమరావతి రాజధాని కోసం విపక్షాలు అన్నీ పోటీ పడడం చూస్తూంటే వైసీపీకే రాజకీయ లాభం దక్కించేట్లుగా సీన్ కనిపిస్తోంది.

Tags:    

Similar News