జోస్యాలూ…సర్వేలూ…ఇంతకీ అంత సీన్ ఉందా ?

ఎన్నికల ముందే చాలా మంది జోస్యాలు చెబుతూ వస్తారు. మరికొందరు సర్వేల పేరిట తమకు తెలిసినదంతా నిజమని నమ్మిస్తూ ఉంటారు. ఇపుడు చూడబోతే ఎన్నికలకు అచ్చంగా మూడున్నరేళ్ళ [more]

Update: 2020-12-24 08:00 GMT

ఎన్నికల ముందే చాలా మంది జోస్యాలు చెబుతూ వస్తారు. మరికొందరు సర్వేల పేరిట తమకు తెలిసినదంతా నిజమని నమ్మిస్తూ ఉంటారు. ఇపుడు చూడబోతే ఎన్నికలకు అచ్చంగా మూడున్నరేళ్ళ సమయం ఉంది. కానీ సర్వేలకూ జోస్యాలకు యమ గిరాకీ అపుడే వచ్చేసింది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి వైజాగ్ ఆక్టోపస్ గా పేరు సంపాదించుకున్నారు. ఆయన సర్వేలు జోస్యాలు ఎపుడూ ఏకపక్షంగా టీడీపీకే అనుకూలంగా ఉంటాయి. తాజాగా సబ్బం హరి వదిలిన సర్వే అయితే ఏపీలో జగన్ పార్టీకి భారీ ఓటమి తప్పదన్నది.

బాబే సీఎంట ……

ఇక టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న అయితే ఎపుడు ఎన్నికలు జరిగినా బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం వదిలారు. జగన్ ఒక్క చాన్స్ అంటే జనం సానుభూతి చూపి ఇచ్చారని, ఇక జగన్ కి ఇదే మొదటి చివరి చాన్స్ అని కూడా బుద్ధా చెప్పేశారు. ఉత్తరాంధ్రా సహా మొత్తం రాష్ట్రంలోని పదమూడు జిల్లాలూ ఇపుడు చంద్రబాబు పాలన కావాలని కోరుకుంటున్నాయని బుధ్ధా అంటున్నారు. అంతే కాదు 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, అంతదాకా జనం ఓపిక పడితే జగన్ ఇంటికి వెళ్ళకతప్పదని కూడా బుద్ధా గట్టి భరోసా ఇచ్చేశారు.

రాసిపెట్టుకోవాలా..?

ఇక వైసీపీలో కూడా ఇపుడిపుడే సర్వేశ్వరులు పుట్టుకొస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అయితే వచ్చే ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇది రాసిపెట్టుకోవాలని కూడా చాలెంజి చేశారు. అంతేకాదు మరో ముప్పయేళ్ళ పాటు ఏపీకి జగేనే సీఎం అని కూడా ఆయన లాంగ్ టెర్మ్ జాతకాన్ని కూడా చదివేశారు. ఇక వేరే ఆశలేవీ టీడీపీ నేతలు పెట్టుకోకుండా ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇస్తే వారికే మేలు అని కూడా అంటున్నారు. అదే విధంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషనే ఇంకా రాలేదు కానీ మూడు లక్షల మెజారిటీతో వైసెపీ అభ్యర్ధి గెలవడం ఖాయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పేశారు

మురిసిపోతే అంతేనా…?

నిజానికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అని ఉంటాయి. ఇపుడు జోస్యాలు చెబుతున్న నాయకులు ఎవరూ చూడని లోతులు అవి. అవే ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయిస్తాయి. అటూ ఇటూ చేసి మరీ జాతకాలను ఫల్టీ కొట్టిస్తాయి. అప్పట్లో విజన్ 2020 అని తాను వెస్ట్ బెంగాల్ సీఎం జ్యోతీబసు మాదిరిగా పాతికేళ్ళ సీఎం అని చంద్రబాబు కలలు కన్నారు. కానీ నాలున్నర దశాబ్దాల రాజకీయ జీవితం పూర్తి చేసుకుంటే అందులో మూడవ వంతు అంటే 14 ఏళ్ళు మాత్రమే చంద్రబాబు సీఎం కాగలిగారు. ఇదీ రియాలిటీ. ఇపుడు చూస్తే ఏపీలో వైసీపీకి పెద్దగా వ్యతిరేకత లేదు. అదే సమయంలో టీడీపీకి ఊపు ఇచ్చే సీనూ కనిపించడంలేదు. కానీ రాజకీయమ‌నేది నీటి కొలను లాంటిది. ఒక్కసారి వీచే గాలి తాకిడికి అలలు అటూ ఇటూ ఎగిసిపడతాయి. అపుడే తాడు పాము అవుతుంది. సో జోస్యాలు చెప్పేవారి మాటలు విని అధినేతలు మురిసిపోతే ఇంతే సంగతులు అవుతుంది అన్నది మేధావుల మాట.

Tags:    

Similar News